Beautification works
-
మూసీపై రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : మూసీని మురికికూపంగా మార్చారన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకీభవించారు. కానీ మూసీని మురికికూపంగా మార్చిన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనన్నారు కేటీఆర్. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోనే కలుస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.మూసీ శుద్ధిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కేటీఆర్.. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే సీఎం రేవంత్‌కు మూసీపై ప్రేమ పుట్టికొచ్చిందన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. నోట్ల రద్దు సమయంలో మోదీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్‌రెడ్డి. లక్షన్నర కోట్లు ఖచ్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్‌రెడ్డినే. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదు. తన చేసిన పాపం బయటకి రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడ్తున్నాయి. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
Srikakulam: సిక్కోలు నగరానికి న్యూలుక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా విశిష్టతలు చిత్తరువుల రూపంలో కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి. గోడలపై గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తున్నాయి. అందమైన కుడ్య చిత్రాలు నగరానికి కొత్తశోభను తీసుకొస్తున్నాయి. పరిసరాలు అందంగా ఉంటే ఆ అనుభూతే వేరు. సిక్కోలు నగరంలో ఇప్పుడదే కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు కూడళ్లు, ఫ్లైవోవర్లు, వంతెనలు, ప్రభుత్వ ప్రాంగణాల గోడలపై రంగులతో అద్దుతున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్నాయి. నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా శ్రీకాకుళంలో కుడ్య చిత్రాలను వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా రంగులతో వేస్తున్న ఈ చిత్రాలు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల జోరుగా పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై వోవర్లు, వంతెనలు, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, పాఠశాలు/కళాశాలల ప్రహరీలు, ప్రభుత్వభవనాల కాంపౌడ్స్కు జిల్లా, నగర చరిత్రను తెలియ జేసే కుడ్యచిత్రాలను ప్రత్యేక రంగులతో వేస్తున్నారు. నగరంలో 23 ప్రదేశాల్లో ఈ రకంగా పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అరసవల్లి, వంశధార, నాగావళి, మన జాతీయతను తెలియజేసే పెయింటింగ్స్ వేస్తున్నారు. రూ.1.43 కోట్లతో ఈ పనుల్ని చేపడుతున్నారు. శరవేగంగా పనులు జరిగేలా కమిషనర్ ఓబులేసు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా రాజీ పడకుండా, దగ్గరుండి పెయింటింగ్స్ వేయించే పనిలో నిమగ్నమయ్యారు. (క్లిక్: డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు) -
‘ఎస్పీ నిర్వాకంతో నిలిచిన అభివృద్ధి’
