పేపర్.. సూపర్
తెల్లారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే అన్నీ, అంతటా.. ప్లాస్టిక్‌మయం. ఆధునికత పేరిట ఆడంబరాన్ని చాటుకునేందుకు పర్యావరణానికి చేటు తెచ్చే వస్తువులను ఎడాపెడా వాడేస్తున్నాం. అయితే, వాటి వాడకాన్ని తగ్గించాలని చెప్పడమే కాదు.. అటువంటి వాటికి ప్రత్యామ్నాయాలను సృష్టిస్తున్నారు ఇద్దరు యువతులు. అంతేనా.. మహిళా సాధికారతకు దారి చూపిస్తున్నారు. వారి పరిచయం..
- ఓ మధు
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి
యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన అనుభవం గౌరీ మహేంద్రది. టీచ్ ఫర్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లు ఆమె ఇక్కడ పనిచేసినపుడు స్కూల్లో హాజరు శాతం పెరగకపోవడం కలవరపరిచింది. సమీపంలోని మురికివాడల్లో తిరిగి పరిశీలించింది. పూట గడవడానికి పిల్లలు బడి మాని పనికి వెళ్తున్న పరిస్థితి కళ్లకుకట్టింది. కడు పేదరికంతో ఉన్న ఆ కుటుంబాలకు కాసింత ఉపాధి చూపితే్త తప్ప వారి పిల్లలను బడికి మళ్లించడం కష్టమని అర్థమైంది ఆమెకు. వారందరికీ ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి!
‘ఈ ఆలోచన నన్ను తొలిచేసింది. ఈ సమయంలో రాజస్థాన్‌లో బేర్‌ఫుట్ కాలేజీ కమ్యూనిటీకి వెళ్లాను. అక్కడ అరుణారాయ్ వద్ద ఉపాధి శిక్షణ ఇవ్వదగ్గ వివిధ అంశాల గురించి తెలుసుకున్నా. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక.. నాలాంటి ఆలోచనలతోనే ఉన్న ఉదితా చడ్డాతో కలిసి ఆర్గనైజేషన్ ప్రారంభించాను. దాని పేరే ఉమీద్’ అని వివరించింది గౌరీ.
మహిళా సాధికారత...
‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలి. అలాగే ముడి సరుకు కోసం ఎక్కువ ఖర్చు కాకూడదు. పర్యావరణానికి హాని కలిగించకూడదు. ఇలా ఆలోచించి వేస్ట్ న్యూస్‌పేపర్‌తో విభిన్నమైన వస్తువులు రూపొందించేలా శిక్షణ ఇస్తున్నాం. యూసుఫ్‌గూడ, ఓల్డ్‌సిటీ, అబిడ్స్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పది మంది మహిళలు పేపర్‌తో అద్భుతమైన కళాకృతులు తయారు చేశారు. వాటిని లామకాన్‌లో ప్రదర్శనకు పెట్టినప్పుడు మంచి స్పందన లభించిందని’ చెప్పింది ఒకే ఆశయం కోసం గౌరీతో కలిసి నడుస్తున్న ఉదితా చడ్డా.
పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్ ఐటెమ్స్, వాల్ హ్యాంగింగ్స్... ఇలా ప్రదర్శనలో ఏది చూసినా వాటి వెనుక కళాకారుల అద్భుత పనితనం కనిపిస్తుంది. కాగితంతో వివిధ కళాత్మక ఐటెమ్స్ తయారు చేయించడమే కాదు.. స్కిల్ ట్రైనింగ్, మైండ్‌సెట్ మార్చడానికి టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే వేదికను కల్పించడం కూడా తమ బాధ్యతగా భావిస్తున్నారు వీరిద్దరూ.
స్నేహితుల సహకారంతో మొదలుపెట్టిన ‘ఉమీద్’కు ‘అన్లిమిటెడ్ ఇండియా’ హైదరాబాద్ చాప్టర్ నుంచి ఎల్ వన్ స్టేజ్‌లో కొంత ఫండింగ్ అందుతోంది. నిఫ్ట్ కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది వాలంటీర్లుగా డిజైనింగ్, క్రాఫ్ట్స్, ప్రమోషన్స్‌లో సంస్థకు సహకారం అందిస్తున్నారు. ‘రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మహిళా సాధికారత సాధించాలన్నది మా ప్రయత్నం’ అంటూ చెప్పుకొచ్చారు గౌరీ, ఉదిత. ఉమీద్లో భాగస్వాములు కావాలనుకొంటే లాగిన్ అవ్వండి.
www.facebook.com/UMEEDsocialmedia/info?tab=page_info