BEd students
-
ప్రభుత్వ ‘పథకం’.. చదువుకు దూరం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం చేసిన మార్పులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. పథకంలో చేసిన మార్పులపై అధికారులకూ స్పష్టత లేకపోవడంతో పీజీ, బీఈడీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పీజీ, బీఈడీ కోర్సులు చదువుతున్న వారు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 విద్యా సంవత్సరం వరకు పీజీ చేసి బీఈడీ చేసినా, బీఈడీ చేసి పీజీ చేసినా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ ఇదే విధానం కొనసాగడంతో విద్యార్థులు పీజీ, బీఈడీ కోర్సుల్లో చేరారు. అయితే ఆ తర్వాత కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పీజీ చేసి బీఈడీ చేసిన వారికి రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఈ పాస్‌లో ఆ విద్యార్థుల దరఖాస్తులు నమోదు కావడం లేదు. దీంతో ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు, గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వమంటే ఎలా అని వాపోతున్నారు. తాము కోర్సుల్లో చేరే నాటికి పాత పద్ధతి అమల్లో ఉందని, పీజీ చేసి బీఈడీ చేసినా, బీఈడీ చేసి పీజీ చేసినా తమ ఫీజులు చెల్లించాలని కోరుతూ ఫీజు రీయింబర్స్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ ఎస్సీ డెవలప్మెంట్ శాఖ చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎస్సీ శాఖ అధికారులు కూడా విద్యార్థులకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు, అక్కడి నుంచి వచ్చే వివరణను బట్టి స్పందిస్తామని అధికారులు చెబుతున్నారు. అది ఇస్తేనే.. ఇది.. బీఈడీ చేసి పీజీ చేస్తున్న వారు బీఈడీ రీయింబర్స్‌మెంటును చలాన్ రూపంలో తిరిగి చెల్లిస్తే, పీజీ ఫీజు ఇస్తామని కొన్నిచోట్ల అధికారులు చెబుతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్స్-కోర్సు ఫ్లో అడాప్టెడ్ ఇన్ ఈ పాస్ (కింది నుంచి పైకి కోర్సుల వరుస క్రమం) అంటూ స్కాలర్షిప్స్ దరఖాస్తులను పరిశీలించి, మంజూరు చేసే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు సంబంధిత అధికారులు ఉత్తర్వులు పంపించారు. అందుకు అనుగుణంగా ఈ-పాస్ వెబ్సైట్లో మార్పులు చేయడంతో ఈ విద్యార్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. పీజీ తర్వాత డిగ్రీ.. సాధారణంగా బీఈడీ డిగ్రీ స్థాయి కోర్సు. ఆ తరువాత క్రమంలో వచ్చే కోర్సు పీజీ. కాని పీజీ చేసిన విద్యార్థి ఆ తరువాత డిగ్రీతో సమానమైన వృత్తి విద్యా కోర్సు (బీఈడీ) చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇందులో భాగంగా కోర్సు స్ట్రీమ్, కోర్సు ఫ్లో అంటూ జనరల్, ఎడ్యుకేషన్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి ఆయా విభాగాలు క్రమపద్ధతిలో అంటే ఇంటర్, డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్డీ వంటివి వరసగా చదివితేనే రీయింబర్స్మెంట్ వర్తించేలా మార్పులు చేశారు. ఎడ్యుకేషన్ విభాగంగా బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్డీ క్రమపద్ధతిలో వరసగా చదివితేనే ఫీజు చెల్లించేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశారు. దీనిపై ప్రభుత్వ పరంగా వివరణ వస్తేనే సమస్య పరిష్కారమవుతుందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, అధికారులు వెలిబుచ్చుతున్నారు. -
సెల్‌టవరెక్కిన బీఈడీ అభ్యర్థులు
-‘అనంత’లో కలకలం! - బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ - ప్రభుత్వం తెప్పదాట దోరణి అవలంభిస్తోందంటూ ధ్వజం అనంతపురం క్రైం :బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న సెల్‌టవర్‌ను ఎక్కడం కలకలం రేపింది. సుమారు రెండు గంటల పాటు టవర్ నుంచి దిగకుండా పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడేమో తెప్పదాట దోరణి అవలంభిస్తోందంటూ బీఈడీ అభ్యర్థులు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి నరేష్, బీఈడీ అభ్యర్థి నరసింహులు ఉదయం 11 గంటల సమయంలో సెల్ టవర్ ఎక్కారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ, టూటౌన్ సీఐ శుభకుమార్, పలువురు ఎస్ఐలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టవర్‌పైకి ఎక్కిన వారిని కిందకు దింపే ప్రయత్నం చేశారు. లాభం లేకపోయింది. టూటౌన్ ఎస్ఐ హమీద్‌ఖాన్ సెల్‌టవర్ ఎక్కాడు. ఆందోళన కారులవద్దకు వాటర్ బాటిల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పైకి వస్తే కిందకు దూకేస్తామంటూ బీఈడీ అభ్యర్థి నరసింహులు హెచ్చరించడంతో ఎస్ఐ వెనక్కు తగ్గారు. టవర్ కింద రోడ్డుపై ఏఐఎస్ఎఫ్ నాయకులు బీఈడీ అభ్యర్థుల సమాఖ్య నాయకులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు డీఎస్సీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. తామంతా ఓట్లు వేసింటేనే గద్దెనెక్కారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. డీఎస్పీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత ఆందోళనకారులను మంత్రితో మాట్లాడించారు. కాసేపటికి విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి ఇద్దరూ సెల్ కాన్ఫరెన్స్‌లో ఉంటూ అభ్యర్థులతో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫకేషన్ రద్దు చేయడం వీలుకాదని, తర్వాత డీఎస్సీలో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం సెలటవర్ నుంచి యువకులు కిందకు దిగారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోహర్, కుళ్లాయప్ప, అలి, కుళ్లాయిస్వామిగౌడ్, బీఈడీ అభ్యర్థుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు హనుమన్న, హనుమంతు, ప్రసాద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ విద్యార్థులు
