నిజాం ఆస్తి ప్రైవేటు సంస్థకా!
సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మునిమనుమరాలు షఫియా సకినా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. రంగారెడ్డి జిల్లా అల్వాల్‌లోని 28.48 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్‌ను ఏడాదికి రూ.1 చొప్పున 99 ఏళ్లపాటు భారతీయ విద్యాభవన్‌కు లీజుకివ్వడాన్ని సవాలుచేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నిజాం ఆస్తిని భారతీయ విద్యాభవన్‌కు లీజుకెలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భారతీయ విద్యాభవన్ ప్రెసిడెంట్, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
భారతీయ విద్యాభవన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేసి ఆ ప్యాలెస్‌ను తనకు స్వాధీనం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ షఫియా సకినా హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జస్టిస్ శేషసాయి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ శ్రీపాద వాదనలు వినిపిస్తూ నిజాం ఆస్తులపై ప్రభుత్వానికి హక్కు లేదన్నారు. అల్వాల్ సర్వే నం.157లో 28.48 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోఠీ ఆసీఫియా ప్యాలెస్‌ను ప్రభుత్వం 1985లో భారతీయ విద్యాభవన్‌కు లీజుకిచ్చిందన్నారు.
నిజాంకు చెందిన ప్రైవేటు ఆస్తిని ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు లీజుకివ్వడం విస్మయం కలిగిస్తోందన్నారు. 11 నెలల గడువులోగా ఈ లీజుడీడ్ రిజిస్టర్ కానందున, దీనికి చట్ట ప్రకారం ఎటువంటి విలువ లేదన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.