ధోనిపై నిర్ణయం సెలక్టర్లదే
►ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలి
►బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ఇంటర్వ్యూ
ముంబై: గెలుపోటముల విషయంలో బీసీసీఐ ఎప్పు డూ వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తుంది. కానీ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత బోర్డు వెంటనే చర్యలు తీసుకుంది. అయితే జట్టు మేనేజ్‌మెంట్ ప్రక్షాళనపై బోర్డు అంత త్వరగా స్పందించడానికి కారణాలేం టి? ధోని టెస్టు కెప్టెన్సీపై ఏ అభిప్రాయంతో ఉంది? పలు అంశాలపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తో ఇంటర్వ్యూ...
టెస్టుల్లో ఓటమి బోర్డును నిరాశపర్చిందా?
తీవ్రంగా నిరాశపర్చింది. టెస్టు సిరీస్‌లో ఓడిపోయామని కాదు.. వికెట్లు చేజార్చుకున్న తీరే బోర్డుకు బాధ కలిగించింది. మానసిక ధృడత్వం లేక వికెట్లను పారేసుకున్నారు. ఇది ఒకరకంగా బోర్డు మేల్కొనేలా చేసింది. 2015 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడలేదు.
సాధారణంగా ఓటమి ప్రభావం జట్టుపైనా, ఆటగాళ్లపైనా ఉంటుంది. అందుకే మంచి వాతావరణాన్ని కల్పించాలనుకున్నాం. ఈ విషయంలో రవిశాస్త్రి సమర్థుడని భావించి కీలక బాధ్యతలు అప్పగించాం. ఇదే సమయంలో ఆటగాళ్లు ఓటమి నుంచి మానసికంగా బయటపడేలా చేసేందుకు స్వదేశీ సహాయక సిబ్బంది అవసరమని భావించాం. సమర్థులను ఎంపిక చేశాం.
ట్రెవర్ పెన్నీ, జో డేవిస్‌లకు విశ్రాంతినివ్వడం జట్టు మేనేజ్‌మెంట్‌కు హెచ్చరిక లాంటిదా?
గెలుపోటములకు ప్రతీ ఒక్కరూ జవాబుదారీగా ఉండాలి. ఆ బాధ్యత నాది కాదనే నిర్లక్ష్యపు ధోరణి సరికాదు. సాధారణంగా పర్యటన ఫలితాలపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో సత్వరమే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసే ముందు జట్టులోని ఆటగాళ్లను సంప్రదించారా?
లేదు.. వారితో మాట్లాడకుండానే నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్‌తో భారత జట్టు గతంలో మంచి ఫలితాలు సాధించింది. ఇప్పుడు వారి ఆధ్వర్యంలోనే వ్యతిరేక ఫలితం వచ్చింది. జట్టు మళ్లీ విజయాల బాటలో పయనించాలంటే మరో దారి ఎన్నుకోక తప్పదు. అందుకే రవిశాస్త్రిని నియమించాం.
జట్టు బాధ్యతంతా రవిశాస్త్రిదే అయితే... మరి ఫ్లెచర్ సంగతేంటి?
ఈ పరిస్థితుల్లో ఫ్లెచర్ సామర్థ్యం, ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడటం సరికాదు. కోచ్, మేనేజర్ ఇచ్చే టూర్ రిపోర్టును సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం.
టెస్టుల్లో ధోని కెప్టెన్సీపై బోర్డు ఆందోళన చెందుతోందా?
ధోనీ కెప్టెన్సీపై నాకెలాంటి అనుమానాలు లేవు. గెలుపోటములు సహజమే. కెప్టెన్ ప్రదర్శనను కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఇప్పటిదాకా ధోని కెప్టెన్సీపై బోర్డు సమావేశాల్లో చర్చకు రాలేదు.
ఓటమికి బాధ్యుల్ని చేస్తూ సపోర్ట్ స్టాఫ్‌ని తప్పించారు. ధోని విషయంలో అలా ఎందుకు చేయలేకపోయారు?
కెప్టెన్‌గా ధోని సరైన వాడా? కాదా? అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది సెలక్టర్లు. బోర్డు కార్యదర్శిగా నేను నిర్ణయించలేను. బ్యాట్స్‌మన్‌గా ధోని చక్కగా రాణించాడు. టాపార్డర్ రాణించలేకపోయింది.
ఓటమిపై ఆటగాళ్లతో సమావేశమవుతారా?
త్వరలో నేను ఇంగ్లండ్‌కు వెళ్తా. ఓటమిపై చర్చించేందుకు ఆటగాళ్లతో సమావేశమవుతా. సిరీస్ పరాజయంపై మేం కలత చెందాం. ఈ ఓటమి ఆటగాళ్లను కూడా బాధించి ఉంటుందని భావిస్తున్నాం.
గవాస్కర్ లాంటి విశ్లేషకులు కొందరు ఆటగాళ్ల నైతికత, కమశిక్షణను ప్రశ్నించారు. దీనిపై మీరేమంటారు?
దీనిపై నేనేమీ వాఖ్యానించదలుచుకోలేను. భారత క్రికెట్‌కు మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన విషయాల జోలికి నేను వెళ్లను. అది నా పరిధిలోకి రాదు.