beluguppa
-
గాలీవాన బీభత్సం
గుంతకల్లు నియోజకవర్గంలోగుంతకల్లు, పామిడి, ఉరవకొండ నియోజకవర్గంలో వజ్రకరూరు, బెళుగుప్ప, రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాళ్, కణేకల్లు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలాయి. వరిపంట నేలకూలింది. రబీ వేరుశనగ నూర్పిడి చేస్తుండగా వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఈనెలలో ఎండలు మండుతుండగా ఈదురుగాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కొంత ఉపశమనం కలిగింది. –సాక్షి,నెట్వర్క్ బెళుగుప్ప మండలంలో గురువారం రాత్రి, శుక్రవారం వర్షం కురిసింది. ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రంలో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. బెళుగుప్ప, ఆవులెన్న, రామసాగరం, నక్కలపల్లి తదితర గ్రామాల్లో రబీలో సాగు చేసిన వేరుశనగ పంట నూర్పిడి చేస్తుండగా పూర్తిగా తడిసిపోయింది. ఆవులెన్నలో రైతు నరసింహకు చెందిన ట్రాక్టర్‌పై పెద్ద తుమ్మ చెట్టు పడింది. దీంతో ఇంజిన్ ధ్వంసమైంది. బెళుగుప్ప వద్ద రైతు తిరుమలరెడ్డికి చెందిన మామిడి చెట్లు, ఆవులెన్నలో రైతు రామకృష్ణతో పాటు పలు చోట్ల మొక్కజొన్న పంట నేలవాలింది. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, ఉంతకల్లు, శ్రీధరఘట్ట, దర్గాహొన్నూరు, గోవిందవాడ, బండూరు, కృష్ణాపురం, లింగదహాళ్, కొలగానహాళ్లి తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.గాలీవానకు వరిపంట పూర్తిగా నేలకొరిగింది. దర్గాహొన్నూరు గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉంతకల్లు క్రాస్ వద్ద ఇరువైపులా ఉన్న చెట్లు, కొమ్మలు నేలకొరిగాయి. నేలకొరిగిన వరిపంట కణేకల్లు మండలంలో గురువారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వరి పంట నేలకొరిగింది. వర్షపాతం 29.2 ఎంఎంగా నమోదైంది.కణేకల్లు, యర్రగుంట, మారెంపల్లి, 43 ఉడేగోళం, గంగలాపురం గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. కోతకొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుంతకల్లు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎస్జేపీ హైస్కూల్ రోడ్, ఆర్అండ్బీసర్కిల్ రోడ్, భాగ్యనగర్, తదితర ఏరియాల్లో చెట్లు నేలకూలి విద్యుత్‌తీగలపై పడ్డాయి. సుమారు మూడున్నర గంటల సేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షంతో పలు లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది. రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో కొంతసేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కూలిన విద్యుత్ స్తంభాలు వజ్రకరూరులో శుక్రవారం సాయంత్రం అరగంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.దీంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు మెయిన్ రోడ్డుమీదుగా ప్రవహించింది. కుమ్మర వీధిలో నాలుగు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరపరా నిలిచిపోయింది. వర్షంరాకతో వ్యవసాయ పనులు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పామిడిలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలి వీచింది. దీంతో దాబా రేకులు ఎగిరిపడ్డాయి. చెట్లు నేల కూలాయి. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ వర్షానికి చల్లటి వాతావరణం నెలకొనడంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. గార్లదిన్నె : మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శుక్రవారం గాలీవాన బీభత్సంతో ఓ మోస్తారు వర్షం కురిసింది. కల్లూరులో నారాయణ స్వామి అనే వ్యక్తికి చెందిన దాబా పైకప్పు గాలికి ఎగిరిపడిపోయింది. దీంతో రూ.లక్షలు నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు. మండలంలోని పలు గ్రామాల్లో పెనుగాలుల తాకిడికి చెట్లు నేలకూలాయి. మరికొన్ని గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. -
సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన బెలుగుప్ప మండలం రైతులు
-
అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ మోస్తరుగా వర్షం పడింది. బెళుగుప్ప 21 మి.మీ, కళ్యాణదుర్గం 20.6 మి.మీ, ఓడీ చెరువు 17.7 మి.మీ, కనేకల్లు 16.9 మి.మీ, గాండ్లపెంట 14.1 మి.మీ, కంబదూరు 14 మి.మీ, బుక్కపట్నం 12.3 మి.మీ, శెట్టూరు 12.2 మి.మీ, ఎన్పీ కుంట 10.1 మి.మీ వర్షం కురిసింది. మరో 10 మండలాల్లో 5 నుంచి 10 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో తుంపర్లు పడ్డాయి. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 50.4 మి.మీ నమోదైంది. -
నేత్రపర్వంగా ఉట్లపరుష
బెళుగుప్ప (ఉరవకొండ) : మండల కేంద్రం బెళుగుప్పలోని శాంతిధామంలో అవధూత ఎర్రితాతస్వామి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉట్లపరుష నేతపర్వంగా జరిగింది. ఉట్లమాను ఎక్కేందుకు యువకులు పోటాపోటీగా తలపడ్డారు. బీసీ కాలనీకి చెందిన నరేష్ ఉట్లమానును ఎక్కి స్వామివారి ప్రసాదంగా ఉంచిన వివిధ రకాల పండ్లు, నారికేళాన్ని అందుకున్నాడు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఎర్రితాతస్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. గ్రామంలో రాత్రి ప్రదర్శించిన ‘సప్తమాంకములు’ అనే నాటకం అందర్నీ ఆకట్టుకుంది. అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా ఎస్ఐ నాగస్వామి సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. -
రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
సీమ నుంచి 10 లక్షల మంది వలసెళ్లారు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చి..రైతులను ఆదుకోవాలి రైతుధర్నాలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి బెళుగుప్ప : వరుస కరువులతో సతమతమవుతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం బెళుగుప్ప తహసీల్దార్ కార్యాలయం ముందు స్థానిక సర్పంచ్ రామేశ్వరరెడ్డి అధ్యక్షతన రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటని గుర్తు చేశారు. జిల్లా సాధారణ వర్షపాతం 520 మిల్లీమీటర్లు కాగా, గత ఏడాది 250 మి.మీ మాత్రమే నమోదైందన్నారు. దీనివల్ల నల్లరేగడి భూముల్లో విత్తనం కూడా పడలేదన్నారు. కరువు విలయతాండవం చేస్తున్నా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికే రాయలసీమ నుంచి పది లక్షల మంది వలసలు వెళ్లారన్నారు. వారిని ఆదుకోకపోగా, అధిక ఆదాయం కోసమే వెళుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎక్కడైనా ఫ్యాక్టరీలకు నష్టం జరిగితే రూ.కోట్ల బీమా చెల్లిస్తారు గానీ, పంట నష్టపోయే రైతులకు మాత్రం ప్రీమియం కూడా తిరిగివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో పంట రుణాలు రెన్యూవల్ చేయించలేని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. వారు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన మిర్చి, వేరుశనగ, పసుపు, చీనీ, వరి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. హంద్రీ-నీవా మొదటిదశ కింద డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి ఉరవకొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని, ఊటనీటితో ఇబ్బందులు పడుతున్న జీడిపల్లి వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రైతు ధర్నాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బెళుగుప్ప మండల కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దుద్దేకుంట రామాంజినేయులు, మండల మహిళా అధ్యక్షురాలు అంకంపల్లి యశోదమ్మ, ఎర్రగుడి సర్పంచ్ అనిత, మండల ప్రధాన కార్యదర్శ అశోక్, ఎస్సీసెల్ కన్వీనర్ తిప్పేస్వామి, రైతు విభాగం నాయకులు భాస్కర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, మచ్చన్న, నంజుండప్ప, రవీంద్ర, కేసీ తిప్పేస్వామి, శ్రీశైలప్ప తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు బెళుగుప్ప విద్యార్థులు
