Bangalore University
-
బెంగళూరు వర్సిటీ ఘనత.. పరీక్ష రాసిన పదేళ్ల తర్వాత ఫలితాలు!
శివాజీనగర(బెంగళూరు): సాధారణంగా పరీక్ష ఫలితాలు నెల, రెండు నెలలు ఆలస్యం కావడం చూశాము, అయితే ఏకంగా పదేళ్ల క్రితం రాసిన డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించి బెంగళూరు విశ్వవిద్యాలయం ఒక అరుదైన ఘనతను సాధించింది. వివరాలు...2013లో 110 మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ పరీక్షలు రాశారు. ఈ విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు మాయమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఫలితాలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సిండికేట్ సభ్యుడు టీవీ రాజు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. వారి నివేదిక ఆధారంగా గత పరీక్షల్లో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా ఫలితాలను మంగళవారం ప్రకటించనున్నారు. చదవండి మహిళా ఐపీఎస్, ఐఏఎస్‌ల గొడవ.. సర్కారు సీరియస్.. ఇద్దరికీ నోటిసులు -
రెండున్నర గంటల్లోనే వర్సిటీ పరీక్షల ఫలితాలు
బెంగళూరు : యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు రావాలంటే సాధారణంగా పది లేదా పదిహేను రోజులు పడతాయి. కొన్ని యూనివర్సిటీలు మరికొంత ఆలస్యం చేస్తాయి. కానీ తక్కువ సమయంలో ఫలితాలు మాత్రం ప్రకటించవు. ఈ కోవకు చెందినదే బెంగళూరు యూనివర్సిటీ కూడా. ఫలితాల ప్రకటనలో ఈ యూనివర్సిటీ చేసినంత జాప్యం మరొక యూనివర్సిటీ చేయదు. కానీ ఈసారి బెంగళూరు యూనివర్సిటీ సోమవారం అరుదైన రికార్డును సాధించింది. తనకున్న పేరును తిరగ రాసుకుంది. మొట్టమొదటిసారి పరీక్షలు అయిపోయిన రెండున్నర గంటల వ్యవధిలోనే బీఈ(సివిల్ ఇంజనీరింగ్) ఏడు, ఎనిమిది సెమిస్టర్ల ఫలితాలను ప్రకటించింది. బెంగళూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఒకే ఒక్క ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ‘ది యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్’. దీని ఫలితాల ప్రకటనలోనే బెంగళూరు యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది. ప్రతి సబ్జెట్ సమాధాన పత్రాలను, పరీక్ష అయిపోయిన వెంటనే మూల్యాంకనం చేసే వాళ్లమని బెంగళూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ శివరాజు చెప్పారు. దీంతో గత 10 రోజులుగా జరుగుతున్న అన్ని సబ్జెట్ పరీక్ష పేపర్లను వెంటనే మూల్యాంకనం చేయడం ముగించామని తెలిపారు. 139 మంది విద్యార్థులు ఈ సారి పరీక్షలకు హాజరయ్యారని, ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం బెంగళూరు యూనివర్సిటీ చరిత్రలోనే ఇది మొదటిసారని పేర్కొన్నారు. లేదంటే ఎనిమిది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందన్నారు. మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరిచినందుకు తాము చాల సంతోషంగా ఉన్నామని ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్ పీ తెలిపాడు. వెనువెంటనే ఫలితాలతో ఉన్నత విద్యకు వెళ్లడానికి లేదా ఉద్యోగం వెతుకుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. సోమవారం రోజు తాము ఆఖరి పేపరు పరీక్ష రాశామని, అది మధ్యాహ్నం రెండు గంటలకు అయిపోతే, సాయంత్రం నాలుగున్నర వరకు మొత్తం ఫలితాల ప్రకటన వచ్చేసిందని చెప్పాడు. కాలేజీ స్టాఫ్‌కు, బెంగళూరు యూనివర్సిటీ మూల్యాంకన వింగ్‌కు యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మాజీ ప్రిన్సిపాల్, బెంగళూరు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ కేఆర్ వేణుగోపాల్ కృతజ్ఞతలు చెప్పారు. -
పరిశోధించి సాధిస్తా: రాహుల్ ద్రవిడ్
బెంగళూరు యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించాడు. ‘క్రీడల్లో ఓ సబ్జెక్టును ఎంచుకుని పరిశోధించి డాక్టరేట్‌ను సంపాదిస్తాను తప్ప గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించను’ అని స్పష్టం చేశాడు. ఈ నెల 27న బెంగళూరు యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్భంగా ద్రవిడ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తామని ప్రకటించగా అతను పైవిధంగా స్పందించాడు. ప్రస్తుతం అతను అండర్–19 భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. -
ప్రముఖ శాస్త్రవేత్తలకు ‘ఇస్కా’ అవార్డులు
హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు మిలీనియం ప్లేగ్ ఆఫ్ హానర్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: సైన్స్ కాంగ్రెస్‌లో 20 మంది భారత శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఇస్కా)–2016 పురస్కారాలను ప్రదానం చేశారు. గతంలో ఇస్కా సదస్సులకు జనరల్ ప్రెసి డెంట్‌గా వ్యవహరించిన అశోక్‌కుమార్ సక్సేనా కు శాస్త్రవేత్త అశుతోశ్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు లభించింది. బెంగళూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.భైరప్పకు సీవీ రామన్ బర్త్ సెంటినరీ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని ‘ఎయిమ్స్’ ప్రొఫెసర్ ఎన్ఆర్ జగన్నాథానికి ఎస్కే మిత్ర బర్త్ సెంటినరీ అవార్డు దక్కింది. మణిపూర్ వర్సిటీ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్‌కు బీర్బల్ సహానీ బర్త్ సెంటినరీ అవార్డును అంద జేశారు. చెన్నై ఆస్పత్రి కార్డియాలజిస్ట్ ఐ.సత్య మూర్తికి డీఎస్ కేతారి మెమోరియల్ అవార్డు లభించింది. వెస్ట్‌బెంగాల్ వర్సిటీ ఆఫ్ టెక్నాల జీలో ప్రొ.బీపీ చటర్జీకి ఆర్సీ మల్హోత్రా మెమోరి యల్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. నోబెల్ గ్రహీతలకు గోల్డ్ మెడల్స్ నోబెల్ పురస్కార గ్రహీతలకు ప్రధాని ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్స్‌ను ప్రదానం చేశారు. ప్రొఫెసర్ మోర్నార్ విలియం ఎస్కో (అమెరికా) మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్), ప్రొఫెసర్ టకాకి కజిటా(జపాన్), ప్రొఫెసర్ సర్జే హరోచి(ఫ్రాన్స్), ఫ్రొఫెసర్ అడా ఇ యెనాత్ (ఇస్రాయిల్), ప్రొఫెసర్ టిరోలే (ఫ్రాన్స్)లకు పతకాలను అందజేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావుకు మిలీనియం ప్లేగ్ ఆఫ్ హానర్ అవార్డు లభించింది. మొక్కల్లో ఇమ్యూనైజేషన్ అభివృద్ధికి విస్తృత పరిశోధనలు చేస్తున్న అప్పారావు స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రఖ్యాత శాస్తవేత్త తపతీ బెనర్జీకి కూడా బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. మిగతా వారికి నేడుప్రదానం చేయనున్నారు. -
ఇక డిగ్రీ నాలుగేళ్లు
= బీయూ వైస్ చాన్సలర్ తిమ్మేగౌడ = ‘ఢిల్లీ’ తరహా కోర్సు = రాష్ట్రానికి తగ్గట్టు మార్పులు = అన్ని కోర్సులకూ వర్తింపు = పీజీతో నిమిత్తం లేకుండా పీహెచ్‌డీకి = పరిశోధనల్లో లోపించిన నాణ్యత = మరిన్ని పరిశోధనా కేంద్రాలు అవసరం సాక్షి, బెంగళూరు : బెంగళూరు విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) కోర్సు స్థానంలో నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టనున్నట్లు వర్శిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ తిమ్మేగౌడ వెల్లడించారు. బెంగళూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కన్నడ ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన కన్నడ సంస్కృతి శిబిరంతో పాటు కళాశాల ఆవరణంలో ఏర్పాటైన కన్నడ పరిశోధన కేంద్రాన్ని కన్నడ ప్రాధికార సంస్థ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ తిమ్మేగౌడ మాట్లాడుతూ... ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతమున్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఇక్కడ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తగ్గట్టు ఇందులో కొన్ని మార్పులు చేసి వచ్చే ఏడాది నుంచి తమ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో అమలు చేస్తామని చెప్పారు. ఈ విధానం బీఏ, బీకాం, బీఎస్సీ తదితర అన్ని కోర్సులకూ వర్తింప చేయనున్నట్లు వివరించారు. ఈ కోర్సు తరువాత పీజీ చేయకుండానే పీహెచ్‌డీకి అర్హత పొందుతారని పేర్కొన్నారు. ఈ విధానంలో రెండేళ్ల డిగ్రీ కోర్సు చదివి మధ్యలో మానేసినా అసోసియేట్ డిగ్రీ సర్టిఫికెట్‌ను అందజేస్తామని అన్నారు. ఇది మూడేళ్ల డిగ్రీ కోర్సుకు సమానమని తెలిపారు. అదేవిధంగా రెండేళ్లు ఒక కాలేజీలో.. మరో రెండేళ్లు వేరొక కళాశాలలో చదవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై త్వరలో జరిగే సిండికేట్ మీటింగ్‌లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, నాలుగేళ్ల కోర్సు వచ్చిన తర్వాత కూడా మూడేళ్ల డిగ్రీ కోర్సును చదవడానికి అవకాశం ఉంటుందని... నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఐచ్ఛికమని (ఆప్షన్) తెలిపారు. అయితే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు విదేశాల్లో అమల్లో ఉండటంతో.. ఆ విధానంలో డిగ్రీ పొందిన విద్యార్థులకు విదేశాల్లో తదుపరి విద్యా, ఉపాధి అవకాశాలు త్వరగా లభించే అవకాశం ఉందని వివరించారు. పరిశోధనల్లో నాణ్యత పెరగాలి... పరిశోధన విద్యార్థులు అందజేస్తున్న పరిశోధనా పత్రాల్లో నాణ్యత ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయంటూ తిమ్మేగౌడ అసహనం వ్యక్తం చేశారు. ఎంఫిల్ స్థాయి పరిశోధన పత్రాలను సాగదీసి పీహెచ్డీ పత్రాలుగా అందజేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై ఇలాంటి వాటికి వర్శిటీలో తావుండదని, ఈ మేరకు నిబంధనలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరిన్ని పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ఔత్సాహిక విద్యా సంస్థ నిర్వాహకులు ముందుకు వస్తే బెంగళూరు విశ్వవిద్యాలయం అసరమైన సాకారం అందిస్తుందని చెప్పారు. కాగా, కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రు కళాశాలలో నేమ్ప్లేట్లు ఆంగ్లంలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని కన్నడలో రాయాల్సిందిగా అధ్యాపకులకు సూచించారు.