Babu Jagjivanram
-
మహనీయుల మార్గంలో నడవాలి...
నవాబుపేట: అంబేడ్కర్ జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని లింగంపల్లిలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి అయిన అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. తాను అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవి ఆయన పెట్టిన భిక్షేనని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్, జగ్జీవన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రొఫెసర్ కాశిం మాట్లాడుతూ.. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ దేశానికి రెండు కళ్లలాంటివారన్నారు. వీరి జీవిత పాఠాలు అందరికీ స్ఫూర్తిదాయకమని స్పష్టంచేశారు. అన్ని కష్టాలను వారు అనుభవించి మనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన మహానుభావులని కొనియాడారు. అందరూ ఆత్మ గౌరవంతో బతికేందుకు చదువే ఏకై క సాధనమని చాటిచెప్పిన మహనీయులన్నారు. జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి దేశానికి అందరికన్నా ఎక్కువ సేవ చేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. స్వాతంత్రోద్యమంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ప్రస్తుత రిజర్వేషన్లు ఆయన ఘనతేనని తెలిపారు. ఎమ్మార్పీస్ కేవలం రిజర్వేషన్ విభజన కోసమే పుట్టలేదన్నారు. ఆరోగ్యశ్రీ, సామాజిక పింఛన్ల పెరుగుదల ఉద్య మంలో తమది కీలక పాత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడుమూరి ఆనందం,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, సర్పంచు లు సోలిసేట నర్సింలు, రత్నం,పర్మయ్య,రంగారెడ్డి, నాయకులు కళ్యాణ్‌రావ్, ఆనందం పాల్గొన్నారు. -
జీవితంతో బాబూజి
భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘బాబూజి’. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందు తున్న ఈ చిత్రం షూటింగ్ గుంటూరులో జరుగుతోంది. కాగా అదే నగరానికి వెళ్లిన జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ చిత్రంలో జగ్జీవన్‌రామ్ పాత్రధారి మిలటరీ ప్రసాద్‌పై చిత్రీకరిస్తున్న సీన్‌కి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ – ‘‘మహాత్మాగాంధీ ఆహ్వానంతో స్వాతంత్య్ర ఉద్యమంలోకి వచ్చిన జగ్జీవన్‌రామ్ మరెందరినో ఆ ఉద్యమంలోకి తీసుకురావటం, జైలు శిక్ష అనుభవించడం వంటివాటిని ‘బాబూజి’లో తప్పనిసరిగా చూపించాలని మీరాకుమార్ సూచించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, 2024 జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. -
ఘనంగా జగ్జీవన్ జయంతి
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి ఉత్సవాలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పలు పార్టీలు, సంఘాలు జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో.. బీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరు ముందుకు వెళ్లాలన్నారు. సంఘం నాయకులు అన్నదానం జగదీశ్వర్, నర్సోజి, సామల ప్రశాంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇందులో మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుర్గం శేఖర్, యువజన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్, నాహిద్‌లు పాల్గొన్నారు. మోచీ సంఘం ఆధ్వర్యంలో.. మోచీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంపు కార్యాలయ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్‌ని కొనియాడారు. మోచీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల శంకర్‌కృష్ణ, జిల్లా అధ్యక్షుడు సాయన్న, కోశాధికారి గణేశ్, పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్, జగ్జీవన్‌రాం ఆశయసాధనకు కృషి
షాబాద్(చేవెళ్ల): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి కృషి చేస్తానని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంతోపాటు పోతుగల్ గ్రామంలో అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, చంద్రశేఖర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులతో కలసి ఆమె ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షాబాద్‌లోని బహిరంగసభలో మీరాకుమార్ మాట్లాడుతూ.. అన్యాయాన్ని అరికట్టేందుకు అందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో దళితులను చిన్నచూపు చూస్తున్నారని, అలాంటి అసమానతలను సమాజం నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన తండ్రి జగ్జీవన్‌రాం ఆశయాలను పుణికి పుచ్చుకున్న తాను అణగారిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాంటి మహనీయుల ఆశయాలను సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశానని అన్నారు. మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించిన ఈరోజు ఎంతో శుభదినమని, ఇక్కడి ప్రజలు తనను ఎంతో ప్రేమానురాగాలతో స్వాగతించారని చెప్పారు. మీరాకుమార్తోనే రాష్ట్రం ఏర్పాటు: ఉత్తమ్ మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పాస్ అయిందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీలు ఇచ్చిన కేసీఆర్ వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేరెళ్లలో దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టారని, ఖమ్మంలో గిరిజనులపై దాడి చేసిన చరిత్ర వారికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, పార్టీ నాయకుడు రాచమల్లసిద్ధేశ్వర్, టఫ్ అధ్యక్షురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ దళిత ద్రోహి: ఆరేపల్లి మోహన్
సాక్షి, హైదరాబాద్: దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతిని అధికారంగా ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న దళిత నేతలు కూడా జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పించకపోవడం అవమానకరమన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితనేతను కించపరిచేవిధంగా వ్యవహరించిన కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ఓట్లకోసం కుయుక్తులు, మాయ మాటలు తప్ప దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు.