మహా నగరి ఆహ్లాద సిరి
- పర్యాటక ప్రాంతాలుగా చెరువులు
- సుందరీకరణకు సన్నాహాలు
- వడివడిగా జీహెచ్‌ఎంసీ అడుగులు
- అంచనా వ్యయం రూ.60 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: సెలవు రోజుల్లోనో... తీరిక సమయాల్లోనో కుటుంబంతో కలసి సరదాగా గడుపుదామనుకుంటే... ఎక్కడో దూరాన ఉన్న ఏదో ఒక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందా? ఇది మీకు ఆర్థికంగా భారంగా మారుతోందా? జీహెచ్‌ఎంసీ ఆలోచన పూర్తి స్థాయిలో కార్యరూపం దాలిస్తే... ఇకపై ఎక్కువ దూరం వెళ్లకుండానే... మీ సమీప ప్రాంతాల్లోనే హాయిగా సేదదీరవచ్చు.
ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు గ్రేటర్‌లోని వివిధ చెరువులు/సరస్సుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. వాస్తవానికి వర్షాకాలంలోగానే చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో సుందరీకరణపై అధికారులు దృష్టి సారించారు. వాతావరణ పరిస్థితులను బట్టి పునరుద్ధరణ పనులూ కొనసాగిస్తారు. ఇందులో భాగంగా చెరువులను ఆహ్లాదకరమైన... అందమైన పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతారు. గ్రేటర్‌లో దాదాపు 180 చెరువులు ఉన్నాయి. తొలిదశలో వీటిలో 30 చెరువులను సుందరీకరించాలని యోచిస్తున్నారు. దీనికి రూ. 60 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. వీటిలో 27 చెరువులకు ఆమోదం లభించింది.
అన్ని చెరువులనూ ఒకేరకమైన సదుపాయాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రస్తుతం చాలా చెరువులు కబ్జాల పాలయ్యాయి. మిగిలినవి చెత్తాచెదారాలతో దుర్గంధం వెద జల్లుతూ పరిసరాల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా ఉన్నాయి. వర్షం కురిసినా నీరు నిండే దారి లేదు. అంతేకాక చెరువుల చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటి వద్దకు వెళ్లేందుకు సరైన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో వీటిని పిక్నిక్ స్పాట్‌లుగా మార్చేందుకు అధికారులు యోచిస్తున్నారు.
ఏం చేస్తారంటే...
- చెరువు/సరస్సు స్థలం చుట్టూ ప్రహరీ /ఫెన్సింగ్‌ల నిర్మాణం
- ప్రహరీ లోపల చెరువు ఒడ్డున అందమైన పచ్చిక, ఫౌంటెన్లతో సుందరీకరణ
- నడక మార్గాల ఏర్పాటు
- వివిధ రకాల మొక్కలతో పచ్చదనం పెంచడం
- కూర్చునేందుకు బెంచీలు.. కుర్చీలు వంటి సౌకర్యాలు
- వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయింపు
- రాత్రి వేళల్లో అందాన్నిచ్చేలా ప్రత్యేక లైటింగ్
- స్నాక్స్, టీ/కాఫీలు లభించేలా కెఫ్టేరియా
- వాన నీరు వెళ్లేలా బైపాస్ డ్రెయిన్లు
- టాయ్‌లెట్లు, ఇతర సదుపాయాలు
...ఇలాంటి ఏర్పాట్లు చేస్తే వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు తమ సమీప ప్రాంతాల్లోని చెరువుల వద్దకు వెళ్తారని, వన భోజనాలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. తొలిదశలో 30 చెరువుల వద్ద ఈ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో అంచనాలు రూపొందించారు. షేక్‌పేటలోని కొత్త చెరువుకు మాత్రం టెండర్లు ఖరారు చేశారు. కొన్నిటికి టెండర్లు పిలవాల్సి ఉంది. మరికొన్నింటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.