Bellampalli assembly constituency
-
ధరణి కంటే మంచి పోర్టల్ తెస్తాం: రేవంత్‌రెడ్డి
సాక్షి, బెల్లంపల్లి: తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి .. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామని అన్నారు. బెల్లంపల్లిలో శనివారం జరిగిన కాంగ్రస్ విజయభేరి ఎన్నికల ప్రచార సభలో ఆయన బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మేడిగడ్డకు తీసుకెళ్లారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయింది. అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా?. అదేమైనా పేక మేడనా?.. ఇసుకపై బ్యారేజీ కడితే అది కుంగిపోయింది. మేడిగడ్డ అణా పైసాకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు. .. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు... దేశమంతా తెలుసు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?. అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది’’ అని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు?, ధరణికంటే మెరుగైన సాంకేతికతతో పోర్టల్ తీసుకొస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియా. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు.’’ అని రేవంత్ వివరించారు. సింగరేణి కార్మికుల్ని కేసీఆర్ మోసం చేశారు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొన్నారని.. కానీ, వాళ్లను కూడా కేసీఆర్ మోసం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. రామగుండం కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అంతా పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్దీకరించలేదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎందుకు బంద్ కాలేదు?. సింగరేణి సొంతింటి కల నెరవేరిందా?. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’’ అని అన్నారాయన. -
వ్యతిరేకతను అధిగమించి హ్యాట్రిక్ కొడతారా?
ఆ ఎమ్మెల్యే మీద ఊళ్ళకు ఊళ్ళే తిరగబడుతున్నాయట. మా ఊళ్ళోకి రావద్దని ప్రజలు అడ్డగిస్తున్నారట. పొలిమేరలోనే అడుగుపెట్టనీయడంలేదట. అభివృద్ధి చేయని ఎమ్మెల్యేకు ఈసారి ఓటడిగే హక్కులేదని తేల్చి చెబుతున్నారట. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన నియోజకవర్గం ఎక్కడుంది? మరి ప్రత్యర్థి అయినా అక్కడ బలంగా ఉన్నారా? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుండి గత రెండు ఎన్నికలల్లోనూ దుర్గం చిన్నయ్య విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు. సింగరేణి కాలరీస్ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి చిన్నయ్య పట్టాలు ఇప్పించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా నిర్మించి పేదలకు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాలకు మాత్రం రోడ్లు నిర్మించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు మినహా..తన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో చేసిందేమీ లేదనే అపవాదును ఎదుర్కొంటున్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్.. బస్సు డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. పక్కనే ఉన్న మంచిర్యాలలో మెడికల్ కళశాల నిర్మాణమై తరగతులు కూడా మొదలయ్యాయి. బస్సు డిపో చెన్నూర్ కు మంజూరైనా..బెల్లంపల్లికి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే వైఫల్యం వల్లనే మెడికల్ కళాశాల, బస్సు డిపో రాలేదని ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇవే కాదు.. మారుమూల ప్రాంతాల్లో ఏమాత్రం ప్రగతి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కనీస వసతులులేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు ఎమ్మెల్యే వెళితే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. పదేళ్ళుగా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారా అంటూ..ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామంలోకి రాకుండా ఆపివేసి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేయకపోవడం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం ఒక భాగం అయితే..అరిజన్ కంపెనీ ప్రతినిధి షేజల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరువు తీసేసాయి. మహిళా ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత పెరిగినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. చిన్నయ్య అసమర్థత, ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఎమ్మెల్యేను ఓడించాలంటూ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. అయితే ఎవరెంత ప్రచారం చేసుకున్నా తన విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే చిన్నయ్య. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి గడ్డం వినోద్ ఓటమి చెందారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ..దుర్గం చిన్నయ్య మీద వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గడ్డం వినోద్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌కు ఊపు రావడం కూడా వినోద్‌కు కలిసివస్తుందంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ప్రచారం సందర్భంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందట. ప్రజల స్పందనే వినోద్‌లో గెలుపు పై ధీమాను పెంచుతున్నాయట. కాని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరరావు వర్గం వినోద్‌కు వ్యతిరేకంగా పని చేస్తోందట. పార్టీలోని వర్గ విభేదాలు వినోద్‌కు ఆందోళన కలిగిస్తున్నాయట. ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ధీటుగా కమలం పార్టీ కూడా ఎన్నికల యుద్ధం చేస్తానంటోంది. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాని బెల్లంపల్లి నియోజకవర్గంలో కమలం పార్టీకి బలం లేదు. మాజీ ఎమ్మెల్యేగా ప్రజల్లో తనకు పలుకుబడి ఉందని..తనకున్న ప్రజాదరణే ఈసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని శ్రీదేవి భావిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో బిజెపికి ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి. ముక్కోణపు పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. -
