మమత తల నరికితే 11 లక్షలు
బీజేవైఎం నేత యోగేశ్ వార్ష్నీ వివాదాస్పద ప్రకటన
► ఖండించిన రాజకీయ పార్టీలు.. పార్లమెంట్లో రభస
► యోగేశ్‌ను అరెస్ట్ చేయాలని పార్టీల డిమాండ్
► అతనిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ బెంగాల్ ప్రభుత్వానికి ఉంది: కేంద్రం
అలీగఢ్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తల నరికి తీసుకొస్తే రూ.11 లక్షలు నజరానా ఇస్తానని బీజేపీ యువజన విభాగం... భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నాయకుడు యోగేశ్ వార్ష్నీ వివాదాస్పద ప్రకటన చేశారు. మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని సూరీలో హనుమాన్ జయంతి సందర్భంగా బీజేవైఎం కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
అయితే ర్యాలీలు, సభలపై పోలీసులు నిషేధం విధించారు. దీనిని బీజేవైఎం కార్యకర్తలు ఉల్లంఘించడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. అయితే ర్యాలీపై పోలీసుల చర్యను నిరసిస్తూ.. యోగేశ్.. మమతా బెనర్జీ తలకు రూ.11 లక్షల వెల కట్టాడు. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజ లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఎవరైనా ఎర్ర చొక్కా.. ఎర్ర ప్యాంట్ ధరిస్తే వారిని పోలీసులు గొడ్డును బాదినట్టు బాదుతు న్నారు. నాకు అర్థం కావడం లేదు.. మమత ఇఫ్తార్ విందులు ఇస్తారు. ముస్లింల కోసం మాట్లాడతారు. నేను ఆమెను అడిగేది ఒక్కటే హిందువులు మనుషులు కాదా? వారిలో ఏమాత్రం మానవత్వం అనేది ఉన్నా ప్రజలను ఇలా చిత్రహింసలకు గురి చేయరు. ఎవరైనా మమత తల నరికి తెస్తే.. అతనికి రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తా’’అని ప్రకటించారు.
ఖండించిన రాజకీయ పార్టీలు..
యోగేశ్ ప్రకటనను పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఖండించారు. ఒక ముఖ్యమంత్రిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనాగరికమని మండిపడ్డారు. పార్లమెంట్‌లోనూ దీనిపై దుమారం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నిరసనకు దిగారు. తక్షణం యోగేశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి బీజేపీ దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. యోగేశ్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. యోగేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రకటించింది.
పార్లమెంట్లో రభస..
రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్.. మతం ప్రాతిపదికగా బెంగాల్లో విధ్వంసం సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రిని భూతంలా చూపే ప్రయత్నాన్ని ప్రభుత్వం, పార్లమెంట్ ఖండించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈ అంశంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్... బెంగాల్ ప్రభుత్వం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
ఇలాగేనా మహిళలకు రక్షణ కల్పించేది..
ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయాబచ్చన్ స్పందిస్తూ.. మహిళలు దాడులను, వేధింపులను ఎదుర్కొంటుంటే.. ప్రభుత్వం ఆవులను రక్షించడంలో బిజీగా ఉందని ఎద్దేవా చేశారు. మహిళలు తమకు రక్షణ లేదని భావిస్తున్న తరుణంలో ఒక మహిళా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని, మహిళలకు రక్షణ కల్పించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని, బీజేపీ ఈ ఘటనను ఖండించడం మాత్రమే కాక.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, లెఫ్ట్, ఎస్పీ తదితర పార్టీలు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాయి.