వీఐపీ వాహనాల సైరన్లపై నిషేధం
బిహార్ రాజధాని నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోవడంతో అక్కడి సీఎం నితీష్ కుమార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ వాహనాలకు, ఎస్కార్ట్ వాహనాలకు సైరన్లు వాడకూడదంటూ నిషేధం విధించారు. అయితే గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఎస్కార్టు వాహనాలకు, అంబులెన్సులు, ఫైరింజన్లకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు.
హోంశాఖ సమీక్ష సమావేశం సందర్భంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్నాలో పెరిగిపోతున్న శబ్ద కాలుష్యం పట్ల నితీష్ ఆందోళన వ్యక్తం చేశారు. అనవసరంగా హారన్లు ఉపయోగించకుండా వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించాలని రవాణా, పర్యావరణ, అటవీ శాఖలను సీఎం ఆదేశించారు. వీఐపీలు, వీవీఐపీల వాహనాలు ఆస్పత్రులు, విద్యాసంస్థల్లాంటి సైలెంట్ జోన్లలో కూడా సైరన్లను మోతెక్కిస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.