మీడియాతో మాట్లాడుతున్న బాజిరెడ్డి, బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థులను వేధించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రికార్డులను బ్రేక్ చేసిందని, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితను సంబంధం లేని కేసులో ఇరికించాలనే బీజేపీ చిల్లర రాజకీయాలకు కేసీఆర్ భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణలో అరాచకాలు సృష్టిస్తున్న మోదీ, అమిత్‌షాలపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
‘ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బతుకమ్మ, ఆమె జోలికి వస్తే బీజేపీ బుగ్గిపాలు అవుతుంది. కవిత మీద ఆరోపణలు చేసిన వారి మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి. బీజేపీ రౌడీయిజం, మోడీయిజం తెలంగాణలో నడవవు’ అని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. 60లక్షల మంది కార్యకర్తల బలగమున్న టీఆర్‌ఎస్ తలచుకుంటే బీజేపీ కార్యకర్తలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.
కళంకితులు, అక్రమార్కులకు అడ్డా బీజేపీ
బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తుండటంతో మోదీ, అమిత్‌షాలకు వణుకు పుట్టి అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. కళంకితులు, అక్రమార్కులకు బీజేపీ అడ్డాగా మారిందన్నారు. సీబీఐ సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరిన సింధియా, హేమంత బిశ్వశర్మలపై ఈడీ విచారణ ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా ప్రత్యర్థి పార్టీలపై ఈడీ, సీబీఐలతో బీజేపీ దాడులు చేయిస్తోందన్నారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో బండి సంజయ్ నిక్కర్లు కూడా వేసుకోలేదని, ఆయనకు ఏ విషయంపైనా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అమిత్ షా బూట్లు మోసిన సంజయ్, తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడిని సుమన్ ఖండించారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగోళమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment