సుందరీకరణకు.. ‘నీళ్లు’
- పార్కు చూడు... పార్కు అందం చూడు
- వృథాగా కోట్ల రూపాయల వ్యయం
- నిర్వహణ లోపంతో ఎండిపోతున్న మొక్కలు
- డివైడర్‌పై వేసిన మొక్కలదీ అదే పరిస్థితి
- పట్టించుకోని పురపాలక సంఘం
కొవ్వూరు : ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టు ఉంది కొవ్వూరు పురపాలక సంఘం పరిస్థితి. సరైన నిర్వహణ లేక పట్టణంలోని పార్కులు ఘోరంగా ఉన్నాయి. గోదావరి పుష్కరాల పుణ్యమా అని కోట్లాది రూపాయలు రావడంతో ఏకంగా కిలోమీటర్ల తరబడి సుందరీకరణ పనులు చేపట్టారు. పట్టణ శివారున ఉన్న రెండో రోడ్డు వంతెన నుంచి టోల్ జంక్షన్ (రోడ్డు కం రైలు వంతెన వరకు) వరకు సుమారు 2.7 కిలోమీటర్ల పొడవున సుందరీకరణకు శ్రీకారం చుట్టారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9.17 కోట్లు ఖర్చు చేశారు. పట్టణ వ్యాప్తంగా డివైడర్‌లు, జంక్షన్‌లు, గతంలో ఉన్న పార్కుల సుందరీకరణకు ఈ నిధులు ఖర్చు చేశారు. పుష్కరాలకు ఏటిగట్టుపై లాన్ గడ్డివేసిహడావిడిగా పలు రకాల మొక్కలు నాటారు. వీటికి కనీసం నీళ్లు పోసే నాథులు లేకపోవడంతో అప్పుడే మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. డివైడర్‌లపై వేసిన మొక్కలు ఒక్కొక్కటి మోడు వారుతున్నాయి. లాన్‌గడ్డి ఎక్కడికక్కడే ఎండిపోతోంది. జంక్షన్‌ల వద్ద వేసిన మొక్కలు, లాన్ గడ్డిది అదే పరిస్థితి.
నిర్వహణను పట్టించుకోని పురపాలక సంఘం
మొదట్లో పార్కుల్లోను, డివైడర్ మొక్కలు, లాన్ గడ్డికి నీళ్లు పోసినప్పటికీ పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి వీటి నిర్వహణను పురపాలక సంఘం పూర్తిగా విస్మరించింది. దీంతో పుష్కరాలు పూర్తికాకుండానే చాలాచోట్ల మొక్కలు మోడు వారాయి. పుష్కరాలు పూర్తయినా మొక్కలకు నీళ్లు పోయకపోవడంతో ఎక్కడిక్కడే ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా వీటికి నీళ్లు పోయకపోతే లక్షలు ఖర్చు చేసి వేసిన మొక్కలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది.
అనాలోచిత నిర్ణయంతో రూ.కోట్లు వృథా
పట్టణంలో గత పుష్కరాల సమయంలో గోదావరి మాత విగ్రహం నుంచి గోష్పాద క్షేత్రం వరకు ఐదు బ్లాకుల్లో సుమారు కిలోమీటరుకు పైగా పార్కులు ఏర్పాటు చేశారు. అవన్నీ పుష్కరాలు అయిన తర్వాత చిట్టడవులు మాదిరిగా తయారయ్యాయి. తర్వాత వచ్చిన పాలకవర్గం రూ.35 లక్షలు ఖర్చు చేసి రెండు బ్లాకులను సుందరీకరించి మళ్లీ పార్కులకు కొత్త రూపు తెచ్చింది. వీటిని నిర్వహించడమే పురపాలక సంఘానికి తలకు మించిన భారం అవుతోంది.
ఇప్పుడు ఏకంగా 2.7 కిలోమీటర్లు పొడవునా సుందరీకరణ చేపట్టడంతో పురపాలక సంఘం ఏవిధంగా నిర్వహిస్తుందనేది అర్థం కావడం లేదు. నిర్వహణ గురించి ఆలోచించకుండా కోట్లు ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం వృథా అయ్యింది. కొందరు కౌన్సిల్ సభ్యులు సుందరీకరణ నిధులను పట్టణంలో వెచ్చిస్తే అభివృద్ధి నాలుగు కాలాలు పాటు గుర్తుండిపోతుందని మొత్తుకున్నా పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది.