ఇది కులపోరాటం కాదు.. భావజాల పోరాటం!
న్యూఢిల్లీ: తాజా రాష్ట్రపతి ఎన్నిక కులపోరాటం కాదని, ఇది భావజాల సంగ్రామమని ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్ అన్నారు. విపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన అనంతరం తొలిసారి ఆమె మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రఖ్యాత దళిత నాయకుడు జగ్జీవన్‌రామ్ కూతురైన ఆమె రాష్ట్రపతి ఎన్నికను 'దళిత్ వర్సెస్ దళిత్'గా అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికైనా కుల వ్యవస్థను భూలోలోతుల్లో పాతిపెట్టాలని అన్నారు.
ఎన్డీయే తరఫున బిహార్ మాజీ గవర్నర్ నాయకుడు రామ్‌నాథ్ కోవింద్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయనకు పోటీగా దిగిన మీరాకుమార్‌కు 17 విపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఫలానా కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోరుగా ఈ ఎన్నికను అభివర్ణిస్తే.. అది రాష్ట్రపతి పదవిని కించపరచడమే అవుతుంది' అని అన్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతుగా బలమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఓటమిని అంగీకరించడానికి మీరాకుమార్ నిరాకరించారు. 'నేను ఓడిపోయే అభ్యర్థిని, ఇది ఓడిపోయే పోరాటమని ఎందుకు అంటున్నారు? నేను పోరాడుతున్నాను. నేను గట్టి పోటీ ఇవ్వగలనని అనుకుంటున్నా' అని ఆమె చెప్పారు.