రద్దయిన నోట్ల కట్టలే పాన్పుగా..
బెంగళూరు: బాంబ్‌నాగ ఇంటితో పాటు వాణిజ్యకట్టడంలోని స్వచ్ఛంద సంస్థ ఉన్న కార్యాలయం, మూడో అంతస్తులో పోలీసులు సోదాలు జరపగా కట్టలు కట్టలు రూ.500, రూ.1000 నోట్లు బయటపడ్డాయి. 10 బాక్సులు, 3 బ్యాగుల్లో నోట్ల కట్టలు పేర్చి వాటిపై పరువును ఉంచారు. నోట్లు లెక్కించే యంత్రాలను తెప్పించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దు పోయే వరకూ నోట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అంతే కాకుండా స్థిర చరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు కూడా పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి.
ఇది కాక నెలమంగళలోని ఇతనికి గల మరో భవంతిలో పెద్ద మొత్తంలో రద్దైన నోట్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జాయింట్ కమిషనర్ హేమంత్ నింబాల్కర్ మీడియాతో ట్వీట్ చేస్తూ ‘నాగ ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.14.80 కోట్ల విలువ చేసే రద్దైన రూ.500, రూ.1,000 నోట్లు, 2 కత్తులు లభించాయని సోదాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు పైకి రూ.14.80 కోట్లు అని చెబుతున్నా ఉమేష్ అండ్ అతనికి సహకారం అందించిన వారందరినీ బెదిరించి దాదాపు రూ.50 కోట్లకు పైగా రద్దైన కరెన్సీని బాంబ్‌నాగ సేకరించనుట్ల తెలుస్తోంది.
వివరాలు.. అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న ఓ రౌడీషీటర్, మాజీ కార్పోరేటర్ ఇంటిలో కట్టల కట్టల రద్దైన రూ.500, రూ.1,000 నోట్లు పోలీసుల సోదాల్లో బయటపడ్డాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు దాదాపు 50 మంది పోలీసుల కన్నుగప్పి తప్పించుకుపోగా అతని కోసం దాదాపు ఐదు ప్రత్యేక బృందాలు కర్ణాటకతో పాటు పొరుగురాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. పోలీసులతో పాటు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రౌడీషీటర్ అయిన నాగరాజు అలియాస్ బాంబ్‌నాగ బెంగళూరులోని శ్రీరాంపురలోని మూడు అంతస్తుల ఇంట్లో ఉంటున్నారు.
ఇతనికి స్థానికంగా మరో రెండు అపార్టుమెంట్లు, ఒక వాణిజ్య భవనాలు ఉన్నాయి. మొదటి నుంచి అసాంఘిక కార్యకలాపాల్లో ఉండేవారు. నేపథ్యంలోనే గత మార్చి 18న నగరానికి చెందిన ఉమేష్ అనే పారిశ్రామిక వేత్తతో పాటు అతని స్నేహితులైన కిషోర్, గణేష్‌లను కిడ్నాప్ చేసి శ్రీరాంపులోని తన ఇంటి మూడో అంతస్తులో బంధించాడు. అనంతరం వారిని బెదిరించి దాదాపు రూ.50 లక్షల నగదు వసూలు చేసి వదిలి పెట్టారు. అటు పై మరింత డబ్బు కావాలని ఉమేష్ పై బాంబ్‌నాగ ఒత్తిడి తీసుకువచ్చాడు.
మొదట్లో ఇతనికి బయపడి పోలీసులకు విషయం తెలపని ఉమేష్ చివరికి వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 7న హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. అయితే ఉమేష్ మటలకు నడవడికకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఉమేష్‌ను తమ దైన శైలిలో విచారించారు. దీంతో వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. రదై్దన పాత నోట్లను మార్చే విషయానికి సంబంధించి ఉమేష్‌తో పాటు కొంతమందికి సంబం«ధం ఉన్నట్లు సదరు ఉమేష్‌ను బంధించినప్పుడు బాంబ్‌నాగకు తెలిసింది.
దీంతో ఇప్పటి వరకూ వారు బ్లాక్ అండ్ వైట్ కోసం సేకరించిన మొత్తం సొమ్ము తనకు ఇచ్చి బదులుగా తాను ఇచ్చే కొంత సొమ్మును పట్టుకు వెళ్లాలని బాంబ్ నాగ హుకుం జారీ చేశారు. దీనికి ఒప్పుకోక పోవడంతోనే ఉమేష్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు సదరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సర్చ్వారెంటును తీసుకున్నారు. బాంబ్‌నాగకు కిడ్నాప్ కేసులో విచారణ చేయడం కోసమంటూ ఆయన ఇంటికి డీసీపీ అజయ్ నేతృత్వంలో 50 మంది పోలీసులు శుక్రవారం తెల్లవారుజాము 5:30 గంటలకు వెళ్లారు.
అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న బాంబ్‌నాగ మూడంతస్తుల్లో ప్రతి అంతస్తుకు ప్రవేశించే మార్గంలోని ప్రధాన గేటుకు బయటి నుంచి తాళం వేసుకుని లోపల ఉండిపోయారు. దీంతో పోలీసులు తాళాలను విరగొట్టిలోపలికి ప్రవేశించారు. అయితే పోలీసులు టెర్రస్ పై భాగానికి చేరుకునే లోపు బాంబ్‌నాగ టెర్రస్ పై నుంచి పక్కన ఉన్న భవంతికి చేరుకుని అక్కడి నుంచి పోలీసుల కన్నుగప్పి పరారైనట్లు తెలుస్తోంది.