పెన్షన్ (సవరణ) పథకం సబబే
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, పెన్షన్ నిధిలో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. 2014 నాటి సవరణ ప్రకారం ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది.
ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పెన్షన్ పథకంలో చేరలేకపోయిన ఉద్యోగులు 6 నెలల్లోగా చేరొచ్చంది. రూ.15,000 వేతనం దాటినవారు 1.16 శాతాన్ని పెన్షన్ పథకంలో జమ చేయాలన్న నిబంధన చెల్లదని స్పష్టం చేసింది.