లక్నో: వారణాసిలో ఆలయ అభివృద్ధి, సుందరీకరణ పనులకు సంబంధించి గతంలో ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అప్పటి ఎస్పీ సర్కార్ నిర్వాకంతోనే తన నియోజకవర్గంలో సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. కాశీ విశ్వనాధ ఆలయ అప్రోచ్ రోడు, సుందరీకరణ ప్రాజెక్టుకు శుక్రవారం ప్రధాని శంకుస్ధాపన చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులకు తొలి మూడేళ్లలో అధికారంలో ఉన్న ఎస్పీ ప్రభుత్వం సహకరించలేదని, యోగి ఆదిత్యానాథ్‌ను మీరు సీఎంగా చేసిన తర్వాతే ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు ఊపందుకున్నాయని చెప్పారు. గత ఎస్పీ ప్రభుత్వం సహకరిస్తే ప్రస్తుతం శంకుస్ధాపనకు బదులు ఆయా పనుల ప్రారంభోత్సవం జరిగి ఉండేదని ప్రధాని చెప్పుకొచ్చారు. గత ఏడు దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం కాశీ విశ్వేశ్వరుడి గురించి ఆలోచించలేదని, ఆయా ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసమే పనిచేశి కాశీని విస్మరించాయని విమర్శించారు. కాశీని అభివృద్ధి చేయాలన్నది తన చిరకాల స్వప్నమని, అందుకే తాను ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు పలుసార్లు ఇక్కడికి వచ్చానని, ఇక్కడ అభివృద్ధి జరగాలని కోరుకున్నానన్నారు. కాశీ విశ్వనాధుని ఆశీస్సులతో తన స్వప్నం ఫలించే సమయం ఆసన్నమైందన్నారు. ఆక్రమణలతో కూరుకుపోయిన కాశీ విశ్వనాధ సన్నిధికి ముక్తి కలుగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆక్రమణలు తొలగించి తాము సమీప భవనాలు స్వాధీనం చేసుకున్న తర్వాత 40 పురాతన దేవాలయాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో చాలా వరకూ ఆక్రమణలకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
శ్మశానం.. అత్యాధునికం
దుబ్బాక : ‘పుట్టిన వాడు గిట్టక మానడు’ అన్నది భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట. మరణం ఏ జీవికైనా తప్పదు.. అయితే చనిపోయిన తమ ఆప్తులకు కన్నీటి వీడ్కోలు చెప్పడానికి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శ్మశాన వాటిక దాకా రావడం సహజం. మరణించిన వ్యక్తులకు దహన సంస్కారాలు చేయడానికి అనువైన స్థలం కావాలి. ఈ తంతుకు వచ్చిన వారు ఆయా మత ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం నడుచుకోవడం అనాదిగా వస్తున్నదే. దహన సంస్కారాలకు వచ్చిన వ్యక్తులు స్నానం చేసి వేసుకున్న బట్టలను నీళ్లల్లో పిండనిదే ఇంటికి తిరిగి వెళ్లరు. దీని కోసం నీళ్లెక్కడ దొరుకుతాయా అని వెతుకులాడతారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేయలేరు. ఇలా దహన సంస్కారాలకు వచ్చిన వారు చాలా గ్రామాల్లో నీళ్లు, బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వం శ్మశాన వాటికల్లో సకల సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. శ్మశాన వాటికకు వెళితే.. ఇది నిజంగా శ్మశాన వాటికేనా అన్నంత అందంగా వైకుంఠ ధామం పేరుతో సుందరమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది. మరణించిన తమ వారి జ్ఞాపకార్థంగా స్మృతి వనాలను నిర్మిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక మున్సిపాలిటీలో వైకుంఠధామాలను అత్యాధునికమైన పద్ధతుల్లో నిర్మించడానికి భారీగానే నిధులను కేటాయిస్తోంది. వైకుంఠ ధామాల నిర్వహణ బాధ్యతను కూడా మున్సిపాలిటీ అధికారులే తీసుకున్నారు. వైకుంఠ ధామాలను ఈజీఎస్ నిధులతో నిర్మించడానికి శ్రీకారం చుడుతోంది. మున్సిపాలిటీ పరిధిలో కొన్ని కుల సంఘాలకు ప్రత్యేకంగా వైకుంఠ ధామాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. వైకుంఠధామంలో బాత్రూంలు, నీటి సౌకర్యం, తాగునీరు దుబ్బాక పట్టణంలోని కుమ్మరి కుంటలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) రూ. 