హైదరాబాద్: డీఎస్సీ, టెట్‌పై బీఈడీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీఓ నెంబర్ 38ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జీఓ 38పై ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టిందని విద్యార్థులు తెలిపారు. జూన్ 3 వరకు డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించవద్దని హైకోర్టు సూచించినట్లు చెప్పారు. టెట్, టీఆర్టీలో ప్రస్తుత నిబంధనలు ఆర్టీఏ యాక్ట్‌కు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీఈడీ విద్యార్థులు శేఖర్, అనిత కోరారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే నాలుగున్నర లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో హామీ వచ్చారని వారు తెలిపారు. ఇప్పడు ఆయన మాట నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని వారన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ విద్యార్థులు
-
ఆశలు ఆవిరి
అవనిగడ్డ సాక్షిగా... మాటతప్పిన బాబు ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు నో చాన్స్ లబోదిబోమంటున్న అభ్యర్థులు ‘ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తాం..’ ఈ ఏడాది మేలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవనిగడ్డ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మండలి బుద్ధప్రసాద్ తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక రాజీవ్‌చౌక్‌లో జరిగిన బహిరంగసభలో నాటి టీడీపీ అభ్యర్థి, నేటీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు ఈ ప్రకటన చేశారు. మరి ఇప్పుడేం చేశారంటే.. అవనిగడ్డ : ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తామని అవనిగడ్డ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు నేడు మాట తప్పారు. తాజాగా టెట్, డీఎస్సీ స్థానంలో టెట్ కమ్ టీఆర్టీగా పేరు మార్చి విడుదల చేసిన జీవోలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీలకు అవకాశం కల్పించకుండానే ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాడు చంద్రబాబు చేసిన ప్రకటనను నమ్మి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ పొందుతున్న వేలాదిమంది అభ్యర్థులు ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఊరించి.. ఉసూరుమనిపించారు... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం డీఎస్సీ నోటీఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. బాలారిష్టాలు తొలగి ఎట్టకేలకు వెలువడిన డీఎస్సీ నోటీఫికేషన్ బీఈడీ విద్యార్థులు, అభ్యర్థులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులు రాయడానికి అవకాశం కల్పించకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కూలీనాలి చేసుకుని బతికే బడుగు జీవులు సైతం వేలాది రూపాయలు వ్యయంచేసి తమ బిడ్డలను ఇక్కడకు శిక్షణకు పంపారు. గత ఆరు నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతమైంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎస్జీటీ చేసిన వారిని, ఆరు నుంచి పదో తరగతి బోధించే ఉపాధ్యాయులుగా బీఈడీ అభ్యర్థులను ఎంపిక చేస్తే ప్రతి జిల్లాలోనూ స్కూలు అసిస్టెంట్ పోస్టులు పెరిగేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు అందులో తమ జిల్లాలో తమ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు చూపకపోవడంతో మనోవేదనతో తల్లడిల్లిపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తామేం చేయాలో పాలుపోవడం లేదని పలువురు అభ్యర్థులు కన్నీరు పెట్టుకున్నారు. కొందరి ఆవేదన ఇలా ఉంటే మరికొందరి ఆవేదన మరోలా ఉంది. డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి జూలై ఒకటి నాటికి 40 సంవత్సరాలు నిండకూడదని గడువు విధించటం కూడా కొందరిపాలిట అశనిపాతమైంది. కనీసం జూన్ నెలను ప్రాతిపదికగా చేసుకుని ఉంటే మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిరాశే మిగిలింది... ఐదు నెలలుగా ఇక్కడ మ్యాథ్స్ బీఈడీ అసిస్టెంట్‌కు శిక్షణ పొందుతున్నాను. డీఎస్సీ నోటిఫికేషన్లో మా జిల్లాలో ఖాళీలు చూపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయినవారందరికీ దూరంగా ఉంటూ ఉద్యోగంపై ఆశతో శిక్షణ పొందిన నాకు చివరకు నిరాశే మిగిలింది. - ఎస్.పద్మ, కడవకుదురు, ప్రకాశం జిల్లా అగమ్యగోచరం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే పోస్టుల సంఖ్య పెరుగుతాయని ఎంతో ఆశగా గత ఆరు నెలల నుంచి పగలనకా రేయనకా కష్టపడి చదువుతున్నాం. తీరా విద్యాశాఖ ప్రకటన చూశాక ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. - ఎన్.వెంగమ్మ, నెల్లూరు