బెల్లంపల్లి రాజకీయ చరిత్ర.. గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2014లో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య రెండోసారి గెలుపొందారు. ఇక్కడ మాజీ మంత్రి జి.వినోద్ బిఎస్పి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు ఆయన టిఆర్ఎస్లో ఉన్నారు. టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో బిఎస్పి టిక్కెట్ తీసుకుని ఇక్కడ పోటీచేసి ఓటమి చెందారు. చిన్నయ్యకు 11276 ఓట్ల మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు మొత్తం 55026 ఓట్లు రాగా, వినోద్‌కు 31359 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా మూడోస్థానం ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఉన్న కె.వేద పదివేలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. సిపిఐ సీనియర్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ డిపాజిట్ దక్కించు కోలేకపోయారు. కాంగ్రెస్ ఐ మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. భారీ ఆదిక్యతతో.. బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2009లో గెలిచి ఆ శాసనసభలో సిపిఐ పక్ష నేతగా ఉన్న గుండా మల్లేష్ వరసగా ఓటమి చెందారు. 2014లో బెల్లంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య భారీగా 52,528 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో మల్లేష్ కూడా యాక్టివ్‌గా ఉన్నా ఫలితం దక్కేలేదు. 2014లో బెల్లంపల్లిలో టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్రకు 9167 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రముఖ బొగ్గు కేంద్రంగా ఉన్న బెల్లంపల్లి 2009లో రిజర్వుడ్ నియోజకవర్గంగా ఏర్పడింది. మల్లేష్ గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం (ఎస్.సి)లో మూడుసార్లు 1983, 1985, 1994లో విజయం సాధించారు.2009లో నాలుగో సారి గెలిచిన తరువాత మల్లేష్ సిపిఐ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సీపీఐకి రెబల్స్ బెడద
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌కు రెబల్స్ బెడద పట్టుకుంది. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌నే మళ్లీ బరిలో దింపారు. అయితే.. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం సీపీఐ-కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కొరవడింది. కనీసం ముఖ్య నాయకులు కూడా ఇంత వరకు సమష్టిగా మాట్లాడుకున దాఖలాలు లేవు. అంతేగాకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి చిలుముల శంకర్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. నియోజకవర్గంలోని తాండూర్, కాసిపేట, భీమిని, నెన్నెల, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల కాంగ్రెస్ ముఖ్య, ద్వితీయ శ్రేణి నాయకులు శంకర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఎన్నికల్లో శంకర్ విజయం సాధించేలా కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ పరిణామాలు సీపీఐ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. సయోధ్య కుదిరేనా? సీపీఐ అభ్యర్థిగా గుండా మల్లేష్, స్వతంత్ర అభ్యర్థిగా చిలుముల శంకర్ ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది. కలిసి పోటీ చేయాల్సింది పోయి ఎవరికి వారు వేర్వేరుగా నామినేషన్ దాఖలు చేయడంతో ఇరు పార్టీల మధ్య వైరుధ్యం పెరిగింది. ఇదిలా ఉంటే.. బుధవారం సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ నామినేషన్ దాఖలు చేయగా.. ఆ కార్యక్రమానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ వాళ్లు రానేలేదు. శంకర్ చేపట్టిన నామినేషన్ ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్నారు. రెండు పార్టీల నాయకుల మధ్య సఖ్యత కలిగించడానికి అధినాయకులు రంగంలో దిగితే తప్ప మనస్పర్థలు తొలగేలా లేవు. ఆ దిశగా సీపీఐ శ్రేణులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ లోపు కాంగ్రెస్ శ్రేణులను బుజ్జగించకపోతే మల్లేష్‌కు తీవ్ర నష్టం కలిగే అవకాశాలూ లేకపోలేదు. వైఎస్సార్ సీపీ వైపు దృష్టి ఇదిలా ఉంటే.. బెల్లంపల్లి అసెంబ్లీ బరిలో తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి విద్యావేత్త ఎరుకల రాజ్‌కిరణ్ పోటీ చేస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు, కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు ప్రస్తుతం వైఎస్సార్ సీపీ వైపు దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ వైఎస్సార్‌ను అభిమానించే ముఖ్య నేతలు ఎందరో ఉన్నారు. వారు రాజ్‌కిరణ్ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.