వేద రుక్కులు ఒక్క గొంతుతో..
హైదరాబాద్: ఐదురోజులుగా కొనసాగుతున్న అయుత మహాచండీయాగం నేడు జరిగే మహాపూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి కానుంది. ఈ మహాక్రతువు తుది ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పదిహేను వందలమంది రుత్విజులు చతుర్వేదసంహితలతో వేదరుక్కులను ఒక్క గొంతుతో ఉదానుదాత్త స్వరయుక్తంగా పఠించనుండటం మహాహోమపూర్ణాహుతిలో విశేషం కానుంది.
విశ్వశాంతి, విశ్వకళ్యాణం, తెలంగాణ ప్రజల సౌభాగ్యం మహాసంకల్పంగా పూర్ణాహుతి సుసంపన్నం కానుంది. అయుత చండీయాగానికి సమాపనంగా జరుగుతున్న పూర్ణాహుతికి జగద్గురువు శృంగేరీ శారదాపీఠాధిపతి శ్రీ భారతీతీర్థస్వామీజీ తన ఆశీర్వచనాలతో పాటు కావాల్సిన హోమద్రవ్యాలను, వస్ర్తాలను ఇప్పటికే పంపించారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టు వస్త్రాలను పంపించారు. వీటిని ధరించి నేడు కేసీఆర్ యాగంలో పాల్గొననున్నారు.
పూర్ణాహుతిక్రమమిదే..
ఉదయం 7 గంటలనుంచి పూర్ణాహుతి హోమం ప్రారంభమైంది. పదకొండు వందల మంది రుత్విక్కులు మూలమంత్రాన్ని జపిస్తూ పాయసం, నెయ్యి సమర్పిస్తూ హోమం జరుపుతున్నారు. యాగశాలలో మధ్యభాగంలో ఏర్పాటు చేసిన దుర్గాచక్రం, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మిల సన్నిధిలో మధ్యకుండంలో చండీహోమపూర్ణాహుతి జరుగనున్నది. పూర్ణఫలాలు, పువ్వులు, నవధాన్యాలు, సమిథలు, పట్టువస్ర్తాలు, కొబ్బరికాయలు, సుగంధద్రవ్యాలను పూర్ణాహుతి ద్రవ్యాలుగా ఉపయోగించనున్నారు. మధ్యాహ్నానికి హోమ పూర్ణాహుతి జరుగనున్నట్లు ప్రధాన రుత్విజులు తెలిపారు. అయుతచండీయాగంలో పూర్ణాహుతికి ముందుగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన విష్ణుహోమాన్ని, విష్ణుహోమ పూర్ణాహుతిని కూడా పూర్తి చేసినట్టు వివరించారు. యాగ నిర్వహణలో భాగంగా శనివారం నాటికి నాలుగువేల కిలోల నెయ్యి, 12 క్వింటాళ్ల క్షీరాన్నం, 30 టన్నుల సమిథలను హోమద్రవ్యాలుగా వినియోగించారుగించామన్నారు. ఆదివారం ఉదయం భగవత్పాదులు ఆదిశంకరాచార్య సూచించిన నిమమావళి ప్రకారం చతుర్వేదసంహితలతో కూడిన మహారుద్రహోమాలకు పూర్ణాహుతి జరుగుతుందని పేర్కొన్నారు. గురు ప్రార్దన, పుణ్యాహ వచనము, కుండ సంస్కారము, ప్రధాన కుండములో అగ్ని ప్రతిష్టా, అగ్ని విహరణము, స్థాపిత దేవతా హవనము, సపరివార అయుత చండీయాగం, అయుత లక్ష నవాక్షరీ, ఆజ్యాహుతి, మహా పూర్ణాహుతి, వసోర్దారా, కుమారీ, సుహాసినీ, దంపతీపూజ, మహా మంగళ హారతి, ఋత్విక్ సన్మానము, కలశ విసర్జనము, అనబృధ స్నానము, మహాదాశీర్వచనము, ప్రసాద వితరణము వంటి కార్యక్రమాలతో మొత్తం యాగం సంపూర్ణమవుతుంది.
నేటి ప్రత్యేక అతిథులు..
అయుత చండీయాగానికి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ రానుడడంతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా విధించారు. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువయ్యే అవకాశం ఉంది.