ఇంటర్లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్ అవకాశాలు మీకోసమే
దేశంలో కామర్స్ కోర్సులకు మంచి డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ సీఈసీ ఉత్తీర్ణులయ్యాక.. డిగ్రీ స్థాయిలో బీకామ్‌తోపాటు సీఏ, సీఎస్, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరుతుంటారు. వాస్తవానికి సీఈసీ విద్యార్థులు కామర్స్ సంబంధ కోర్సులు మాత్రమే కాకుండా.. బీబీఏ, బీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లోనూ ప్రవేశం పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్ సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
డిగ్రీ స్థాయి కోర్సులు
బీకామ్: సీఈసీ ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థులు ఎక్కువ మంది చేరే కోర్సు.. బీకామ్. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దీన్ని పూర్తిచేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ/ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మల్టీనేషనల్ కంపెనీలు, ప్రైవేట్ బిజినెస్/సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. బిజినెస్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, బిజినెస్ రిస్క్ అడ్వైజర్, ఆపరేషన్స్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్, ఎకనామిస్ట్, మార్కె ట్ అనలిస్ట్, బిజినెస్ ఎకనామిక్ రైటర్, బడ్జెట్ అనలిస్ట్‌గా ఉద్యోగాలు పొందొచ్చు.
చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు
బీకామ్ కంప్యూటర్స్: ఇటీవల కాలంలో ఇంటర్ సీఈసీ ఉత్తీర్ణులు ఎక్కువగా చేరుతున్న కోర్సు.. బీకామ్ కంప్యూటర్స్. కార్పొరేట్ రంగంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఉపయోగించేందుకు వీలుగా ఈ కోర్సును రూపొందించారు. ఈకోర్సు విద్యార్థులు కామర్స్తోపాటే కంప్యూటర్ నైపుణ్యం కూడా సొంతం చేసుకుంటారు. బీకామ్ కంప్యూటర్స్ ఉత్తీర్ణులు వివిధ విభాగాల్లో కంప్యూటర్ ప్రోగ్రామర్, యాప్ డెవలపర్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. పీజీ స్థాయిలో ఎంకామ్ కంప్యూటర్స్‌లో చేరొచ్చు.
బీకామ్(హానర్స్): ఇటీవల విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న కోర్సు.. బీకామ్ హానర్స్. ఇది పలు ప్రభుత్వ/ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులో ఉంది. ఇందులో చేరాలంటే..సీఈసీ ఇంటర్మీడియెట్ కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. బీకామ్ హానర్స్‌లో.. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్/ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్/ఎకనామిక్స్/బ్యాంకిం గ్ అండ్ ఇన్సూరెన్స్/టాక్సేషన్/మార్కెటింగ్ /హెచ్ఆర్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నా యి. బీకామ్ హానర్స్ పూర్తి చేసినవారికి మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, కామ ర్స్, బ్యాంకింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు, రీసెర్చ్ అసోసియేట్స్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
బీఏ ఎకనామిక్స్: ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్న కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు ఇది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్) సబ్జెక్టులు చదివినవారు మూడేళ్ల బీఏ ఎకనామిక్స్‌లో చేరితే ఉజ్వలంగా రాణించొచ్చు. వీరు బీఏ ఎకనామిక్స్ తర్వాత పీజీ స్థాయిలో ఎంబీఏ ఫైనాన్స్/ఎంఏ ఎకనామిక్స్‌లో చేరి.. అద్భుత అవకాశాలు అందుకునే వీలుంది. వీరికి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రంగం, ప్రభుత్వ ఎకనామిక్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ): బిజినెస్, మేనేజ్మెంట్ రంగంలో రాణించాలనుకునేవారికి బీబీఏ కోర్సు ఉపయుక్తంగా ఉంటుం ది. ముఖ్యంగా పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో..ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీబీఏ ఎంచుకోవడం మంచిది. మేనేజ్మెంట్ రంగంలో ఉన్నత స్థాయి కెరీర్ కోసం ఎంబీఏ చేయవచ్చు. బీబీఏ ఉత్తీర్ణులయ్యాక కార్పొరేట్ కంపెనీలతోపాటు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చు. మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్, హెచ్ఆర్ మొదలైన విభిన్న విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ముఖ్యంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసిస్టెంట్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ కన్సల్టెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం మేనేజర్, ఆర్ అండ్ డీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేయవచ్చు.
ప్రొఫెషనల్ కోర్సులు
చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ): చార్టర్డ్ అకౌంటెన్సీ నిపుణులకు జాబ్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సులో ప్రధానంగా అకౌంటింగ్, ట్యాక్సేషన్‌పై దృష్టిసారిస్తారు. కామర్స్, అకౌంటెన్సీ, ట్యాక్సేషన్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు.. ఇంటర్మీడియట్ తర్వాత సీఏ కోర్సులో ప్రవేశించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఈ కోర్సును అందిస్తోంది. సీఏ కోర్సు ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్.. ఇలా మూడు స్థాయిల్లో ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. సీఏ కోర్సు పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ ట్యాక్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, వర్క్స్ అకౌంటెన్సీ, ఆడిటింగ్ మొదలైన కార్పొరేట్, ఆర్థిక విభాగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేయవచ్చు. సీనియర్ సీఏల వద్ద పనిచేయడం ద్వారా అనుభవం పొందొచ్చు.
కంపెనీ సెక్రటరీ: కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్వల కెరీర్ కోరుకునే కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. కంపెనీ సెక్రటరీ(సీఎస్). ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి కార్పొరేట్ రంగం అవకాశాలను అందిస్తుంది. కంపెనీ సెక్రటరీలో.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్.. ఇలా మూడు స్థాయిలు ఉంటాయి. సరైన ప్రణాళికతో ముందుకెళితే ఇంటర్మీడియెట్ సీఈసీ తర్వాత మూడేళ్లలోనే సీఎస్ కోర్సును పూర్తిచేసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక సీఈఓలు, ఎండీలకు సలహాలిచ్చే కంపెనీ సెక్రటరీగా అవకాశాలు దక్కించుకోవచ్చు. దాంతోపాటు అనుభవం, నైపుణ్యాల ఆధారంగా లీగల్ అడ్వైజర్, కార్పొరేట్ పాలసీ మేకర్, కార్పొరేట్ ప్లానర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
ఇంటిగ్రేటెడ్ లా: కామర్స్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల కాలపరిమితి గల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరవచ్చు. జాతీయ స్థాయిలోని ప్రముఖ లా స్కూల్స్ బీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీ వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ఇంటర్మీయెట్ తర్వాత క్లాట్‌లో ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. న్యాయ విద్యలో.. కార్పొరేట్ లా, ట్యాక్స్ లా/సివిల్, క్రిమినల్ లా/బిజినెస్ అండ్ లేబర్ లా వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.