beacon
-
‘ఎర్రబుగ్గ’పై బ్యాన్ పడింది
-
‘ఎర్రబుగ్గ’పై బ్యాన్ పడింది
న్యూఢిల్లీ : ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం ప్రదర్శించే నాయకులు, అధికారులకు చెక్ పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ ఎరుపురంగు బుగ్గకార్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రతిష్టకు సంకేతంగా భావిస్తూ బుగ్గకార్ల (కార్లపై రెడ్‌లైట్ల)తో వెలిగిపోతున్న పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు ఇకపై ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు. మే 1వ తేదీ నుంచి ఈ ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ మాత్రమే బుగ్గకార్ల వినియోగించేందుకు అనుమతి ఉంది. ఇంతవరకు జిల్లాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలు, పార్లమెంటు సభ్యులు, ఇతర వీఐపీలకు ఉన్న ఈ సదుపాయం తొలగిపోనుంది. ప్రధాని మోదీ తాజా నిర్ణయంతో వీఐపీ కల్చర్‌కి చరమగీతం పాడినట్లు అయింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లో ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై అక్కడ ముఖ్యమంత్రులు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. కాగా 2002, 2005లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. అయితే నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచనలు చేసిన విషయం తెలిసిందే. -
నకిలీ వైస్‌చాన్స్‌లర్...
బెంగళూరు: నకిలీ యూనివర్శిటీని ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు విద్యాసంస్థల యాజమాన్యానికి కుచ్చుటోపి పెట్టిన ఘనుడిని బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విచారణలో ఎంబీయే చదివిన ఈ నిందితుడు ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిని తన కార్యాలయంలో ఉద్యోగిగా నియమించుకున్నట్లు తేలడం గమనార్హం. యూనివర్శిటీనే సష్టించాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంతోష్ లెహర్ 2004లో బెంగళూరుకు చేరుకుని ఇక్కడే ఎంబీఏ పూర్తి చేశాడు. అటుపై కొన్ని ప్రముఖ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఏడాది క్రితం ఉద్యోగానికి ఫుల్‌స్టాఫ్ పెట్టేశాడు. నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఇందుకు తనకు తాను వైస్ చాన్స్‌లర్‌గా ప్రకటించుకున్నాడు. అనంతరం ఇంటర్నెట్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలను సంప్రదించి ‘ దేశంలో ఎవరైనా ఇక పై నర్సింగ్, పారామెడికల్ కోర్సులకు సంబంధించి విద్యా సంస్థలను ప్రారంభించాలన్నా, లేక ఇప్పటికే ఉన్న కళాశాలల్లో సదరు కోర్సులను మొదలు పెట్టాలన్నా తమ యూనివర్శిటీ అనుమతి తప్పని సరి.’ అని పేర్కొనడంతో పాటు ఇందుకు సంబంధించిన నకిలీ ధృవీకరణ పత్రాలను కూడా వారికి అందజేసేవాడు. ఈ పత్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ పత్రాలను పోలి ఉండటం గమనార్హం. ఇందుకు ఏదేని విద్యాసంస్థ యాజమాన్యం ప్రతిస్పందించిందంటే సంతోష్ లెహర్ ఇక తన చాతుర్యాన్ని ప్రదర్శించేవాడు. ప్రతిస్పందించిన వారి వద్దకు ఎర్రబుగ్గ ఉన్న కారులో వెళ్లేవాడు. వారు ఇప్పటికే విద్యాసంస్థలను నిర్వహిస్తుంటే వివిధ రకాల పేర్లతో పరిశీలనలు జరిపి డబ్బు గుంజేవాడు. ఈ విధంగా ఇప్పటి వరకు కేరళ, తమిళనాడురాష్ట్రాలతోపాటూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, చుట్టుపక్కల ఉన్న పలు విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేశాడు. వంచన ఇలా బయటపడింది... ఈ ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్లో బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ నకిలీదంటూ పశ్చిమ బెంగాల్లో ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో గతంలో ఈ వర్శిటీ నుంచి వివిధ రకాల కోర్సులకు అనుమతి పొందిన చెన్నై కు చెందిన వీరిస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షుడు టీసీ.