Bhagavantha Rao
-
సామూహిక నిమజ్జనం ఈసారికి లేదు
పంజగుట్ట(హైదరాబాద్): ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ప్రభా వం గణేశ్ ఉత్సవాలపైనా పడింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆడంబరాలకు వెళ్లకుండా వినాయక చవితి ఉత్సవాలను సాదాసీదాగా జరుపుకోవాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సూచించింది. సెప్టెంబర్ 1న సామూహిక నిమజ్జనం ఉండదని.. మండపాల నిర్వాహకులు సామాజిక దూరం పాటిస్తూ వారి దగ్గరలోని బావి, చెరువు, నదుల్లో నిమజ్జనం చేసుకోవాలని సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవతరావు పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలు జాగ్రత్తగా జరుపుకొందాం అంటూ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున విగ్రహాల ఎత్తులపై పోటీ పడకుండా సాధ్యమైనంతవరకు ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యసూత్రాలు, నిబంధనలు పాటిస్తూ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తక్కువ మంది భక్తులతో సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకుని పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం పూజలు చేసుకునేందుకు అనుమతులు అవసరం లేదని.. నిర్వాహకులు వారి సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వినాయకుని పూజకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహ తయారీదార్లను, ఉత్సవాలపై ఆధారపడి జీవించే వివిధ వృత్తి కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాదికి పరిస్థితులు సద్దుమణిగితే రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు జరుపుకొందామని పిలుపునిచ్చారు. సమావేశంలో సమితి ప్రతినిధులు కరోడీమాల్, రామరాజు, జోషి, మహేందర్, శశిధర్, బుచ్చిరెడ్డి, భాస్కర్, మురారి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
డిపాజిట్ రేట్ల పెంపుబాటలో ఎస్బీహెచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్‌దారులకు ద్రవ్యోల్బణాన్ని మించి వాస్తవానికి ప్రయోజనం(రియల్ ఇంట్రస్ట్ రేట్) కలిగించే వడ్డీ రేటు చెల్లించాలన్న రిజర్వు బ్యాంకు పిలుపునకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) స్పందించింది. వచ్చే రెండు వారాల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.భగవంతరావు తెలిపారు. బుధవారమిక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐ సూచన మేరకు సగటు ద్రవ్యోల్బణ రేటు కంటే వడ్డీరేట్లు ఎక్కువ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులో డబ్బు దాచుకున్న డిపాజిట్‌దారులకు ఎలాంటి అధిక ప్రయోజనం లభించకపోగా నష్టపోతున్నారని, దీంతో బంగారం, రియల్ ఎస్టేట్ వంటి ఇతర పెట్టుబడి సాధనాలకేసి చూస్తుండటంతో బ్యాంకులకు డిపాజిట్ల సేకరణ అన్నది చాలా కష్టంగా తయారయ్యింది. సగటు ద్రవ్యోల్బణ రేటు 9.5%గా ఉండగా, వడ్డీరేట్లు 9%గా ఉన్నాయన్నారు. ఇది డిపాజిట్ సేకరణకు ప్రధాన అడ్డంకిగా తయారైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎస్బీహెచ్ డిపాజిట్లలో 14% వృద్ధే నమోదయ్యింది. రుణాలపై వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం ఎంఎస్ఎంఈ రంగంపై రూ.2,000 కోట్ల విలువైన రుణాలను ఇస్తే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే రూ.1,900 కోట్ల రుణాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమైక్య ఉద్యమంతో గత 55 రోజులు సీమాంధ్ర ప్రాంతంలో బ్యాంకులు పనిచేయకపోవడంతో తమ కార్యకలాపాలపై ప్రభావం చూపిందని, ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్పీఏలు పెరిగే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.