వైఎస్సార్ విగ్రహం వద్ద పార్కు ఏర్పాటు కోసం మొక్కలు నాటుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు.
మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది.
దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది.
ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా?
నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు.
సుందరంగా తీర్చిదిద్దుతున్నా..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు.
– మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి
Comments
Please login to add a commentAdd a comment