బెళుగుప్ప: రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ నెల 27నుంచి జరిగే ఖేల్ ఇండియా రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు బెళుగుప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులు బి.హేమావతి, ఎన్.శ్రియ ఎంపిక అయ్యారని పీడీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోచ్ విజయ్‌భాస్కర్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన ఈ విద్యార్థులు ఈ నెల 3న అనంతపురంలో జరిగిన అండర్ –17 ఖేల్ ఇండియా జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలలో ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయులు హరినాథ్‌రెడ్డి, ఈశ్వరప్ప, శివన్న, నాగభూషణ, బసవరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
దొంగ అరెస్ట్
రూ.34,250 విలువ గల ఆభరణాలు రికవరీ బెళుగుప్ప: మండల పరిధిలోని శ్రీ రంగాపురం గ్రామంలో పట్టపగలు చోరీకి పాల్పడ్డ కేసులో దొంగను శనివారం పోలీసులు అరెస్టు చేసి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్లో చోరీకి సంబంధించిన వివరాలను శనివారం ఎస్ఐ నాగస్వామి తెలిపారు. ఈ యేడాది ఆగష్టు 12వ తేదీన శ్రీరంగాపురంలో రైతు చిన్నగంగన్న పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఇదే గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ హుసేనప్ప నిందితుడిగా పట్టుబడ్డాడన్నారు. నిందితుడి నుంచి రూ.34,250 విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీకి పాల్పడిన నాగరాజుపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచామని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ విజయ్‌నాయక్, పోలీసులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
గుండ్లపల్లి (బెళుగుప్ప): మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన లోకేశ్ (23) విషపు గుళికలను మింగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనకు సంబంధించి ఏఎస్ఐ విజయనాయక్ తెలిపిన వివరాల మేరకు లోకేశ్ గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతుండేవాడన్నారు. సోమవారం విపరీతమైన కడుపు నొప్పి రావడంతో నొప్పిని భరించ లేక ఇంట్లోనే విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. సంఘటనపై మృతుని భార్య సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. -
ముగిసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జాగరణ దీక్ష
బెళుగుప్ప : అనంతపురం జిల్లా బెళుగుప్పలో శనివారం సాయంత్రం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించిన జల జాగరణ దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. హంద్రీనీవా మొదటి దశ ఆయకట్టుకు నీరు అందించాలని, జాడిపల్లె గ్రామస్తులకు పునారావాసం కల్పించాలని, జీవో నంబర్ 22ను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఆయన ఈ జాగరణ దీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రంతా నిద్రపోకుండా విశ్వేశ్వరరెడ్డి మేల్కొని ఉన్నారు. పలువురు పార్టీ నాయకులు ఆయన చేపట్టిన జాగరణ దీక్షకు మద్దతు తెలిపారు. -
'రేపు సాయంత్రం జల జాగరణ చేపడతాం'
అనంతపురం : అనంతపురం జిల్లా బెలుగుప్పలో శనివారం సాయంత్రం జల జాగరణ చేపడతామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అనంతపురంలో స్పష్టం చేశారు. హాంద్రీనీవా ఆయుకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు. కృష్ణా జలాల అనంతపురంకు తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్దే అని విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. అనంతపురానికి నీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
'ఇది ప్రజాస్వామ్య ఖూనీ'
బెలుగుప్ప: అనంతపురం జిల్లాలోని బెలుగుప్పలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వేధింపులకు నిరసనగా నేడు బెలుగుప్పలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మహా ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ధర్నాను భగ్నం చేయాలని టీడీపీ, పోలీసులు ఎత్తుగడ వేశారు. పయ్యావుల ఆదేశాలతో టీడీపీ వర్గీయులు పోటీ ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ ధర్నాలకు అనుమతి లేదని కల్యాణ దుర్గం డీఎస్పీ అనిల్ చెప్పారు. బెలుగుప్పలో 144 సెక్షన్ విధించారు. వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.