బెంగళూరు : యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు రావాలంటే సాధారణంగా పది లేదా పదిహేను రోజులు పడతాయి. కొన్ని యూనివర్సిటీలు మరికొంత ఆలస్యం చేస్తాయి. కానీ తక్కువ సమయంలో ఫలితాలు మాత్రం ప్రకటించవు. ఈ కోవకు చెందినదే బెంగళూరు యూనివర్సిటీ కూడా. ఫలితాల ప్రకటనలో ఈ యూనివర్సిటీ చేసినంత జాప్యం మరొక యూనివర్సిటీ చేయదు. కానీ ఈసారి బెంగళూరు యూనివర్సిటీ సోమవారం అరుదైన రికార్డును సాధించింది. తనకున్న పేరును తిరగ రాసుకుంది. మొట్టమొదటిసారి పరీక్షలు అయిపోయిన రెండున్నర గంటల వ్యవధిలోనే బీఈ(సివిల్ ఇంజనీరింగ్) ఏడు, ఎనిమిది సెమిస్టర్ల ఫలితాలను ప్రకటించింది. బెంగళూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఒకే ఒక్క ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్ ‘ది యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్’. దీని ఫలితాల ప్రకటనలోనే బెంగళూరు యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది.
ప్రతి సబ్జెట్ సమాధాన పత్రాలను, పరీక్ష అయిపోయిన వెంటనే మూల్యాంకనం చేసే వాళ్లమని బెంగళూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ శివరాజు చెప్పారు. దీంతో గత 10 రోజులుగా జరుగుతున్న అన్ని సబ్జెట్ పరీక్ష పేపర్లను వెంటనే మూల్యాంకనం చేయడం ముగించామని తెలిపారు. 139 మంది విద్యార్థులు ఈ సారి పరీక్షలకు హాజరయ్యారని, ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం బెంగళూరు యూనివర్సిటీ చరిత్రలోనే ఇది మొదటిసారని పేర్కొన్నారు. లేదంటే ఎనిమిది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందన్నారు. మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరిచినందుకు తాము చాల సంతోషంగా ఉన్నామని ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్ పీ తెలిపాడు.
వెనువెంటనే ఫలితాలతో ఉన్నత విద్యకు వెళ్లడానికి లేదా ఉద్యోగం వెతుకుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. సోమవారం రోజు తాము ఆఖరి పేపరు పరీక్ష రాశామని, అది మధ్యాహ్నం రెండు గంటలకు అయిపోతే, సాయంత్రం నాలుగున్నర వరకు మొత్తం ఫలితాల ప్రకటన వచ్చేసిందని చెప్పాడు. కాలేజీ స్టాఫ్‌కు, బెంగళూరు యూనివర్సిటీ మూల్యాంకన వింగ్‌కు యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మాజీ ప్రిన్సిపాల్, బెంగళూరు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ కేఆర్ వేణుగోపాల్ కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment