BCCI secretary Sanjay Patel
-
మరో నాలుగేళ్లు ఆడతాడు
♦ ధోని కెరీర్‌పై సంజయ్ పటేల్ వ్యాఖ్య ♦ వీడ్కోలు టెస్టు కోరుకోలేదన్న కార్యదర్శి ముంబై: టెస్టుల నుంచి తప్పుకోవాలన్న మహేంద్ర సింగ్ ధోని నిర్ణయాన్ని తాము మార్చాలని ప్రయత్నించినా లాభం లేకపోయిందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. అతను కనీసం మరో రెండేళ్లు కొనసాగాలని తాము కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ‘ఒకవేళ ఒత్తిడిలో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే దాన్ని వెంటనే మర్చిపో. వచ్చే ఏడాది కూడా నువ్వే కెప్టెన్‌గా కొనసాగుతావని హామీ ఇస్తున్నా అని ధోనితో చెప్పాను. కానీ అతను అప్పటికే తన నిర్ణయం తీసేసుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే అతను టెస్టు జట్టుకు భారంగా మారాడని బోర్డు గానీ సెలక్టర్లు గానీ అసలు ఏనాడు అనుకోలేదు’ అని పటేల్ అన్నారు. తన అంచనా ప్రకారం ధోని కనీసం 2019 వరకు ఆడుతాడని పటేల్ అభిప్రాయ పడ్డారు. గత ఏడాది వరకు తమకు వైస్ కెప్టెన్ ఆలోచనే లేదని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధోని కోరడంతోనే వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. అది ధోని బ్రాండ్... ధోని వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే అతను వీడ్కోలు టెస్టు కోరుకునే రకం కాదని సంజయ్ పటేల్ వ్యాఖ్యానించారు. అతని రిటైర్మెంట్ ప్రకటనలోనే అది కనిపించిందని ఆయన అన్నారు. ‘ధోని ఇలాంటి విషయాలు ఎప్పుడూ డిమాండ్ చేయడు. ఎంతో ధైర్యవంతుడైన వ్యక్తే ఇలాంటి నిర్ణయం తీసుకోగలడు. చివరి టెస్టు ఘనంగా ముగించాలనుకుంటే ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్ వరకు వేచి చూసేవాడు. అది ధోని బ్రాండ్ రిటైర్మెంట్’ అని పటేల్ చెప్పారు. ధోని ఇక చదువుకోవచ్చు.. రాంచీ: టెస్టుల నుంచి తప్పుకోవడంతో ధోనికి కొంతైనా విరామం దొరుకుతుందని, అతను తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయవచ్చని అతని ఒకనాటి స్కూల్ ప్రిన్సిపల్ ధరంరాజ్ సింగ్ సలహా ఇచ్చారు. ఇక్కడి సెయింట్ గ్జేవియర్ కాలేజీలో డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నా, తగిన హాజరు లేక ధోని మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కాలేదు. ‘ధోని ప్లస్ టూ మాత్రమే పూర్తి చేశాడని నాకు తెలుసు. ఇకపై అతను అనుకుంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు. అయితే మరో రకంగా కూడా చదువుతో భాగం కావచ్చు. ధోని ఇప్పుడు ఎంతో పరిణతి చెందాడు. ఇంగ్లీష్‌లో కూడా బాగా మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్నారులకు చదువుపై ఆసక్తి పెరిగి, వారు రాణించేలా తన వంతుగా సహాయం చేయగలడు’ అని ప్రిన్సిపల్ అన్నారు. కోచ్‌గా హస్సీకి ఎంఎస్ సిఫారసు! బెంగళూరు: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి మైక్ హస్సీ పేరును ధోని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని నేరుగా ధోని, బీసీసీఐ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత కోచ్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌తో ముగియనుంది. హస్సీ వ్యూహ చతురత, నైపుణ్యం భారత కెప్టెన్‌ను ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆసీస్ పర్యటనకు ముందు మురళీ విజయ్ టెక్నిక్‌ను కూడా హస్సీ సరిదిద్దాడు. ఈ సిరీస్‌లో విజయ్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా హస్సీతో ధోనికి మంచి అనుబంధం ఉంది. మహి వ్యక్తిత్వం గొప్పది: హాడిన్ సిడ్నీ: టెస్టులకు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. అతను చాలా మెరుగైన స్థితిలో జట్టును వదిలి వెళ్లాడన్నాడు. ‘ధోనిలో గొప్పతనం అతని స్వభావం, వ్యక్తిత్వమే. ఆటను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ప్రస్తుత జట్టులో నిలకడను తెచ్చాడు. ఆట విలువను పెంచాడు. అయితే ధోని రిటైర్మెంట్ మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. భారత క్రికెట్‌కు గొప్ప సేవకుడు. తనతో పాటు జట్టును నడిపిన తీరు అమోఘం. ఎంఎస్లోని ప్రశాంతత టీమిండియాకు గొప్ప కెప్టెన్‌గా నిలబెట్టింది. అలాంటి వ్యక్తితో కలిసి క్రికెట్ ఆడటం చాలా గొప్పగా భావిస్తున్నా’ అని హాడిన్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో కోహ్లితో జరిగిన మాటల యుద్ధంపై వికెట్ కీపర్ స్పందించలేదు. కోరుకున్న విధంగా ఆడుతున్నాం... ఈ సిరీస్‌లో తాము కోరుకున్న విధంగా ఆడుతున్నామని హాడిన్ అన్నాడు. ‘మేం సిరీస్ గెలిచాం. ఇది మాకు చాలా ప్రధానమైంది. మెల్‌బోర్న్‌లోనూ సరైన విధంగానే ఆడాం. భారత్‌ను ఈ సిరీస్ నుంచి పూర్తిగా పక్కకు నెట్టాం. సిడ్నీలో కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. ఆట ఎలా సాగుతుందనేది మాకు పూర్తిగా తెలుసు. గెలుపుతో సిరీస్‌ను ముగిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. దాని కోసమే మేం ఆడతాం. పది అవకాశాలను సృష్టించుకుంటే గెలుపు మాదే’ అని ఈ వైస్ కెప్టెన్ పేర్కొన్నాడు. షార్ట్ బంతులతో భారత బౌలర్లు తనను లక్ష్యంగా చేసుకున్నా... ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. -
టెస్టు సిరీస్ నుంచి జడేజా అవుట్
అక్షర్ పటేల్‌కు చోటు మెల్బోర్న్: భుజం గాయంతో బాధపడుతున్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చికిత్స కోసం అతను భారత్‌కు తిరిగి రానున్నాడు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ప్రకటించాడు. జట్టుతో పాటే ఉన్నా జడేజాకు తొలి రెండు టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. పటేల్ ప్రస్తుతం రాజ్‌కోట్‌లో గుజరాత్, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెల 26న మెల్బోర్న్లో ప్రారంభమయ్యే తొలి టెస్టులోగా అతను జట్టుతో చేరే అవకాశం ఉంది. లక్కీ చాన్స్... కొంత కాలంగా అక్షర్, జడేజాకు పోటీగా తయారయ్యాడు. అదే శైలిలో పొదుపైన లెఫ్టార్మ్ స్పిన్ బౌలిం గ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగల పటేల్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. సొంతగడ్డపై లంకతో జరిగిన సిరీస్‌లో జడేజాను కాదని కోహ్లి అక్షర్‌కే అవకాశాలిచ్చాడు. ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్‌లోగా జడేజా కోలుకోకపోతే అక్షర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అది అక్షర్ ప్రపంచ కప్ అవకాశాలు కూడా మెరుగు పర్చవచ్చు. తాను ఆడిన 9 వన్డేల్లో అక్షర్ 20.28 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. -
ధోనిపై నిర్ణయం సెలక్టర్లదే
►ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలి ►బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ఇంటర్వ్యూ ముంబై: గెలుపోటముల విషయంలో బీసీసీఐ ఎప్పు డూ వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తుంది. కానీ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత బోర్డు వెంటనే చర్యలు తీసుకుంది. అయితే జట్టు మేనేజ్మెంట్ ప్రక్షాళనపై బోర్డు అంత త్వరగా స్పందించడానికి కారణాలేం టి? ధోని టెస్టు కెప్టెన్సీపై ఏ అభిప్రాయంతో ఉంది? పలు అంశాలపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తో ఇంటర్వ్యూ... టెస్టుల్లో ఓటమి బోర్డును నిరాశపర్చిందా? తీవ్రంగా నిరాశపర్చింది. టెస్టు సిరీస్‌లో ఓడిపోయామని కాదు.. వికెట్లు చేజార్చుకున్న తీరే బోర్డుకు బాధ కలిగించింది. మానసిక ధృడత్వం లేక వికెట్లను పారేసుకున్నారు. ఇది ఒకరకంగా బోర్డు మేల్కొనేలా చేసింది. 2015 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడలేదు. సాధారణంగా ఓటమి ప్రభావం జట్టుపైనా, ఆటగాళ్లపైనా ఉంటుంది. అందుకే మంచి వాతావరణాన్ని కల్పించాలనుకున్నాం. ఈ విషయంలో రవిశాస్త్రి సమర్థుడని భావించి కీలక బాధ్యతలు అప్పగించాం. ఇదే సమయంలో ఆటగాళ్లు ఓటమి నుంచి మానసికంగా బయటపడేలా చేసేందుకు స్వదేశీ సహాయక సిబ్బంది అవసరమని భావించాం. సమర్థులను ఎంపిక చేశాం. ట్రెవర్ పెన్నీ, జో డేవిస్‌లకు విశ్రాంతినివ్వడం జట్టు మేనేజ్మెంట్కు హెచ్చరిక లాంటిదా? గెలుపోటములకు ప్రతీ ఒక్కరూ జవాబుదారీగా ఉండాలి. ఆ బాధ్యత నాది కాదనే నిర్లక్ష్యపు ధోరణి సరికాదు. సాధారణంగా పర్యటన ఫలితాలపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో సత్వరమే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసే ముందు జట్టులోని ఆటగాళ్లను సంప్రదించారా? లేదు.. వారితో మాట్లాడకుండానే నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్‌తో భారత జట్టు గతంలో మంచి ఫలితాలు సాధించింది. ఇప్పుడు వారి ఆధ్వర్యంలోనే వ్యతిరేక ఫలితం వచ్చింది. జట్టు మళ్లీ విజయాల బాటలో పయనించాలంటే మరో దారి ఎన్నుకోక తప్పదు. అందుకే రవిశాస్త్రిని నియమించాం. జట్టు బాధ్యతంతా రవిశాస్త్రిదే అయితే... మరి ఫ్లెచర్ సంగతేంటి? ఈ పరిస్థితుల్లో ఫ్లెచర్ సామర్థ్యం, ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడటం సరికాదు. కోచ్, మేనేజర్ ఇచ్చే టూర్ రిపోర్టును సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. టెస్టుల్లో ధోని కెప్టెన్సీపై బోర్డు ఆందోళన చెందుతోందా? ధోనీ కెప్టెన్సీపై నాకెలాంటి అనుమానాలు లేవు. గెలుపోటములు సహజమే. కెప్టెన్ ప్రదర్శనను కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఇప్పటిదాకా ధోని కెప్టెన్సీపై బోర్డు సమావేశాల్లో చర్చకు రాలేదు. ఓటమికి బాధ్యుల్ని చేస్తూ సపోర్ట్ స్టాఫ్‌ని తప్పించారు. ధోని విషయంలో అలా ఎందుకు చేయలేకపోయారు? కెప్టెన్‌గా ధోని సరైన వాడా? కాదా? అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది సెలక్టర్లు. బోర్డు కార్యదర్శిగా నేను నిర్ణయించలేను. బ్యాట్స్‌మన్‌గా ధోని చక్కగా రాణించాడు. టాపార్డర్ రాణించలేకపోయింది. ఓటమిపై ఆటగాళ్లతో సమావేశమవుతారా? త్వరలో నేను ఇంగ్లండ్‌కు వెళ్తా. ఓటమిపై చర్చించేందుకు ఆటగాళ్లతో సమావేశమవుతా. సిరీస్ పరాజయంపై మేం కలత చెందాం. ఈ ఓటమి ఆటగాళ్లను కూడా బాధించి ఉంటుందని భావిస్తున్నాం. గవాస్కర్ లాంటి విశ్లేషకులు కొందరు ఆటగాళ్ల నైతికత, కమశిక్షణను ప్రశ్నించారు. దీనిపై మీరేమంటారు? దీనిపై నేనేమీ వాఖ్యానించదలుచుకోలేను. భారత క్రికెట్‌కు మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన విషయాల జోలికి నేను వెళ్లను. అది నా పరిధిలోకి రాదు. -
మార్పు మంచికే: పటేల్
ముంబై: భారత క్రికెట్ జట్టు టీమ్ డెరైక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి నియామకంతో... ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. కోచింగ్ నిర్మాణంలో ఈ మార్పు భారత క్రికెట్‌కు మంచిదేనని అన్నారు. అయితే ఇంగ్లండ్‌తో గత మూడు టెస్టుల్లో ఎదురైన పరాభవాల నేపథ్యంలో కెప్టెన్ ధోనిని, కోచ్ ఫ్లెచర్‌ను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫ్లెచర్ భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడడం తగదని అన్నారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కెప్టెన్, కోచ్‌లకు తెలిపాను. వారిద్దరూ దీనికి అంగీకరించారు. ఇప్పుడు టీమ్ రవిశాస్త్రితో ఉంది. ఇక ఇది అతడి బేబీ. ప్రతీ విషయాన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఏ విషయంలోనైనా ఆయన నా సహాయం కోరితే సంతోషంగా అంగీకరిస్తాను’ అని పటేల్ అన్నారు. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రి పేరును సంజయ్ పటేలే సూచించారు. అయితే ఈ పదవికి అతడి పేరును మాత్రమే లెక్కలోకి తీసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు అన్ని ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, జట్టు ప్రయోజనాల కోసం రవిశాస్త్రి దీనికి అంగీకరించడం సంతోషకరమని చెప్పారు. ఈ సవాల్‌ను స్వీకరించి ఫలితం సాధిస్తానని ఆయన చెప్పాడని గుర్తుచేశారు. అయితే శాస్త్రి బాధ్యతల విషయంలో ఆయన నేరుగా స్పందించలేదు. ‘జట్టు అవసరాల రీత్యా ఆయన ఏ పనైనా చేస్తారు. తమ పాత్రల గురించి వారిద్ద(ఫ్లెచర్, శాస్త్రి)రే నిర్ణయించుకుంటారు’ అని అన్నారు. ‘తప్పు ఎక్కడుందో చూడాలి’ భారత క్రికెటర్లపై తమకు పూర్తి నమ్మకముందని సంజయ్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి సమయంలోనే వారికి మద్దతు అవసరం. తప్పు ఎక్కడ జరిగిందో చూడాలనుకుంటున్నాం. వారికి క్రికెట్ ఆడడం రావడం లేదని అంటున్నారు. కానీ మానసికంగా వారు అప్సెట్ అయ్యారు. మానసిక వికాసానికి కూడా మేం ఒకరిని నియమించాలనుకున్నాం. మైదానంలో, వెలుపల కూడా రవిశాస్త్రి అనుభవవాన్ని ఉపయోగించుకోబోతున్నాం. టూర్ ముగిశాక అన్ని అంశాలపై సమీక్ష జరిపి అవసరమనుకుంటే చర్యలు తీసుకుంటాం’ అని పటేల్ వివరించారు. -
భారత ‘ఎ’ జట్లకు ఉన్ముక్త్, నాయర్ సారథ్యం
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ‘ఎ’ జట్లతో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. మూడు రోజులు, నాలుగు రోజుల మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్టుకు అభిషేక్ నాయర్ (ముంబై)... వన్డే జట్టుకు ఉన్ముక్త్ చంద్ (ఢిల్లీ) నాయకత్వం వహిస్తారని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. రెండు జట్లలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికీ చోటు లభించలేదు. ఈనెల 31 మొదలయ్యే ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదికగా నిలుస్తుంది. తొలుత ఈనెల 31 నుంచి సెప్టెంబరు 2 వరకు మూడు రోజుల మ్యాచ్... తర్వాత సెప్టెంబరు 5 నుంచి 8 వరకు నాలుగు రోజుల మ్యాచ్ ఉంటుంది. సెప్టెంబరు 11, 13, 15వ తేదీల్లో మూడు వన్డేలున్నాయి. ఈ సిరీస్ తర్వాత వెస్టిండీస్ ‘ఎ’ జట్టుతో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు మరో సిరీస్ జరుగుతుంది.