శ్మశానం.. అత్యాధునికం
దుబ్బాక : ‘పుట్టిన వాడు గిట్టక మానడు’ అన్నది భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట. మరణం ఏ జీవికైనా తప్పదు.. అయితే చనిపోయిన తమ ఆప్తులకు కన్నీటి వీడ్కోలు చెప్పడానికి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శ్మశాన వాటిక దాకా రావడం సహజం. మరణించిన వ్యక్తులకు దహన సంస్కారాలు చేయడానికి అనువైన స్థలం కావాలి. ఈ తంతుకు వచ్చిన వారు ఆయా మత ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం నడుచుకోవడం అనాదిగా వస్తున్నదే. దహన సంస్కారాలకు వచ్చిన వ్యక్తులు స్నానం చేసి వేసుకున్న బట్టలను నీళ్లల్లో పిండనిదే ఇంటికి తిరిగి వెళ్లరు. దీని కోసం నీళ్లెక్కడ దొరుకుతాయా అని వెతుకులాడతారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేయలేరు. ఇలా దహన సంస్కారాలకు వచ్చిన వారు చాలా గ్రామాల్లో నీళ్లు, బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వం శ్మశాన వాటికల్లో సకల సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. శ్మశాన వాటికకు వెళితే.. ఇది నిజంగా శ్మశాన వాటికేనా అన్నంత అందంగా వైకుంఠ ధామం పేరుతో సుందరమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది. మరణించిన తమ వారి జ్ఞాపకార్థంగా స్మృతి వనాలను నిర్మిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక మున్సిపాలిటీలో వైకుంఠధామాలను అత్యాధునికమైన పద్ధతుల్లో నిర్మించడానికి భారీగానే నిధులను కేటాయిస్తోంది. వైకుంఠ ధామాల నిర్వహణ బాధ్యతను కూడా మున్సిపాలిటీ అధికారులే తీసుకున్నారు. వైకుంఠ ధామాలను ఈజీఎస్ నిధులతో నిర్మించడానికి శ్రీకారం చుడుతోంది. మున్సిపాలిటీ పరిధిలో కొన్ని కుల సంఘాలకు ప్రత్యేకంగా వైకుంఠ ధామాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.
వైకుంఠధామంలో బాత్రూంలు, నీటి సౌకర్యం, తాగునీరు
దుబ్బాక పట్టణంలోని కుమ్మరి కుంటలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్‌ఎఫ్‌సీ) రూ. 30 లక్షల నిధులతో శ్మశాన వాటికను అత్యాధునికమైన పద్ధతుల్లో నిర్మించారు. పట్టణానికి సమీపంలోని అనువైన స్థలంలో దీన్ని నిర్మించారు. ఇందులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు ఏర్పాటు చేశారు. బర్నింగ్ పాయింట్ అత్యాధునికమైన పద్ధతిలో నిర్మించారు. వీటితోపాటు నీటి సౌకర్యం కల్పించారు. తాగు నీటి కోసం మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన గోదావరి నీటిని సమకూరుస్తున్నారు. కుమ్మరి కుంటలోనే కాకుండా ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో ఏదులా చెరువు, దుంపలపల్లిలో ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలు, చెల్లాపూర్‌లో ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో వైకుంఠ ధామాలను నిర్మిస్తున్నారు.
ఇవే కాకుండా దుబ్బాక పట్టణంలో కుల సంఘాల నిర్వహణలో శ్మశాన వాటికలు నడుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా నీలకంఠ, పద్మశాలి సంఘాలకు సంబంధించిన వైకుంఠధామాలు అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించుకున్నారు. వీటికి కూడా ప్రభుత్వం రూ. 20 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. పనులు కూడా పూర్తయ్యాయి. వీటిల్లో వృద్ధులు కూర్చోవడానికి ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు, ప్రహరీలను నిర్మించారు. హరితహారం పథకం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇవి శ్మశాన వాటికల్లా కనబడవు. ఇక్కడికి వస్తే దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నామా అనే సందేహం కలగకమానదు. స్మృతి వనాల్లోకి వెళితే స్వచ్ఛమైన గాలితో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కట్టిపడేస్తుంది.
స్థలాభావంతో నోచుకోని వైకుంఠ ధామాలు
దుబ్బాక మున్సిపాలిటీలోని లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, మల్లాయపల్లి గ్రామాల్లో వైకుంఠ ధామాలకు స్థల కొరత తీవ్రంగా ఉంది. శ్మశాన వాటికలకు స్థలం కొరత ఉండడంతో వివిధ కారణాలతో మరణించిన వ్యక్తుల మృతదేహాలను గ్రామానికి సమీపంలో ఉన్న కుంటలు, చెరువుల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అక్కడ నీటి సౌకర్యం ఉండదు. స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఉన్న శ్మశాన వాటికల స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూముల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ భూములపై స్పష్టత రాగానే వైకుంఠ ధామాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రజలకు అందుబాటులో వైకుంఠ రథం
పాడెను ఎత్తుకోవడానికి జనం ముందుకు రావడం లేదు. కనీసం పాడె కట్టెలు, మృతదేహాన్ని దహనం చేసేందుకు కట్టెలు దొరకని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే నిధులతో మున్సిపాలిటీకి రూ. 10 లక్షల విలువైన వైకుంఠ రథాన్ని కొనుగోలు చేశారు. ఈ రథంలో మృతదేహాలను తరలించడానికి వాహన నిర్వహణ ఖర్చుల కింద దూరాన్ని బట్టి రూ. 500 నుంచి రూ. 1000 తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎవరు చనిపోయినా వైకుంఠ రథంపైనే తీసుకెళ్తున్నారు. శవాలను శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు వైకుంఠ రథం పట్టణ ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటోంది.
ఆదర్శంగా వైకుంఠధామాలు
కులం, మతం, వర్గం, పేద, ధనిక భేదాలతో నిరంతరం ఘర్షణ పడే వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తూనే ఉం టారు. మరణించిన ప్రతి వ్యక్తి ఈ మట్టిలో కలిసిపోతాడు. మరణించిన వ్యక్తులను ఒకే దగ్గర దహనం చేయడం, పూడ్చడం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా వైకుంఠధామాలను నిర్మిస్తోంది. వీటి కోసం నిధులను కూడా భారీగానే విడుదల చేస్తోంది. మనం నిర్మించిన వైకుంఠధామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. – ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక
వైకుంఠధామాల నిర్వహణ మున్సిపాలిటీదే
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న వైకుంఠ ధామాల నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీదే. మున్సిపాలిటీ పరిధిలో కుమ్మరి కుంటలో రూ. 30 లక్షలతో వైకుంఠధామాన్ని పూర్తి చేశాం. దుంపలపల్లి, చెల్లాపూర్ గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం కొనసాగుతోంది. లచ్చపేట, ధర్మాజీపేట, మల్లాయపల్లి, చేర్వాపూర్ గ్రామాల్లో స్థలా భావం ఉంది. రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ భూముల సర్వే చేయిస్తున్నాం. అది పూర్తి కాగానే ఇక్కడ కూడా వైకుంఠధామాలను నిర్మిస్తాం. శ్మశాన వాటికల్లో మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, బర్నింగ్ పాయింట్లను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించాం. తాగునీటి సౌకర్యం, ఆవరణల్లో మొక్కలు, పూల మొక్కలు నాటాం. ప్రజలు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – గోల్కొండ నర్సయ్య, కమిషనర్, దుబ్బాక
Comments
Please login to add a commentAdd a comment