Bajireddy
-
పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి
నిజామాబాద్: ‘పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పడం కాదని.. జిల్లాలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎంపీ అర్వింద్ చూపించాలని.. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎంపీకి అహంకారంతో ఉన్నారని.. నిజాంషుగర్ ఫ్యాక్టరీ పేరిట మరోసారి బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నారన్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అర్వింద్‌ను కచ్చితంగా ఓడిస్తారన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్నారు. పసుపుబోర్డు పేరుతో ఇప్పటికే ఎంపీ అర్వింద్ ప్రజలను మోసం చేశారన్నారు. ఆయన ఎంపీ కాకముందే పసుపు క్వింటాలుకు రూ. 17వేలు ధర పలికిందన్నారు. పసుపు దిగుబడి తగ్గినందునే ధర పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో ఎంపీ అర్వింద్ అహంకారంతో నడుచుకున్నారని.. ఆయన ఓటమి ఖాయమన్నారు. కేంద్రంలో మోదీ గెలవాలని కానీ.. అర్వింద్, బండి సంజయ్ లాంటి వాళ్లు ఓడిపోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ హామీలు అమలు చేయడం లేదు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, రైతుబంధు ఇవ్వలేదని, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. అధికారంలో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తాను ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతునవుతానని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇవి చదవండి: తర్జన భర్జన! తెరపైకి రోజుకో పేరు.. -
ఓట్ల కోసం ఏదైనా చేస్తారు
సాక్షి, సిద్దిపేట: ‘గోవును, గుడిలో భగవంతున్ని పూజించేది మేము.. కానీ రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీది’అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌లతో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి అని ప్రశ్నించారు. ధరలు పెంచడం తప్ప ఎవరికి ఏం చేశారని నిలదీశారు. జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. కోట్ల కొలువులు ఇస్తా మని ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభు త్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. మిషన్ 90 సీట్లు కాదు: నిరంజన్‌రెడ్డి మిషన్ 90 సీట్ల పేరుతో తెలంగాణలో 90 స్థానాలు గెలుస్తామని ఓ బీజేపీ నాయకుడు అన్నాడని, వాళ్లు మొదటగా 90 మంది అభ్యర్థులను పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికష్టాలొచ్చినా సీఎం కేసీఆర్ రైతుబంధు ఆపలేదని, 10వ విడతలో ఇప్పటికే 42 లక్షల ఎకరాలకు రైతుబంధు వచ్చిందని.. అలాంటి కేసీఆర్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీకి చెందిన వ్యక్తికి చెక్కు ఆపేశా..: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీజేపీకి చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన చెక్కును ఆపేశానని చెప్పారు. ’’ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెక్కు రాలేదని అడిగాడు.. ఇంట్లో రెండు ఫించన్లు ఇస్తున్నా కల్యాణలక్ష్మి చెక్కు ఎందుకు..ఇంకా బీజేపీలో ఎందుకు ఉన్నావ్ ’’అని అడిగానని బాజిరెడ్డి తెలిపారు. గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని ప్రశ్నించానని చెప్పా రు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతూ.. ఇక్కడ మాదిరిగానే మా దగ్గర సైతం ఓ గుండు గాడు ఉన్నాడని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ’’బీజేపీ వాళ్లు జై శ్రీరామ్ అని అంటున్నారు.. మోదీకి భార్య లేదు కాబట్టి శ్రీరాముని భార్య సీతను కూడా విడదీస్తారా.. జై సీతారామ అనాలి’’అని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ, సింగరేణి కార్పొరేషన్లు సంయుక్తంగా చేపట్టిన ‘సింగరేణి దర్శన్’ప్రారంభమైంది. గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించటమే దీని ఉద్దేశం. ప్రతి శనివారం సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సును మంగళవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సింగరేణి దర్శన్ యాత్ర కు వెళ్లాలనుకునేవారు వారం ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకోవాలని బాజిరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ఆలయంతోపాటు కాళేశ్వరం బ్యారేజీని తిలకించేందుకు మరో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి దర్శన్ యాత్రకు వెళ్లాలనుకునేవారు రూ.1600 చార్జి చెల్లించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, యాదగిరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యర్థులను వేధించడంలో బీజేపీ రికార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థులను వేధించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రికార్డులను బ్రేక్ చేసిందని, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితను సంబంధం లేని కేసులో ఇరికించాలనే బీజేపీ చిల్లర రాజకీయాలకు కేసీఆర్ భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణలో అరాచకాలు సృష్టిస్తున్న మోదీ, అమిత్‌షాలపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ‘ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బతుకమ్మ, ఆమె జోలికి వస్తే బీజేపీ బుగ్గిపాలు అవుతుంది. కవిత మీద ఆరోపణలు చేసిన వారి మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి. బీజేపీ రౌడీయిజం, మోడీయిజం తెలంగాణలో నడవవు’ అని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. 60లక్షల మంది కార్యకర్తల బలగమున్న టీఆర్ఎస్ తలచుకుంటే బీజేపీ కార్యకర్తలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. కళంకితులు, అక్రమార్కులకు అడ్డా బీజేపీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తుండటంతో మోదీ, అమిత్‌షాలకు వణుకు పుట్టి అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. కళంకితులు, అక్రమార్కులకు బీజేపీ అడ్డాగా మారిందన్నారు. సీబీఐ సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరిన సింధియా, హేమంత బిశ్వశర్మలపై ఈడీ విచారణ ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా ప్రత్యర్థి పార్టీలపై ఈడీ, సీబీఐలతో బీజేపీ దాడులు చేయిస్తోందన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో బండి సంజయ్ నిక్కర్లు కూడా వేసుకోలేదని, ఆయనకు ఏ విషయంపైనా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అమిత్ షా బూట్లు మోసిన సంజయ్, తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడిని సుమన్ ఖండించారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగోళమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా హెచ్చరించారు. -
TSRTC: లాభాపేక్షతో చూడవద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సేవకోసం ఏర్పాటైన ఆర్టీసీని లాభాపేక్షతో చూడటం సరికాదని, నష్టాల పేరు చెప్పి సంస్థను ప్రైవేటీకరించే దిశగా ఆలోచించడం సరికాదని వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను గురువారం ఆయా సంఘాల నేతలు కలసి అభినందించారు. ఈ సందర్భంగా సంస్థను గట్టెక్కించే దిశలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు. మూడునాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రానిపక్షంలో ప్రైవేటుపరం చేస్తామని ముఖ్యమంత్రి అన్నట్టుగా చైర్మన్ పేర్కొనటాన్ని వారు ప్రస్తావించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఎన్నో ఇబ్బందులకు గురైందని, దాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్నులు లేకుండా చూస్తే పరిస్థితి మెరుగవుతుందని సూచించారు. కమాల్‌రెడ్డి, నరేందర్ ఆధ్వర్యంలో ఎన్ఎంయూ నేతలు, హనుమంతు నేతృత్వంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ నేతలు బాజిరెడ్డిని కలిశారు.