బాసరలో తగ్గుతున్న నీరు
భైంసా: ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. రెండు రోజుల్లోనే ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గోదావరి పుష్కరాలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పుష్కర స్నానాలకు నీరెలా అన్న బెంగను తీరుస్తూ రెండు రోజుల క్రితం ఇక్కడ గోదావరి నీటిమట్టం పెరగడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తం చేశారు. అయితే, శనివారం నాటికి స్నానఘట్టాల వద్ద నీరు తగ్గి మట్టి బయటకు కనిపిస్తోంది.
రెండు రోజుల మురిపెమే...
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ర్టలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఈ నెల ఒకటిన తెరిచారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కింది. రెండు వంతెనల దాటుకుంటూ వ్యాసపురి వరకు వచ్చింది. మరుసటి రోజు స్నానఘట్టాల వద్దే బాసర భక్తులు పుణ్యస్నానాలు చేసి తరించారు. అయితే, శనివారం గోదావరి నీటి మట్టం చూసిన భక్తుల ఆశలు అడియాసలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం స్నానఘట్టాల వద్ద నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. మట్టి పైకి తేలి కనిపిస్తోంది. అలాగే రైలు, బస్సు వంతెనల మధ్య రాళ్లు, మట్టికుప్పలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే, పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి పూర్తిగా నీరు లేకుండా పోతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.