Bhagyanagar ganesh utsav samithi
-
ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు -
18న వినాయకచవితి.. 28న నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతితో ముడిపడిన పండగల్లో ఎంతో పరమార్థం ఉంది. ప్రధానంగా వినాయకచవితి సందర్భంగా నిర్వహించుకునే కార్యక్రమాల్లో సామాజిక ప్రగతికి, సంఘటిత జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఎన్నో ముడివడి ఉన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ సాగే గణేష్ ఏకతా యాత్ర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. వినాయకుడు అందరివాడు అన్ని పండుగల్లోకెల్ల వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టం. పిల్లా, పెద్ద అందరికీ వినాయకుడు అంటే మక్కువ చూపిస్తారు. దీన్ని పండుగలా కాకుండా.. సొంతింట్లో పుట్టినరోజును జరుపుకున్నట్టుగా భావిస్తారు. వినాయకుడిని తమ వాడిగా అన్వయించుకుంటారు. ఈ పండుగ ఎప్పుడు అన్నదానిపై ఈ సారి భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి. (వినాయకుడిని పూజిద్దాం ఇలా..) 18కే భాగ్యనగర్ మొగ్గు వినాయకచవితి ఎప్పుడనే విషయంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీనే వినాయకచవితి పండుగని పేర్కొంది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని తెలిపింది. అంతకు ముందు 19న వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే.. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండడం వల్ల.. పండుగ ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. శృంగేరి-కంచి పీఠాధిపతులు గణేష్ ప్రతిష్ట 18వ తేదీనే చేసుకోవాలని సూచించారట. కాబట్టి.. గ్రేటర్ పరిధిలోని మండపాలు 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ. సంబరం తెచ్చే పండగ భాజాభజంత్రీలు, తప్పెట్లు, కోలాటాలు, కీలుగుర్రాల నృత్యాలు, పండరిభజనలు, కర్రసాము విన్యాసాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో గణేషుడి నవరాత్రులు సందడిగా ఉంటాయి. ఇక నిమజ్జనం గురించి చెప్పనక్కర్లేదు. భాగ్యనగరం అంతా ఏకతా యాత్ర కోలాహలంగా, సందడితో సాగుతుంది. ఈ పండుగ వల్ల ఎంతో మందికి ఉపాధి, మరెంతో మందికి చేతినిండా పని. మట్టి వినాయకుడికి జై వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహం కూడా తుదిమెరుగులు దిద్దుకుంటోంది. The #Khairatabad #Ganesh #Idol in making! #VinayakaChavithi #GaneshChaturthi #Hyderabad #Telangana 📸: @BelieverHemanth pic.twitter.com/HIFcGpULDr — Hi Hyderabad (@HiHyderabad) September 3, 2023 పర్యావరణానికి పెద్దపీట వినాయక ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. Ganapati Bappa Morya ♥️#GaneshChaturthi #GaneshChaturthi2023 pic.twitter.com/ByLNMYSef0 — poorna_choudary (@poornachoudary1) September 1, 2023 -
వచ్చే నెల 19నే వినాయక చవితి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం భేటీ అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, వచ్చే నెల18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత జరుపుతున్నాం. వచ్చే నెల 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. పొలిటికల్ ఫ్లెక్సీలు వద్దు.. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గణేష్ పూజా విధానం తెలిపే బుక్‌తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించాం. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించింది. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చెప్పాం. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు తెలిపారు. పండుగ ఘనంగా నిర్వహిస్తాం.. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. 30వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించాం. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుగుతోంది. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తాం. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఒకేరోజు వస్తున్నాయి. ఆరోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తాం. మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించింది. గణేష్ మండపాల పర్మిషన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే.. -
స్టేజ్ ఎక్కి.. మైక్ లాక్కొని.. అస్సాం సీఎంను నిలదీసే యత్నం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ దూసుకువెళ్లారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్ లాగా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్లిన నంద కిషోర్.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్‌ను బలవంతంగా స్టేజ్ కిందకు తీసుకుపోయారు. అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్‌పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బండి సంజయ్, డీకే అరుణ ఖండన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అస్సాం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. కుటుంబ పార్టీలు దేశం కోసం ఆలోచించవు: హిమంత తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమ ర్శించారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. కుటుంబ పార్టీలు కొడుకు, కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని, గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి కేసీఆర్‌కు మరో 50 ఏళ్లు పడుతుందేమోనని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి నిజంగా దేశ భక్తి ఉంటే 1947లో ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ భారత్ జోడో యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే జోడించాలో అక్కడ ఆ పనిచేయాలి తప్ప పటిష్టంగా ఉన్న దేశంలో ‘భారత్ జోడోలు’ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు అబిడ్స్: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ వ్యాస్ (నందుబిలాల్) పేర్కొన్నారు. కేసీఆర్‌ను విమర్శించినందుకే తాను మైకు లాక్కున్నానని చెప్పారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ దగ్గర నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్యాత్మిక భావంతో, దేవుడిపైనే ప్రసంగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తాం
-
విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్ రావు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతీస్తున్నామని తెలిపారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కోరారు. మండప నిర్వహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే వేడుకలను సంస్కృతి సాంప్రదాయబద్దంగా నిర్వహించాలని, డీజే, సినిమా పాటలు, డాన్సులు లేకుండా ఉత్సవాలు జరపాలని పేర్కొన్నారు. -
గణేశ్ విగ్రహాలు ఎత్తు తగ్గించాల్సిందే..
-
గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దు
హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని హైకోర్టు సూచించింది. అంతకంటే ఎక్కువ ఎత్తులో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి సూచనలు చేసింది. విగ్రహాల పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటం తగదని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. మరోవైపు విగ్రహాల ఎత్తును తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా నగరంలో మెట్రో నిర్మాణం కారణంగా వినాయకుని విగ్రహలు ఈసారి 15 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా చూడాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.