స్టేజ్‌ ఎక్కి.. మైక్‌ లాక్కొని.. అస్సాం సీఎంను నిలదీసే యత్నం! | Assam CM Himanta Biswa Sarma Security Was Violated In Telangana | Sakshi
Sakshi News home page

అస్సాం సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం

Published Sat, Sep 10 2022 1:22 AM | Last Updated on Sat, Sep 10 2022 1:22 AM

Assam CM Himanta Biswa Sarma Security Was Violated In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్‌ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్‌ఎస్‌ నేత నంద కిషోర్‌ వ్యాస్‌ దూసుకువెళ్లారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్‌ లాగా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్‌ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్‌ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్లిన నంద కిషోర్‌.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్‌ను బలవంతంగా స్టేజ్‌ కిందకు తీసుకుపోయారు. అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్‌పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్‌ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్‌ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్‌ఎస్‌ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.  

బండి సంజయ్, డీకే అరుణ ఖండన 
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్‌ఎస్‌ నేత మైక్‌ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ నేతను అరెస్ట్‌ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్‌ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అస్సాం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు.

కుటుంబ పార్టీలు దేశం కోసం ఆలోచించవు: హిమంత 
తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమ ర్శించారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. కుటుంబ పార్టీలు కొడుకు, కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని, గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి కేసీఆర్‌కు మరో 50 ఏళ్లు పడుతుందేమోనని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి నిజంగా దేశ భక్తి ఉంటే 1947లో ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ భారత్‌ జోడో యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే జోడించాలో అక్కడ ఆ పనిచేయాలి తప్ప పటిష్టంగా ఉన్న దేశంలో ‘భారత్‌ జోడోలు’ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 

కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు
అబిడ్స్‌: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్‌ఎస్‌ నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌ (నందుబిలాల్‌) పేర్కొన్నారు. కేసీఆర్‌ను విమర్శించినందుకే తాను మైకు లాక్కున్నానని చెప్పారు. అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర నందకిశోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్‌ ఉత్సవాలకు వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్యాత్మిక భావంతో, దేవుడిపైనే ప్రసంగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

ఇదీ చదవండి: పాన్‌ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల!

  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement