బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌కు రెబల్స్ బెడద పట్టుకుంది. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌నే మళ్లీ బరిలో దింపారు. అయితే.. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం సీపీఐ-కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కొరవడింది. కనీసం ముఖ్య నాయకులు కూడా ఇంత వరకు సమష్టిగా మాట్లాడుకున దాఖలాలు లేవు.
అంతేగాకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి చిలుముల శంకర్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. నియోజకవర్గంలోని తాండూర్, కాసిపేట, భీమిని, నెన్నెల, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల కాంగ్రెస్ ముఖ్య, ద్వితీయ శ్రేణి నాయకులు శంకర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఎన్నికల్లో శంకర్ విజయం సాధించేలా కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ పరిణామాలు సీపీఐ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
సయోధ్య కుదిరేనా?
సీపీఐ అభ్యర్థిగా గుండా మల్లేష్, స్వతంత్ర అభ్యర్థిగా చిలుముల శంకర్ ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది. కలిసి పోటీ చేయాల్సింది పోయి ఎవరికి వారు వేర్వేరుగా నామినేషన్ దాఖలు చేయడంతో ఇరు పార్టీల మధ్య వైరుధ్యం పెరిగింది. ఇదిలా ఉంటే.. బుధవారం సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ నామినేషన్ దాఖలు చేయగా.. ఆ కార్యక్రమానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ వాళ్లు రానేలేదు. శంకర్ చేపట్టిన నామినేషన్ ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్నారు. రెండు పార్టీల నాయకుల మధ్య సఖ్యత కలిగించడానికి అధినాయకులు రంగంలో దిగితే తప్ప మనస్పర్థలు తొలగేలా లేవు. ఆ దిశగా సీపీఐ శ్రేణులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ లోపు కాంగ్రెస్ శ్రేణులను బుజ్జగించకపోతే మల్లేష్‌కు తీవ్ర నష్టం కలిగే అవకాశాలూ లేకపోలేదు.
వైఎస్సార్ సీపీ వైపు దృష్టి
ఇదిలా ఉంటే.. బెల్లంపల్లి అసెంబ్లీ బరిలో తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి విద్యావేత్త ఎరుకల రాజ్‌కిరణ్ పోటీ చేస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు, కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు ప్రస్తుతం వైఎస్సార్ సీపీ వైపు దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ వైఎస్సార్‌ను అభిమానించే ముఖ్య నేతలు ఎందరో ఉన్నారు. వారు రాజ్‌కిరణ్ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీపీఐకి రెబల్స్ బెడద
Published Thu, Apr 10 2014 12:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement