మాజీ ఎంపీ బసవపున్నయ్య కన్నుమూత
రేపల్లె/ఆనందపేట(గుంటూరు): సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య(91) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రేపల్లె ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా మోదుమూడి గ్రామంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు.
ఒకసారి తెనాలి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎంపిక య్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బసవపున్నయ్య భౌతికకాయాన్ని రేపల్లెలోని ఆయన స్వగృహానికి తరలించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిం చారు. గురువారం ఉదయం 10 గంటలకు రేపల్లెలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. సింగం బసవపున్నయ్య మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.