ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి
బద్వేలు అర్బన్/కడప కార్పొరేషన్/కడప రూరల్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రేమోన్మాది లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్యాయత్నం ఘటనలో తీవ్రగాయాలపాలై కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు దస్తగిరమ్మ (16) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సాయంత్రం బద్వేలులో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు దస్తగిరమ్మ మృతదేహాన్ని కడసారి చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఒక్కగానొక్క కుమార్తె ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డుతొలగించుకోవాలనే హత్య: ఎస్పీఇక దస్తగిరమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమెను అడ్డుతొలగించుకోడానికే విఘ్నేష్ ఈ హత్యచేశాడని, అతను విచారణలో కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ హర్షవర్థన్రాజు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు కేసు పూర్వాపరాలు వివరించారు. ఈ కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టుకు సిఫారసు చేస్తామని తెలిపారు.నా బిడ్డను తగలబెట్టిన వాణ్ణి నాకు అప్పగించండి..‘నా బిడ్డ లేకలేక పుట్టింది. నిష్కారణంగా ఆమెను తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి’.. అని మృతురాలు దస్తగిరమ్మ తల్లి హుసేనమ్మ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీ వద్ద ఆమె మీడియా ఎదుట విలపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నానని.. ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాల్సిన ఆమెను అన్యాయంగా చంపేసిన వాడిని అలాగే తాను మట్టుబెడతానన్నారు. సీఎం చంద్రబాబుతోపాటు పోలీసులంతా నాకు న్యాయం చేయాలన్నారు. రేపు మీ బిడ్డలకు ఇదే పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకుంటారా?.. అమ్మాయిలను ఏడిపించే వారు బతకకూడదని ఆమె మండిపడ్డారు.