30 లక్షల నిధులతో శ్మశాన వాటికను అత్యాధునికమైన పద్ధతుల్లో నిర్మించారు. పట్టణానికి సమీపంలోని అనువైన స్థలంలో దీన్ని నిర్మించారు. ఇందులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు ఏర్పాటు చేశారు. బర్నింగ్ పాయింట్ అత్యాధునికమైన పద్ధతిలో నిర్మించారు. వీటితోపాటు నీటి సౌకర్యం కల్పించారు. తాగు నీటి కోసం మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన గోదావరి నీటిని సమకూరుస్తున్నారు. కుమ్మరి కుంటలోనే కాకుండా ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో ఏదులా చెరువు, దుంపలపల్లిలో ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలు, చెల్లాపూర్‌లో ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో వైకుంఠ ధామాలను నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా దుబ్బాక పట్టణంలో కుల సంఘాల నిర్వహణలో శ్మశాన వాటికలు నడుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా నీలకంఠ, పద్మశాలి సంఘాలకు సంబంధించిన వైకుంఠధామాలు అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించుకున్నారు. వీటికి కూడా ప్రభుత్వం రూ. 20 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. పనులు కూడా పూర్తయ్యాయి. వీటిల్లో వృద్ధులు కూర్చోవడానికి ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు, ప్రహరీలను నిర్మించారు. హరితహారం పథకం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇవి శ్మశాన వాటికల్లా కనబడవు. ఇక్కడికి వస్తే దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నామా అనే సందేహం కలగకమానదు. స్మృతి వనాల్లోకి వెళితే స్వచ్ఛమైన గాలితో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కట్టిపడేస్తుంది. స్థలాభావంతో నోచుకోని వైకుంఠ ధామాలు దుబ్బాక మున్సిపాలిటీలోని లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, మల్లాయపల్లి గ్రామాల్లో వైకుంఠ ధామాలకు స్థల కొరత తీవ్రంగా ఉంది. శ్మశాన వాటికలకు స్థలం కొరత ఉండడంతో వివిధ కారణాలతో మరణించిన వ్యక్తుల మృతదేహాలను గ్రామానికి సమీపంలో ఉన్న కుంటలు, చెరువుల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అక్కడ నీటి సౌకర్యం ఉండదు. స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఉన్న శ్మశాన వాటికల స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూముల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ భూములపై స్పష్టత రాగానే వైకుంఠ ధామాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో వైకుంఠ రథం పాడెను ఎత్తుకోవడానికి జనం ముందుకు రావడం లేదు. కనీసం పాడె కట్టెలు, మృతదేహాన్ని దహనం చేసేందుకు కట్టెలు దొరకని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే నిధులతో మున్సిపాలిటీకి రూ. 10 లక్షల విలువైన వైకుంఠ రథాన్ని కొనుగోలు చేశారు. ఈ రథంలో మృతదేహాలను తరలించడానికి వాహన నిర్వహణ ఖర్చుల కింద దూరాన్ని బట్టి రూ. 500 నుంచి రూ. 1000 తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎవరు చనిపోయినా వైకుంఠ రథంపైనే తీసుకెళ్తున్నారు. శవాలను శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు వైకుంఠ రథం పట్టణ ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటోంది. ఆదర్శంగా వైకుంఠధామాలు కులం, మతం, వర్గం, పేద, ధనిక భేదాలతో నిరంతరం ఘర్షణ పడే వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తూనే ఉం టారు. మరణించిన ప్రతి వ్యక్తి ఈ మట్టిలో కలిసిపోతాడు. మరణించిన వ్యక్తులను ఒకే దగ్గర దహనం చేయడం, పూడ్చడం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా వైకుంఠధామాలను నిర్మిస్తోంది. వీటి కోసం నిధులను కూడా భారీగానే విడుదల చేస్తోంది. మనం నిర్మించిన వైకుంఠధామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. – ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక వైకుంఠధామాల నిర్వహణ మున్సిపాలిటీదే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న వైకుంఠ ధామాల నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీదే. మున్సిపాలిటీ పరిధిలో కుమ్మరి కుంటలో రూ. 