స్మార్ట్‌గా దోపిడీ
ఓటరు కార్డుల పంపిణీలో చేతివాటం
రూ.20 నుంచి రూ.50 వసూలు
మీ సేవ కేంద్రాల్లోనూ ఇదే తంతు
అమలుకు నోచుకోని ఎన్నికల సంఘం హామీ
పట్టించుకోని రెవెన్యూ శాఖ అధికారులు
యథేచ్ఛగా వసూళ్ల పర్వం
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన ఓటరు స్మార్ట్‌కార్డుల పంపిణీలో పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.పది విలువ జేసే కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి ఓటరుకు బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ఉండేలా పూర్తిస్థాయి వివరాలు, చిరునామాలతో స్మార్ట్‌కార్డుల పంపిణీకి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఓటు కోసం ఇటీవల ఆరు వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు గతంలో దరఖాస్తు చేసుకున్న 13 వేల మందికి ఎన్నికల సంఘం స్మార్ట్‌కార్డులను జారీ చేసింది. వీటిని పంపిణీ చేసేందుకు నియోజకవర్గంలో 213 మంది బూత్ లెవల్ సిబ్బందిని నియమించింది. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా... వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు వేలకు పైచిలుకు స్మార్ట్‌కార్డులు జారీ అయ్యూరుు. 225 మంది బూత్ లెవల్ సిబ్బంది స్మార్ట్‌కార్డుల పంపిణీ చేపట్టారు.
ఇంతవరకు బాగానే ఉన్నా... ఓటర్లకు ఉచితంగా అందచేయాల్సిన స్మార్ట్‌కార్డులకు ధర నిర్ణయించి ఓటర్లను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.20 నుంచి రూ.50 వరకు తీసుకుని పంపిణీ చేస్తున్నారు. వసూళ్ల దందాపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తుండడంతో అక్రమార్కులదే ఇష్టారాజ్యంగా మారింది. ఉచితంగా ఇవ్వాల్సిన కార్డులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎవరైనా అడిగితే... ‘మీ ఇష్టం... ఎండలో తిరుగుతున్నాం... ఎంతో కొంత ఇవ్వాల్సిందే...’ అని దబాయిస్తుండడం గమనార్హం.
మీ సేవ కేంద్రాల్లోనూ వసూళ్లు
ఎన్నికల సంఘం ఓటర్లకు ఉచితంగా అందజేయాల్సిన స్మార్ట్‌కార్డులను ఎక్కువగా మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారు. బూత్ లెవల్ సిబ్బంది సకాలంలో ఓటరు స్మార్ట్‌కార్డులను పంపిణీ చేయకపోవడం... ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కార్డుల కోసం ఓటర్లు మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదునుగా... మీ సేవ కేంద్రాల నిర్వహకులు ఓటర్ల నుంచి అధికసొమ్ము వసూలు చేస్తున్నారు. ఒక్కో కార్డుకు రూ.50 నుంచి రూ.100 వరకు దండుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి... ఉచితంగా స్మార్ట్‌కార్డుల జారీ చేస్తామన్న ఎన్నికల సంఘం హామీ అమలుకు కృషి చేయూలని ఓటర్లు కోరుతున్నారు.