balasauri
-
‘కడప స్టీల్ ప్లాంట్‌కు వైఎస్సార్ పేరు’
ఢిల్లీ: కడప జిల్లాలో డిసెంబర్ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బలశౌరి అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఎంపీ సోమవారం లోక్‌సభలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి స్పదిస్తూ.. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ముడి ఇనుము దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు. త్వరలో కడపలో ఏర్పాటు కాబోయే స్టీల్ ప్లాంట్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ఎంపీ బాలశౌరి కోరారు. జస్టిస్ ఫర్ దిశ అత్యాచార ఘటన అందరిని తలదించుకునేలా ఉందన్నారు. ఆ ఘటనకు పాల్పడిన మానవ మృగాలను శిక్షించటంలో ఆలస్యం చేయవద్దని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా కఠిన శిక్షలు విధించాలని ఎంపీ తెలిపారు. అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ చిల్లర పనులు మానుకోవాలని ఎంపీ హెచ్చరించారు. తిరుపతి వెబ్సైట్లో లేనిపోని అంశాలను వారే సృష్టించి అన్యమత ప్రచారం పేరిట దుష్ప్రచారనికి దిగుతున్నారని ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. -
వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ శనివారం బులెటిన్ విడుదల చేసింది. అత్యంత కీలకమైన ఈ కమిటీలో వివిద పార్టీలకు చెందిన 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. వాణిజ్య శాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు ఈ కమిటీ పరిశీలనకు వస్తాయి. ఆ బిల్లులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. బిల్లులో అవసరమైన మార్పులు, సలహాలతో సమగ్రమైన నివేదికను రూపొందిస్తుంది. ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. వాణిజ్య శాఖ పనితీరుపై వార్షిక నివేదికల పరిశీలనతో పాటు దీర్ఘకాలిక విధానాలపై ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి(వైఎస్సార్సీపీ), కేశినేని నాని, తోట సీతారామలక్ష్మి(టీడీపీ), కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్) సభ్యులుగా ఉన్నారు. మరికొన్ని కమిటీల ఏర్పాటు వాణిజ్య కమిటీతో పాటు ఇతర శాఖలకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఆర్థిక, రక్షణ, వాణిజ్యం, విదేశీ వ్యవహారాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి వంటి పలు కీలక శాఖల కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు చోటు దక్కించుకున్నారు. కీలకమైన ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా జయంత్ సిన్హా (బీజేపీ) నియమితులయ్యారు. సభ్యులుగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బాలశౌరి (వైఎస్సార్సీపీ), జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ (బీజేపీ) తదితరులున్నారు. - హోం శాఖ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ : చైర్మన్.. ఆనంద్‌శర్మ(కాంగ్రెస్), సభ్యులు.. వంగా గీత (వైఎస్సార్సీపీ) తదితర 31 మంది - మానవ వనరుల అభివృద్ధి శాఖ వ్యవహారాల కమిటీ: సభ్యులు.. లావు శ్రీకృష్ణదేవరాయలు(వైఎస్సార్సీపీ) తదితరులు - పరిశ్రమలశాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ : చైర్మన్.. కె.కేశవరావు (టీఆర్ఎస్), సభ్యులు.. వైఎస్ అవినాశ్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) తదితరులు - రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ కమిటీ: చైర్మన్.. టీజీ వెంకటేశ్(బీజేపీ), సభ్యులు.. గొడ్డేటి మాధవి(వైఎస్సార్సీపీ) తదితరులు - ఐటీశాఖ కమిటీ : సభ్యులు.. ఎంవీవీ సత్యనారాయణ(వైఎస్సార్సీపీ), సుజనాచౌదరి (బీజేపీ) - రక్షణశాఖ కమిటీ : సభ్యులు.. కోటగిరి శ్రీధర్ (వైఎస్సార్సీపీ) తదితరులు - విదేశీ వ్యవహారాల కమిటీ: సభ్యులు.. మార్గాని భరత్ (వైఎస్సార్సీపీ), గల్లా జయదేవ్ (టీడీపీ) - పట్టణాభివృద్ధి శాఖ కమిటీ: సభ్యులు.. ఆదాల ప్రభాకర్‌రెడ్డి(వైఎస్సార్సీపీ), సుజనా చౌదరి (బీజేపీ) - నీటి వనరుల శాఖ కమిటీ: సభ్యులు.. గోరంట్ల మాధవ్(వైఎస్సార్సీపీ) తదితరులు - గ్రామీణాభివృద్ధిశాఖ కమిటీ: సభ్యులు.. తలారి రంగయ్య(వైఎస్సార్సీపీ), రామ్మోహన్నాయుడు(టీడీపీ) - బొగ్గు, ఉక్కుశాఖ కమిటీ : సభ్యులు.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డా.వెంకటసత్యవతి, రఘురామకృష్ణంరాజు(వైఎస్సార్సీపీ) తదితరులు - సామాజిక న్యాయ శాఖ కమిటీ: సభ్యులు.. దుర్గాప్రసాద్(వైఎస్సార్సీపీ) - పెట్రోలియం, సహజ వాయువులశాఖ కమిటీ: సభ్యులు.. కనకమేడల రవీంద్రకుమార్ -
గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతా..
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్తుతామని బాలశౌరి చెప్పారు. అలాగే మన ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌లాంటి హాస్పటల్స్‌తోపాటు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి సంబంధించి గుంటూరు ప్రత్తి పంటకు కేంద్రంగా ఉన్నందున స్పిన్నింగ్‌మిల్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో స్పైసస్ బోర్డు శంకుస్థాపన చేశారని దీన్ని పునఃనిర్మాణం చేస్తామన్నారు. అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి.. వ్యాలీ యాడెడ్ చేస్తే రైతులకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఒక విజన్‌తో ముందుకు వచ్చిన జగన్‌ను ప్రజలు ఆశీర్వదించే సమయం ఆసన్నమైందని బాలశౌరి చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకుంటామని స్పష్టం చేశారు. జగన్ సీఎం కాగానే గుంటూరులో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిన్నటి వరకు దొంగలు, హంతకులు, అవినీతి పరులు అని ఇప్పుడు టీడీపీలో చేర్చుకొని టిక్కెట్లు ఎలా ఇస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ముందడుగు అంటూ ప్రచారం చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా ముందడుగంటే శోభన్‌బాబు సినిమానే కదా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలాగే ఇప్పటికే జిల్లాపరిషత్, మండలపరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసిందని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రాతంశెట్టి రామాంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.