Betting chicken
-
మిందిలో అధికారపార్టీ సాక్షిగా ..
అక్కిరెడ్డిపాలెం: సంక్రాంతి సందర్భంగా మిందిలో అధికారపార్టీ సాక్షిగా కోడి పందాలు జోరుగా సాగాయి. శనివారం, ఆదివారం సాగిన కోడి పందాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసన్నల్లోనే ఈ కోడి పందాలు స్వేచ్ఛగా సాగాయి. ఎవరికి అందాల్సిన మామూళ్లు వారికి అందాయంటూ టీడీపీ నేతలు బాహాటంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పోలీసులు బస్టాండ్ వద్దే చోద్యం చూస్తూ నిలబడడం విమర్శలకు దారితీసింది. గాజువాక పరిసర ప్రాంతాల నుంచి భారీగా బెట్టింగ్ రాయుళ్లు ఈ పందాల్లో పాల్గొన్నారు. -
కో(ళ్ల)ట్ల పందాలు!
కన్నెత్తి చూడని పోలీసులు నగర శివార్లు, జిల్లాలోనూ హోరు కొన్నిచోట్ల టీడీపీ బ్యానర్ల ఏర్పాటు విశాఖపట్నం: కోళ్ల పందాలు రూ.కోట్లు దాటాయి. సుప్రీంకోర్టు ఆంక్షలను తోసిరాజని నిరాటంకంగా సాగిపోయాయి. వాటిని నిలువరించాల్సిన పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం మానేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లాలో పలుచోట్ల కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అనేక ప్రాంతాల్లో భోగి పండగ నుంచి పందాలను ప్రారంభించేశారు. గతంలో పోలీసులు దాడులు చేస్తారన్న భయంతో ఏదో మారుమూల ప్రాంతాల్లో వీటిని నిర్వహించేవారు. అయితే ఈ సంవత్సరం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు.. నగర శివారు ముడసర్లోవ, పెందుర్తి, భీమిలి మండలాల్లోను, జిల్లాలోని నక్కపల్లి, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అనకాపల్లి, చోడవరం, గొలుగొండ, రోలుగుంట, బుచ్చయ్యపేట, రావికమతం, నాతవరం తదితర మండలాల్లోని వందలాది గ్రామాల్లో కోడి పందాలు జోరుగా సాగాయి. పలు ప్రాంతాల్లో టీడీపీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు వీటికి నాయకత్వం వహించారు. మరికొన్ని చోట్లయితే ఏకంగా ఆ పార్టీ నాయకులకు స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేసి మరీ కోడి పందాలను నిర్వహించారు. పందాల్లో అధికార పార్టీ నాయకులున్నారన్న సంగతి తెలిస్తే పోలీసులు వాటి ఛాయలకు రారన్న వ్యూహంతో ముందుకెళ్లారు. అందుకు తగ్గట్టే పోలీసులు కూడా అసలు అక్కడ పందాలు జరుగుతున్నాయన్న సంగతే తెలియనట్టు నటించారు. భారీ ఎత్తున కోడిపందాలు జరిగే ప్రాంతాల పరిధిలోని స్టేషన్ల పోలీసు అధికారులు తాము సంక్రాంతి సెలవుల్లో ఉన్నామని తప్పించుకోవడానికి వీలుగా ముందుగానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. మరోవైపు పందాల నిర్వాహకులు ఆయా పరిధిలోని పోలీసు అధికారులకు ముందస్తుగా ముడుపులు ముట్టజెప్పి వారిని కట్టడి చేశారన్న ఆరోపణలున్నాయి. ఎక్కడెక్కడ? విశాఖ నగర శివారులోని ముడసర్లోవ వెనక ప్రాంతంలో భోగి రోజు ప్రారంభమై సంక్రాంతి, కనుమ రోజు వరకు కోడి పందాలు అట్టహాసంగా జరిగాయి. అక్కడ నాలుగు పందెం బరులను సిద్ధం చేసి భారీగా టెంట్లు వేశారు. మందుబాబులు మజా చేయడానికి కావలసినంత మద్యాన్ని అందుబాటులో ఉంచారు. ఫుడ్‌కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధి నేతృత్వంలో సాగిన ఈ పందాలకు ఆయన పేరిట స్వాగత బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. రోజుకు లక్షలాది రూపాయలు పందాలు జరిగాయి. అక్కడకు పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉన్నా పోలీసులకు ఆ పందాలు అసలు కనిపించలేదు. పైగా అక్కడ ఎస్ఐ, సీఐలు సెలవుపై వెళ్లిపోయారు. ఇక భీమిలి మండలం చిప్పాడ, బక్కన్నపాలెం, ఆశపాలెం, పెందుర్తి నియోజకవర్గం మొగిలిపురం, గుల్లేపల్లి, అలకందల, అయ్యన్నపాలెం, గురమ్మపాలెం, పెదగాడి, ఆనందపురం మండలం గొట్టిపల్లి, పెద్దిపాలెం తదితర గ్రామాల్లోనూ పందాలు జోరుగా హుషారుగా సాగాయి. అలాగే నక్కపల్లి మండలం వేంపాడులో భారీ స్థాయిలో మూడు రోజుల పాటు కోడి పందాలు నిర్వహించారు. ఎస్.రాయవరం మండలం దార్లపూడి, పెదగుమ్ములూరు, బసవపాడు, పిట్లపాలెం, యలమంచిలి మండలం ఏటికొప్పాక తోటల్లోను, రాంబిల్లి మండలం రాంబిల్లి, లాలంకోడూరు, కట్టుబోలు, మురకాడ, అనకాపల్లి మండలం వెంకుపాలెం, సీతానగరం, మెట్టపాలెం, తగరంపూడి, మునగపాక మండలం రాజుపేట, చోడవరం మండలం అడ్డూరు, గొలుగొండ మండలం చిట్టింపాడు, రోలుగుంట, బుచ్చియ్యపేట, రావికమతం మండలాల్లోని పలు గ్రామాల్లోనూ కోడి పందాలు గణనీయంగా జరిగాయి. ఇలా సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లాలోనూ, నగరంలోనూ జరిగిన కోడి పందాల బెట్టింగులు రూ.కోట్లలో ఉంటాయని తెలుస్తోంది. కాగా కోడి పందాలు ఎక్కడ జరుగుతున్నాయో జనానికి బాహాటంగా తెలిసినందున పోలీసులు అక్కడక్కడ రెండు మూడు కోళ్లను పట్టుకుని తూతూమంత్రపు కేసులు నమోదు చేస్తున్నారు. -
ప్రజాప్రతినిధుల తీరు సిగ్గు.. సిగ్గు..
కోడి పందాలు వద్దంటూ సీపీఎం ఆందోళన నరసాపురం అర్బన్ : సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించాలంటూ ధర్నాకు సైతం సిద్ధపడిన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల తీరు సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ విమర్శించారు. జిల్లాలో కోడిపందాలను అరికట్టాలని కోరుతూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక టాక్సీస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. బలరామ్ మాట్లాడుతూ సంక్రాంతి సరదా, సంప్రదాయం పేరుతో ఏటా జిల్లాలోని భీమవరం చుట్టుపక్కల ప్రాం తాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీటిని ప్రజాప్రతినిధులే దగ్గరుండి జరిపిం చడం దారుణమన్నారు. హైకోర్టు తీర్పుతో ఈ ఏడాదైనా విష సంస్కృతికి ముగింపు దక్కుతుందనుకున్నా ఆశాభంగం తప్పనట్టు ఉందన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు గడుస్తున్నా జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ధ్వజ మెత్తారు. నిట్ లాంటి సంస్థలు పక్క జిల్లాకు తరలిపోతుంటే చోద్యం చూస్తున్న నాయకులు జూదాల నిర్వహణకు ఉత్సాహం చూపడం హేయన్నారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి కవురు పెద్దిరాజు మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోడిపందాల కోసం పట్టుపడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధుల తీరు సిగ్గు.. సిగ్గు.. అంటూ నాయకులు నినదించారు. పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.త్రిమూర్తులు, ఎం.రామాంజనేయులు, కేతి నీడి వెంకటేశ్వరరావు, పొగాకు నా రాయణరావు, ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ, భూడిద భువనేశ్వరి, పొన్నాడ రాము పాల్గొన్నారు. -
కోడిపందాలపై పోలీసుల రైడ్, 12మంది అరెస్ట్
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలం కుంచిపల్లిలో శనివారం కోడిపందాలపై పోలీసులు దాడులు జరిపారు. కోడిపందాల్లో పాల్గొన్న 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32వేల నగదు, 5 బైక్ లు, 2 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
కోడి పందాలాడితే పేకాట కేసు
ఫిర్యాదు చేసినా పట్టని పోలీసులు రెండోసారి ఫిర్యాదు చేశాక స్పందన పదిమందిపై పేకాట కేసు నమోదు కోడిపందాలాడినా స్పందించని వైనం పలుకుబడి ఉన్న పెద్దలంతా కార్లలో దిగారు. రూ.లక్షల్లో కోడిపందాలు, పేకాట ఆడారు. ఎవరో ఫోన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చేరుకున్నారు. మూడు కోళ్లను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. ఈసారి ఫిర్యాదు పోలీసు ఉన్నతాధికారులకు వెళ్లింది. మళ్లీ పోలీసులు వచ్చారు. పదిమందిపై పేకాట కేసు పెట్టి తీసుకెళ్లారు. పలుకుబడి గల వ్యక్తులు కావడంతో పేకాట కేసు పెట్టి అయిందనిపించారు. ఆద్యంతం నాటకీయంగా సాగిన ఈ వ్యవహారానికి వేదిక పాల్మన్‌పేట ప్రాంతంలోని రామాంజనేయ హేచరీ. పాయకరావుపేట: పాల్మన్‌పేట ప్రాంతంలోని హేచరీ వద్ద మంగళవారం ఉదయం కోడి పందాలు, పేకాట ప్రారంభమయ్యాయి. విజయవాడ, గుంటూరు, అమలాపురం, కాకినాడ, యానాం, తుని ప్రాంతాలనుంచి కోడి పందాలు, పేకాట ఆడేందుకు పందెం రాయుళ్లు కార్లతో చేరుకున్నారు. ఉదయం నుంచి 11 గంటల సమయానికి సుమారు రూ.40 నుంచి రూ.50 లక్షలు చేతులు మారినట్టు ఆ ప్రాంత మత్స్యకారులు చెబుతున్నారు. హేచరీలో పందాలు జరుగుతున్నాయని ఉదయం 8 గంటల సమయంలో ఆ ప్రాంత యువకులు కొందరు ఫోన్లో పాయకరావుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 11 గంటల ప్రాంతానికి పోలీసులు అక్కడికి చేరుకుని హేచరీ ప్రాంతంలోని మూడు పందెం కోళ్లను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చేశారు తప్ప ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ప్రముఖులు కావడం వల్లే... దీంతో ఆ ప్రాంతీయులు మరల జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నక్కపల్లి పోలీసులు దాడులు జరిపి పది మందిని పట్టుకుని నక్కపల్లి తీసుకెళ్లారు.నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో పాయకరావుపేట పోలీసులు ఆ పది మందిపై పేకాట కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడ్డ పదిమందిలో పలుకుబడిగల వ్యక్తులు ఉండటంతో కోడిపందాలు ఆడుతున్నా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. పదిమంది పేకాటరాయుళ్ల నుంచి రూ.3,61,200 స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేగేశ్వరి సత్యనారాయణరాజు, పెనుమచ్చ పెద్దిరాజు, కె.సత్యనారాయణ, పి.వెంకట్రావు, వి.పల్లంరాజు, సిహెచ్.సురేష్‌వర్మ, పి.రంగరాజు, కె.సూర్యనారాయణ, యడ్ల శంకర్, కాకి రమేష్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.