30 లక్షలతో వైకుంఠధామాన్ని పూర్తి చేశాం. దుంపలపల్లి, చెల్లాపూర్ గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం కొనసాగుతోంది. లచ్చపేట, ధర్మాజీపేట, మల్లాయపల్లి, చేర్వాపూర్ గ్రామాల్లో స్థలా భావం ఉంది. రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ భూముల సర్వే చేయిస్తున్నాం. అది పూర్తి కాగానే ఇక్కడ కూడా వైకుంఠధామాలను నిర్మిస్తాం. శ్మశాన వాటికల్లో మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, బర్నింగ్ పాయింట్లను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించాం. తాగునీటి సౌకర్యం, ఆవరణల్లో మొక్కలు, పూల మొక్కలు నాటాం. ప్రజలు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – గోల్కొండ నర్సయ్య, కమిషనర్, దుబ్బాక -
సుందరీకరణకు.. ‘నీళ్లు’
- పార్కు చూడు... పార్కు అందం చూడు - వృథాగా కోట్ల రూపాయల వ్యయం - నిర్వహణ లోపంతో ఎండిపోతున్న మొక్కలు - డివైడర్‌పై వేసిన మొక్కలదీ అదే పరిస్థితి - పట్టించుకోని పురపాలక సంఘం కొవ్వూరు : ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టు ఉంది కొవ్వూరు పురపాలక సంఘం పరిస్థితి. సరైన నిర్వహణ లేక పట్టణంలోని పార్కులు ఘోరంగా ఉన్నాయి. గోదావరి పుష్కరాల పుణ్యమా అని కోట్లాది రూపాయలు రావడంతో ఏకంగా కిలోమీటర్ల తరబడి సుందరీకరణ పనులు చేపట్టారు. పట్టణ శివారున ఉన్న రెండో రోడ్డు వంతెన నుంచి టోల్ జంక్షన్ (రోడ్డు కం రైలు వంతెన వరకు) వరకు సుమారు 2.7 కిలోమీటర్ల పొడవున సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9.17 కోట్లు ఖర్చు చేశారు. పట్టణ వ్యాప్తంగా డివైడర్లు, జంక్షన్లు, గతంలో ఉన్న పార్కుల సుందరీకరణకు ఈ నిధులు ఖర్చు చేశారు. పుష్కరాలకు ఏటిగట్టుపై లాన్ గడ్డివేసిహడావిడిగా పలు రకాల మొక్కలు నాటారు. వీటికి కనీసం నీళ్లు పోసే నాథులు లేకపోవడంతో అప్పుడే మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. డివైడర్లపై వేసిన మొక్కలు ఒక్కొక్కటి మోడు వారుతున్నాయి. లాన్గడ్డి ఎక్కడికక్కడే ఎండిపోతోంది. జంక్షన్ల వద్ద వేసిన మొక్కలు, లాన్ గడ్డిది అదే పరిస్థితి. నిర్వహణను పట్టించుకోని పురపాలక సంఘం మొదట్లో పార్కుల్లోను, డివైడర్ మొక్కలు, లాన్ గడ్డికి నీళ్లు పోసినప్పటికీ పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి వీటి నిర్వహణను పురపాలక సంఘం పూర్తిగా విస్మరించింది. దీంతో పుష్కరాలు పూర్తికాకుండానే చాలాచోట్ల మొక్కలు మోడు వారాయి. పుష్కరాలు పూర్తయినా మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో ఎక్కడిక్కడే ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా వీటికి నీళ్లు పోయకపోతే లక్షలు ఖర్చు చేసి వేసిన మొక్కలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. అనాలోచిత నిర్ణయంతో రూ.కోట్లు వృథా పట్టణంలో గత పుష్కరాల సమయంలో గోదావరి మాత విగ్రహం నుంచి గోష్పాద క్షేత్రం వరకు ఐదు బ్లాకుల్లో సుమారు కిలోమీటరుకు పైగా పార్కులు ఏర్పాటు చేశారు. అవన్నీ పుష్కరాలు అయిన తర్వాత చిట్టడవులు మాదిరిగా తయారయ్యాయి. తర్వాత వచ్చిన పాలకవర్గం రూ.35 లక్షలు ఖర్చు చేసి రెండు బ్లాకులను సుందరీకరించి మళ్లీ పార్కులకు కొత్త రూపు తెచ్చింది. వీటిని నిర్వహించడమే పురపాలక సంఘానికి తలకు మించిన భారం అవుతోంది. ఇప్పుడు ఏకంగా 2.7 కిలోమీటర్లు పొడవునా సుందరీకరణ చేపట్టడంతో పురపాలక సంఘం ఏవిధంగా నిర్వహిస్తుందనేది అర్థం కావడం లేదు. నిర్వహణ గురించి ఆలోచించకుండా కోట్లు ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం వృథా అయ్యింది. కొందరు కౌన్సిల్ సభ్యులు సుందరీకరణ నిధులను పట్టణంలో వెచ్చిస్తే అభివృద్ధి నాలుగు కాలాలు పాటు గుర్తుండిపోతుందని మొత్తుకున్నా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. -
మహా నగరి ఆహ్లాద సిరి
- పర్యాటక ప్రాంతాలుగా చెరువులు - సుందరీకరణకు సన్నాహాలు - వడివడిగా జీహెచ్ఎంసీ అడుగులు - అంచనా వ్యయం రూ.60 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: సెలవు రోజుల్లోనో... తీరిక సమయాల్లోనో కుటుంబంతో కలసి సరదాగా గడుపుదామనుకుంటే... ఎక్కడో దూరాన ఉన్న ఏదో ఒక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందా? ఇది మీకు ఆర్థికంగా భారంగా మారుతోందా? జీహెచ్ఎంసీ ఆలోచన పూర్తి స్థాయిలో కార్యరూపం దాలిస్తే... ఇకపై ఎక్కువ దూరం వెళ్లకుండానే... మీ సమీప ప్రాంతాల్లోనే హాయిగా సేదదీరవచ్చు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు గ్రేటర్‌లోని వివిధ చెరువులు/సరస్సుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. వాస్తవానికి వర్షాకాలంలోగానే చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో సుందరీకరణపై అధికారులు దృష్టి సారించారు. వాతావరణ పరిస్థితులను బట్టి పునరుద్ధరణ పనులూ కొనసాగిస్తారు. ఇందులో భాగంగా చెరువులను ఆహ్లాదకరమైన... అందమైన పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతారు. గ్రేటర్లో దాదాపు 180 చెరువులు ఉన్నాయి. తొలిదశలో వీటిలో 30 చెరువులను సుందరీకరించాలని యోచిస్తున్నారు. దీనికి రూ. 60 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. వీటిలో 27 చెరువులకు ఆమోదం లభించింది. అన్ని చెరువులనూ ఒకేరకమైన సదుపాయాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రస్తుతం చాలా చెరువులు కబ్జాల పాలయ్యాయి. మిగిలినవి చెత్తాచెదారాలతో దుర్గంధం వెద జల్లుతూ పరిసరాల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా ఉన్నాయి. వర్షం కురిసినా నీరు నిండే దారి లేదు. అంతేకాక చెరువుల చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటి వద్దకు వెళ్లేందుకు సరైన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో వీటిని పిక్నిక్ స్పాట్లుగా మార్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఏం చేస్తారంటే... - చెరువు/సరస్సు స్థలం చుట్టూ ప్రహరీ /ఫెన్సింగ్‌ల నిర్మాణం - ప్రహరీ లోపల చెరువు ఒడ్డున అందమైన పచ్చిక, ఫౌంటెన్లతో సుందరీకరణ - నడక మార్గాల ఏర్పాటు - వివిధ రకాల మొక్కలతో పచ్చదనం పెంచడం - కూర్చునేందుకు బెంచీలు.. కుర్చీలు వంటి సౌకర్యాలు - వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయింపు - రాత్రి వేళల్లో అందాన్నిచ్చేలా ప్రత్యేక లైటింగ్ - స్నాక్స్, టీ/కాఫీలు లభించేలా కెఫ్టేరియా - వాన నీరు వెళ్లేలా బైపాస్ డ్రెయిన్లు - టాయ్లెట్లు, ఇతర సదుపాయాలు ...ఇలాంటి ఏర్పాట్లు చేస్తే వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు తమ సమీప ప్రాంతాల్లోని చెరువుల వద్దకు వెళ్తారని, వన భోజనాలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. తొలిదశలో 30 చెరువుల వద్ద ఈ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో అంచనాలు రూపొందించారు. షేక్‌పేటలోని కొత్త చెరువుకు మాత్రం టెండర్లు ఖరారు చేశారు. కొన్నిటికి టెండర్లు పిలవాల్సి ఉంది. మరికొన్నింటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.