అరివళగన్, సంతోష్ లెహర్‌ను ప్రశ్నించారు. అయితే అవన్నీ గిట్టనివారు చేస్తున్నారని పట్టించుకోనవసరం లేదని సంతోష్ లెహర్ చెప్పి అప్పటికప్పుడు మభ్యపెట్టారు. అటు పై మే 4న వంచన కేసులో ‘బయోకెమిక్ గ్రాంట్ కమిషన్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ బయో కెమిక్ హెల్త్ సైన్స్ సీఈఓ శ్యామల్ దత్త అరెస్టైన విషయం అక్కడి వార్తా పత్రికలతో పాటు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా సదరు సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్నట్లు కూడా తెలిపాయి. విషయం తెలుసుకున్న టీ.పీ అరివళగన్ నగరంలోని పోలీసులను సంప్రదించారు. అప్పటికే ఈ విద్యాసంస్థ విషయమై సమాచారం అందుకున్న నగర పోలీసులు బన్నేరుగట్టలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆ సంస్థ శాఖల పై ఏ కాలంలో దాడుల చేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నిందితుడైన సంతోష్లెహర్ పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ కమిషనర్ శరప్ప ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ చోట్ల గాలింపు చేపట్టారు. చివరికి బంధువుల ఇంట్లో ఉన్న సంతోష్లెహర్ను అరెస్టు చేశారు. దర్యాప్తులో ఇతను వివిధ సంస్థల నుంచి ఇప్పటి వరకూ రూ.78.40 లక్షలను పరిశీలన రుసుం పేరుతో వసూలు చేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా ఇతని కార్యాలయం, ఇంటిలో పెద్ద సంఖ్యలో కోర్సుల ప్రారంభానికి సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలు, స్టాంప్ పేపర్లు, రబ్బరు స్టాంపులతో పాటు రూ.8.96 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇతని పేరు పై ఉన్న బ్యాంకు ఖాతాలోని రూ.27లక్షల నగదుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపకూడదని సంబంధింత అధికారులకు బ్యాంకు అధికారులకు పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా ఇతని వద్ద ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పనిచేస్తుండేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సంతోష్ లెహర్ మోసంలో సదరు విశ్రాంత ఐఏఎస్ అధికారి పాత్ర తేల్చడానికి పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
మోదీ దత్తత గ్రామం ఎలా ఉందో తెలుసా?
నాయకులు పని చేయాలనుకున్నా.. అందరూ కలిసి రానిదే అభివృద్ధి అసాధ్యం. వీధిలైట్లు లేవని చీకటిలో గడిపిన వాళ్లే.. ఆ తర్వాత అవి ఏర్పాటుచేశాక వాటిలోని బల్బులు, సోలార్ దీపాలైతే వాటి బ్యాటరీలను చోరీ చేస్తే ఇక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ప్రధానమంత్రి నరేంద్రమోదీ దత్తత తీసుకున్న గ్రామం దుస్థితి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. కూలిన బస్ షెల్టర్లు, విరిగిన ఐరన్ కుర్చీలు, చోరీకి గురైన సోలార్ దీపాలు, ఆవుపేడ దాచే కేంద్రాలుగా మరుగుదొడ్లు... ఇదీ అక్కడి పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లోని జయపూర్ సమీపంలో మోదీ దత్తత గ్రామంలో పర్యటించిన వారికి కళ్లకు కట్టినట్లు ఈ పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడపడమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన ఎంపీ మోడల్ విలేజ్ స్కీం.. దుర్భర స్థితికి చేరుకుంటోంది. ప్రతి ఎంపీని పథకంలో భాగస్వామిని చేసి, గ్రామాలను బంగారు బాటలో నడిపించాలన్నదే ధ్యేయంగా పథకం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం మోదీ దత్తత గ్రామంలోనే దుర్భర స్థితి కళ్ళకు కడుతోంది. ఆయన కలల గ్రామంలోనే నిర్లక్ష్యం తాండవమాడుతోంది. 