ఫేస్బుక్లో మాజీలను తొలగించే అవకాశం.!
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 కోట్ల వినియోగదారులున్న ఫేస్బుక్ సంస్థ యూజర్లకు ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ లోని ఫ్రెండ్స్ లిస్టులో విసుగు కలిగిస్తున్న, పాత స్నేహితులను లిస్టు నుంచి తొలగించేందుకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ కొత్త సౌకర్యాన్ని పొందే ముందు వినియోగదారులు కాస్త అసౌకర్యాన్ని కూడా భరించాల్సి వస్తుందని ఆ సంస్థ చెబుతోంది. కొత్త టూల్ ను ప్రారంభించిన తర్వాత అందుబాటులోకి ఓ కొత్త మొబైల్ యాప్ ను తెస్తామని, ఈ కొత్త యాప్... యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫేస్బుక్ నిర్వాహకులు చెప్తున్నారు.
కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేస్బుక్ లో మీ స్థితి మార్చినపుడు ఇంతకు ముందు మీ ఫ్రెండ్స్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు.. మెసేజ్ లు డిలీట్ చేయాలా? వద్దా? అన్నది అడుగుతుంది. ఇలా చేసిన తర్వాత మీ వాల్ పై మీ పోస్ట్ లు, మెసేజ్ లు, ఫొటోలు మీరు లిస్టు నుంచి తొలగించిన వారికి కనిపించే అవకాశం ఉండదు. అలాగే గత పోస్ట్ వివరాలను కూడా చూసే సామర్థ్యాన్ని పరిమితం చేసుకునే అవకాశాన్ని ఈ కొత్త యాప్ కలిగిస్తుంది. అలాగే కొంతమందికి మాత్రమే మీ వివరాలు, పోస్ట్ లు కనిపించేట్టుగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది.
ఫేస్బుక్ ద్వారా తమ వినియోగదారుల జీవితాల్లో కలుగుతున్నకష్టాలను తీర్చేందుకు ఓ ప్రయత్నమని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ కెల్లీ వింటర్స్ తన బ్లాగ్ స్పాట్ లో తెలిపారు. ఈ సౌకర్యం ప్రజలకు కలిగిస్తున్న అసౌకర్యాలను కూడా సులభంగా తొలగిస్తుందని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. అయితే మీ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో... మీ స్నేహితులు, పార్టనర్ కు తెలిసే అవకాశం కూడా ఉండదన్నారు. ఈ కొత్త టూల్ వల్ల ప్రజలు మరింత సౌలభ్యం, సౌకర్యం పొంది, ఫేస్బుక్ తో మంచి సంబంధాలను కొనసాగించేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు కెల్లీ వింటర్ తెలిపారు.