Balaji naidu
-
33 కేసులు.. 22 సార్లు జైలు..
సాక్షి, తిరుపతి: రాజకీయ నాయకులు, నిరుద్యోగులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద రూ.25 లక్షల రుణం ఇప్పిస్తామని చెప్పి రూ.2.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయించుకున్న కేసులో అతడిని ఆదివారం శ్రీకాళహస్తిలో పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 60 మంది ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన ఇతగాడిపై ఏపీ, తెలంగాణల్లోని పలు పోలీస్ స్టేషన్లలో 33 కేసులు నమోదు కాగా 22 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీనాయుడు కాకినాడలోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజినీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశాడు. విశాఖలో పనిచేస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆ కేసుతో ఉద్యోగం కోల్పోయి జైలుకెళ్లాడు. బుద్ధి మార్చుకోకుండా.. విశాఖ జైలు నుంచి బయటకు వచ్చిన బాలాజీనాయుడు వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలంటూ, వారి నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించాడు. ఆ తరువాత డిపాజిట్ పేరుతో కొంత మొత్తం దండుకొని మోసం చేశాడు. విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే తరహాలో మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజకీయ నేతల నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుపాలయ్యాడు. పలువురు ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి రుణాలిప్పిస్తామంటూ వారి పీఏల ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ.1,060 వంతున రూ.3.50 లక్షలు రాబట్టాడు. బీజేపీ నేత రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చాక అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్‌లను బురిడీ కొట్టించాడు. 2015లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. విడుదలైన బాలాజీ పలు మోసాలు చేశాడు. అతడి మాటలు నమ్మి తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించారు. 2018లో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ భర్తకు ఫోన్‌చేసి రూ.30 వేలు ఇస్తే రూ.2 కోట్ల కేంద్ర నిధుల పెండింగ్ ఫైల్ క్లియర్ చేయిస్తానని చెప్పారు. దీనిపై సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో బాలాజీని అరెస్టు చేశారు. -
కలెక్టరేట్ ఎదుట వ్యక్తి మృతి
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఉమానగర్‌కు చెందిన టి. బాలాజీనాయుడు(52) శుక్రవారం వ్యక్తిగత పని నిమిత్తం సంగమేష్ సర్కిల్ నుంచి ఎస్కేయూ వైపు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఎస్కేయూ నుంచి వస్తున్న లారీ కలెక్టరేట్ ఎదురుగా చెరువుకట్ట వైపు తిరుగుతూ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బాలాజీనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. 20 నిమిషాలైనా 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో స్థానికులు, పోలీసులు ప్రైవేటు వాహనంలో క్షతగ్రాతుడిని సర్వజనాస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కాసేపటికే మృతి చెందాడు. బాలాజీనాయుడుకు భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. లారీని ట్రాఫిక్ ఎస్ఐలు జాకీర్‌హుస్సేన్, లక్ష్మినారాయణలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. -
నేతలకు ఉద్యోగాల వల!
సాక్షి, హైదరాబాద్: అతడో ఘరానా మోసగాడు... రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టుల్లో ఉద్యోగాల పేరు చెప్పి ఇప్పటి వరకు 22 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు. మరో ముగ్గురు పార్లమెంట్ సభ్యులకు టోపీ పెట్టి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా చిక్కాడు. ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు(34) చరిత్ర ఇదీ! నిందితుడు ఇప్పటి వరకు 17 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని, ఇటీవల ఉద్యోగాల పేరుతో ఎంపీలు వీహెచ్, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్రెడ్డిల నుంచి రూ.3.07 లక్షలు సేకరించాడని క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు వెల్లడించారు. బీటెక్ చదివి... ఏసీబీకి చిక్కి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీనాయుడు బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంలలో పని చేశాడు. వైజాగ్‌లో ఉండగా 2008లో తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు చిక్కడంతో ఉద్యోగం కోల్పోయాడు. జైలు నుంచి బయటకు రాగానే మోసాలతో విజృంభించాడు. బీఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ నంబర్లు... ఈసారి ముగ్గురు ఎంపీలు! నిందితుడు బీఎస్ఎన్ఎల్ ఎంక్వైరీ నం.197ను సంప్రదించి పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లు సేకరించాడు. రాజీవ్ యువకిరణాల పేరుతో దాని ప్రాజెక్ట్ డెరైక్టర్‌నంటూ ఎర వేశాడు. ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలను టార్గెట్ చేశాడు. వారి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలని సూచించాడు. ఒక్కో అభ్యర్థి కోసం దరఖాస్తు రుసుము రూ.500, మెస్ చార్జీల కింద రూ.560 కలిపి రూ.1,060 చొప్పున వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయమని కోరాడు. వీరు డిపాజిట్ చేయగానే డబ్బు డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఎంపీలు హనుమంతరావు రూ.1,09,500, దేవేందర్‌గౌడ్ రూ.66,000, గోవర్థన్‌రెడ్డి రూ.1,32,000 డిపాజిట్ చేశారు. అనంతరం ఫోన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో అనుమానంతో వారు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ పి.రాజు నేతృత్వంలో ఏఎస్సై ఎస్.సుదర్శన్, కానిస్టేబుళ్లు సతీష్, సలీమ్‌లతో కూడిన ప్రత్యేక బృందం సాంకేతికంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి, అరెస్టు చేసింది. -
ఎమ్మెల్యేలు, ఎంపీలకు టోకరా వేసిన మోసగాడి అరెస్ట్
ఎమ్మెల్యేలు, ఎంపీలకే టోకరా వేసిన ఘరానా మోసగాడు బాలాజీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు గురువారం అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ యువకిరణాల పేరుతో బాలాజీ నాయుడు చాలామందిని మోసం చేశాడు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధితులుగా ఉండటం గమనార్హం. ఉద్యోగాల పేరుతో 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల నుంచి లక్షల్లో నగదు వసూలు చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.