2014లో ఉత్తరప్రదేశ్ లోని జైపూర్ గ్రామాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దత్తత తీసుకున్న తర్వాత కూడా ఆ గ్రామం దీనావస్థలోనే ఉంది. గ్రామంలో అడుగు పెట్టినవారికి ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కళ్ళకు కడుతోంది. కూలిన బస్టాండ్లలో విరిగిన ఐరన్ కుర్చీలు, జూదరుల కేంద్రాలుగా మారుతున్న బస్ షెల్టర్లు, బల్బులు లేక కనిపించని సోలార్ వెలుగులు, విరిగిన తలుపులు, నీరు లేక చోరీకి గురైన కుళాయిలతో ఆవుపేడ నిల్వ కేద్రాలుగా మారిన స్వచ్ఛభారత్ అభియాన్ కింద నిర్మించిన మరుగుదొడ్లు. అంతేకాదు ఊరంతకీ వెలుగునిచ్చే సోలార్ బ్యాటరీ దీపాలు, 65 కుటుంబాలకు నీటి సరఫరాకోసం వినియోగించే మోటర్ సైతం చోరీకి గురవ్వడం... ఆ గ్రామం సందర్శించినవారికి కనిపించే దుర్భర పరిస్థితులు. మోదీ స్వంత నియోజకవర్గం వారణాసికి 30 కిలోమీటర్ల దూరంలో మొత్తం 3,205 మంది నివాసితులు కలిగిన గ్రామాన్ని ఆదర్శగ్రామంగా మార్చాలన్న మోదీ కల కేవలం రెండేళ్లలోనే ప్రజల ఉదాసీనత, పరిపాలనాధికారుల నిరక్ష్యానికి గురైంది. గ్రామంలో నిర్లక్ష్య ధోరణిని నిరోధించడానికి, గ్రామస్థుల వైఖరిలో మార్పులు తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదని గ్రామాధికారి నారాయణ్ పటేల్ చెబుతున్నారు. అయితే నాయకుల ఆరోపణలను గ్రామస్తులు ఖండిస్తున్నారు. కుర్చీలను సరిగా వెల్డింగ్ చేయించలేదని, గ్రామంలో యూనియన్ బ్యాంక్ స్థాపించిన లైబ్రరీ కమ్ కంప్యూటర్ సెంటర్ కూడా ఎప్పుడూ మూసే ఉంటుందని ఆరోపిస్తున్నారు. అయితే పుస్తకాలు చోరీ అవుతాయన్న భయంతోనే లైబ్రరీని మూసేయాల్సి వస్తోందని, అక్కడ ఉంచిన పుస్తకాలకు సైతం సంరక్షణ కరువౌతోందని, సోలార్ బ్యాటరీలు పర్యవేక్షించేవారు లేక చోరీకి గరౌతున్నాయని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్ ప్రొసంజిత్ షీల్ తెలిపారు. పర్యవేక్షణా బాధ్యతలను స్థానిక నాయకులు తీసుకుంటే తమకు లైబ్రరీ తెరవడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. గ్రామంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం 35 సోలార్ దీపాలకు గాను ఎనిమిది సోలార్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయని, ఈ పరిస్థితులు తమను నిరుత్సాహ పరిచాయని షీల్ తెలిపారు. స్థానిక పరిపాలనాధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరించి అపహరణలను నిరోధించవచ్చన్నారు. ముందుగా గ్రామ ప్రజల వైఖరిలో మార్పు రానిదే గ్రామంలో ఎటువంటి అభివృద్ధీ సాధ్యం కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. నిజానికి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని మోదీ జైపూర్ గ్రామంలో మంచి రోడ్లు, సెల్ఫ్ ఆపరేటెడ్ వాటర్ పంపుల వంటి ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారని, గ్రామంలో బీఎస్ఎన్ఎల్ టవర్ కూడా నిర్మిస్తున్నారని, దగ్గరలోని సుమారు ఐదు గ్రామాలకు సరిపడే నీటిని నిల్వ చేసే వాటర్ ట్యాంకును నిర్మించారని, రోజుకు సుమారు 200 మందికి పైగా జనం వాడుకునేందుకు వీలుగా ఏటీఎం ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే గ్రామస్థుల స్వార్థ ప్రయోజనాలు అభివృద్ధిని కుంటు పడేలా చేస్తున్నాయని షీల్ అభిప్రాయపడ్డారు.