= బీయూ వైస్ చాన్‌సలర్ తిమ్మేగౌడ
= ‘ఢిల్లీ’ తరహా కోర్సు
= రాష్ట్రానికి తగ్గట్టు మార్పులు
= అన్ని కోర్సులకూ వర్తింపు
= పీజీతో నిమిత్తం లేకుండా పీహెచ్‌డీకి
= పరిశోధనల్లో లోపించిన నాణ్యత
= మరిన్ని పరిశోధనా కేంద్రాలు అవసరం
సాక్షి, బెంగళూరు : బెంగళూరు విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) కోర్సు స్థానంలో నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టనున్నట్లు వర్శిటీ వైస్‌చాన్‌సలర్ డాక్టర్ తిమ్మేగౌడ వెల్లడించారు. బెంగళూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కన్నడ ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన కన్నడ సంస్కృతి శిబిరంతో పాటు కళాశాల ఆవరణంలో ఏర్పాటైన కన్నడ పరిశోధన కేంద్రాన్ని కన్నడ ప్రాధికార సంస్థ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీసీ తిమ్మేగౌడ మాట్లాడుతూ... ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతమున్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఇక్కడ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తగ్గట్టు ఇందులో కొన్ని మార్పులు చేసి వచ్చే ఏడాది నుంచి తమ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో అమలు చేస్తామని చెప్పారు. ఈ విధానం బీఏ, బీకాం, బీఎస్సీ తదితర అన్ని కోర్సులకూ వర్తింప చేయనున్నట్లు వివరించారు.
ఈ కోర్సు తరువాత పీజీ చేయకుండానే పీహెచ్‌డీకి అర్హత పొందుతారని పేర్కొన్నారు. ఈ విధానంలో రెండేళ్ల డిగ్రీ కోర్సు చదివి మధ్యలో మానేసినా అసోసియేట్ డిగ్రీ సర్టిఫికెట్‌ను అందజేస్తామని అన్నారు. ఇది మూడేళ్ల డిగ్రీ కోర్సుకు సమానమని తెలిపారు. అదేవిధంగా రెండేళ్లు ఒక కాలేజీలో.. మరో రెండేళ్లు వేరొక కళాశాలలో చదవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయమై త్వరలో జరిగే సిండికేట్ మీటింగ్‌లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, నాలుగేళ్ల కోర్సు వచ్చిన తర్వాత కూడా మూడేళ్ల డిగ్రీ కోర్సును చదవడానికి అవకాశం ఉంటుందని... నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఐచ్ఛికమని (ఆప్షన్) తెలిపారు.
అయితే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు విదేశాల్లో అమల్లో ఉండటంతో.. ఆ విధానంలో డిగ్రీ పొందిన విద్యార్థులకు విదేశాల్లో తదుపరి విద్యా, ఉపాధి అవకాశాలు త్వరగా లభించే అవకాశం ఉందని వివరించారు.
పరిశోధనల్లో నాణ్యత పెరగాలి...
పరిశోధన విద్యార్థులు అందజేస్తున్న పరిశోధనా పత్రాల్లో నాణ్యత ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయంటూ తిమ్మేగౌడ అసహనం వ్యక్తం చేశారు.
ఎంఫిల్ స్థాయి పరిశోధన పత్రాలను సాగదీసి పీహెచ్‌డీ పత్రాలుగా అందజేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై ఇలాంటి వాటికి వర్శిటీలో తావుండదని, ఈ మేరకు నిబంధనలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరిన్ని పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ఔత్సాహిక విద్యా సంస్థ నిర్వాహకులు ముందుకు వస్తే బెంగళూరు విశ్వవిద్యాలయం అసరమైన సాకారం అందిస్తుందని చెప్పారు. కాగా, కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రు కళాశాలలో నేమ్‌ప్లేట్లు ఆంగ్లంలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని కన్నడలో రాయాల్సిందిగా అధ్యాపకులకు సూచించారు.
ఇక డిగ్రీ నాలుగేళ్లు
Published Thu, Nov 7 2013 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement