Bhaskar katamaneni
-
108 సిబ్బందికి కమిషనర్ అభినందన
సాక్షి, అమరావతి: అంబులెన్స్ (108)లో గర్భిణికి ప్రసవం చేసిన ఏఎన్ఎం, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)లను వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం రెంటికోట పీహెచ్సీ పరిధిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న సవర మహేశ్వరిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో ఏఎన్ఎం రాజేశ్వరి, ఈఎంటీ సత్యం 108లోనే కాన్పు చేశారు. కమిషనర్ మంగళవారం వీరిని అభినందించడంతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోండి
దేవరపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ సూచించారు. దేవరపల్లి స్టేట్ బ్యాంకు ద్వారా డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాల మంజూరు పత్రాలను బుధవారం ఆయన మహిళలకు అందజేశారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బ్రాంచి చీఫ్ మేనేజర్ బి.శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 2019 నాటికి జిల్లాలోని ప్రతి డ్వాక్రా సంఘం కనీసం రూ.10 లక్షలు రుణం తీసుకోవాలని, దీనిద్వారా ప్రతి సంఘం రూ.లక్ష ఆదాయం పొందాలన్నారు. జిల్లాలోని ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇవ్వనున్నట్టు కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక ఎస్బీఐ బ్రాంచిని జిల్లాలోని ఇతర బ్యాంకులు నాందిగా తీసుకుని రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.1,100 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రతి సంఘానికి రూ.లక్ష పొదుపు ఖాతాలో జమచేస్తుందన్నారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కె.సుధారాణి. సర్పంచ్ సుంకర యామినినిసన్మానించారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ హేనా నళిని, చీఫ్ మేనేజర్ బి.వంకరరావు, ఎంపీపీ ఎస్వీ నరసింహరావు, తహసిల్దార్ ఎండీ అక్బర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
త్వరలో మొబైల్ ఆధార్ కేంద్రాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో ఆధార్ కార్డులు పొందలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగుల కోసం మొబైల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి ఆధార్ కార్డుల జారీ తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2నుంచి పింఛన్ల మొత్తాన్ని పెంచిన దృష్ట్యా ఆధార్ కార్డులు తప్పనిసరి అని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బోగస్ పింఛన్లను నిరోధించేందుకు, అర్హత కలిగిన పింఛన్‌దారులందరికీ సకాలంలో పింఛన్లు అందించడానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశామన్నారు. జిల్లాలో సామాజిక పింఛన్లు ప్రతి నెలా 3 లక్షల 30 వేల 661 మందికి అందిస్తుండగా, అందులో 3 లక్షల 8 వేల 194 మందికి మాత్రమే ఆధార్‌కార్డులున్నాయని మరో 8 వేల 324 మందికి ఇప్పటివరకు ఆధార్ నమోదు జరగలేదన్నారు. వారి కోసం మొబైల్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన కింద 46 వేల 650 మంది లబ్ధిదారులుండగా వారిలో 35 వేల 872 మందికి ఆధార్ అనుసంధానం జరగలేదన్నారు. ఈ విషయంలో భాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సీడీపీవోలకు జీతాలు చేస్తేగాని వారిలో బాధ్యత గుర్తురాదని ఆగస్టు 15వ తేదీలోగా ఆధార్ అనుసంధానం చేయకపోతే జీతాలు నిలుపుదల తప్పదని హెచ్చరించారు. మూడు నెలల్లో కాళీపట్నం భూ సమస్య పరిష్కారం ఏలూరు : జిల్లాలో ఆరు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మొగల్తూరు మండలం కాళీపట్నం భూముల సమస్యను మూడు నెలల్లో పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ హామీ ఇచ్చారు. ఈ భూముల సమస్యను పరిష్కరించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎమ్మెల్యే బి.మాధవనాయుడు, పలువురు రైతులు కలెక్టర్‌ను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఈ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ భాస్కర్ బదులిస్తూ 20మంది తహసిల్దార్లను, ఎక్కువ మంది సర్వేయర్లు నియమించి భూములను సర్వే చేసి నిజమైన రైతులకు న్యాయం చేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మొగల్తూరు మాజీ జెడ్పీటీసీ జక్కం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బాలికల అక్రమ రవాణాను నిరోధించాలి
ఏలూరు(ఆర్ఆర్ పేట) : బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక సెయింట్ థెరిస్సా పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. బాలికల, మహిళల రక్షణకు సమర్థవంతమైన చట్టాలు ఎన్ని అమల్లో ఉన్నా సమాజంలో సరైన చైతన్యం లేని కారణంగా ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని దేశాల్లోను డ్రగ్స్ వినియోగించి బాలికలను, మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని, దీనిపట్ల ప్రతి ఒక్కరూ అపమ్రత్తంగా ఉండాలని సూచించారు. చిన్ననాటి నుంచే ఏది మంచి, ఏది చెడు అనే విషయంపై సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. పరిచయం లేనివారితో ఏవిధంగా మెలగాలనే విషయంపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలు ఎక్కువగా తెలిసినవారి ద్వారానే జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి పోలీస్, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. బాలికల అక్రమ రవాణా ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత శాఖలు స్పందిస్తే 48 గంటల్లోనే ఆ బాలికలు ఎక్కడ ఉన్నా రక్షించవచ్చన్నారు. 8 మండలాల నుంచి బాలికల అక్రమ రవాణా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ ఆర్.సూయిజ్ మాట్లాడుతూ బాలికల అక్రమ రవాణాకు సంబంధించిన కార్యకలాపాలు జిల్లాలోని 8 మండలాల్లో నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. ఈ మండలాల్లో పోలీస్ శాఖ సమన్వయంతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రతి గ్రామంలోను స్థానికులతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా బాలల సంరక్షణ సమితి అధ్యక్షుడు స్నేహన్, ఐసీడిఎస్ పీడీ వి.వసంతబాల, శాంతిదాత, ప్రతినిధి హెరాల్డ్‌బాబు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, సెయింట్ థెరిస్సా హైస్కూల్ ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా బాలికలతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. -
గిరిజన జిల్లాకు ఓకే
జంగారెడ్డిగూడెం :పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్‌కు ఆమో దం లభించడంతో ఖమ్మం జిల్లానుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా కలిసిన ముంపు మండలాలతో కలిపి గిరిజన ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడానికి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపారు. అయితే, పోలవరం కేంద్రంగా గిరి జన జిల్లాను ఏర్పాటు చేయూలని కోరారు. ప్రత్యేక గిరిజన జిల్లా అంశంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం అభిప్రాయ సేకరణ జరి పారు. జంగారెడ్డిగూడెంలోని గంగాభవాని కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు హాజరయ్యూరు. కలెక్టర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలతోపాటు, ఉభయగోదావరి జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలను కలిపి 20 మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేం దుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించిందన్నారు. తొలిదశలో అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, తదుపరి పీసా చట్టం ప్రకారం గ్రామ గ్రామాన సభలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లా కేంద్రం ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా జంగారెడ్డిగూడెం డివిజన్లో కలిసిన బూర్గం పాడు పరిధిలోని ఆరు గ్రామాలను కుకునూరు మండలంలో కలిపారని వెల్లడించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్ని కేఆర్‌పురం ఐటీడీఏలో కలిపే ఆలోచన ఉందని తెలి పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయూలన్నది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు మేరకు గిరిజన జిల్లా ఏర్పాటుకు సంబంధించి తొలిదశలో అభిప్రాయ సేకరణ చేపట్టామన్నా రు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి రెండు నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. పోలవరం కేంద్రంగానే కావాలి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న గిరిజన ప్రజాప్రతినిధులలో ఎక్కువ మంది రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు దూరం ఎక్కువగా ఉంటుందన్నారు. పోలవరాన్ని మధ్యస్థంగా తీసుకుని జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే అటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మండలాలకు అనువుగా ఉంటుం దని వివరించారు. పోలవరం ఎమ్మెల్యే మొడి యం శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున పోలవరాన్నే జిల్లా కేంద్రంగా చేస్తే బాగుం టుందన్నారు. దీనివల్ల నిర్వాసితులకు మేలు జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పా టు చేయాలంటే నిధులు అవసరమవుతాయన్నారు. రంపచోడవరంలో ఇప్పటికే ఉన్నతాధికారుల కార్యాలయాలు అనేకం ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు అంశంపై కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు. సమావేశంలో డీపీవో ఎ.నాగరాజు వర్మ, జంగారెడ్డిగూడెం ఇన్చార్జి ఆర్డీవో ఆర్వీ సూర్యనారాయణ, ఐటీడీఏ ఇన్చార్జి పీవో పులి శ్రీనివాసులు , తహసిల్దార్ జేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ముంపు గ్రామాల అధికారుల డుమ్మా సమావేశానికి వేలేరుపాడు, కుకునూరు మండలాలకు చెందిన అధికారులు డుమ్మా కొట్టారు. జీలుగుమిల్లిలో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలోనూ ఆ మండలాల అధికారులెవరూ రాలేదు. జంగారెడ్డిగూడెం నుంచే పాలన ఆగస్టు 1నుంచి కుకునూరు, వేలేరుపాడు మండలాలకు రేషన్ సరుకులతోపాటు ఆ ప్రాంతాల్లోని వారికి పింఛన్ల పంపిణీ వంటి పాలనాపరమైన కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ నుంచే జరుగుతాయని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. రెండు రోజుల్లో అక్కడి ప్రజలను కలసి వారి అవసరాలను తెలుసుకుంటామన్నారు. సాక్షి, ఏలూరు: ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు గిరిజనులు సుముఖత వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతో పాటు, ఖమ్మం జిల్లానుంచి రెండు జిల్లాల్లోనూ కలిసిన మండలాలను కలిపి గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు 15 రోజుల క్రితం హైలెవెల్ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారని చెప్పారు. దీనిపై అభిప్రాయ సేకరణ చేశామన్నారు. జిల్లా కేంద్రం పోలవరంలో ఉండాలని కొందరు, రంపచోడవరంలో ఏర్పాటు చేయూలని మరికొందరు కోరుతున్నారన్నారు. ఈ వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హెడ్‌వర్క్స్, స్పిల్‌వే, పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయ్యిందని తెలి పారు. పునరావాస కాలనీకి అవసరమైన భూసేకరణ త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ముంపు మండలాల అధికారులు సాంకేతి కంగా మన జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ వారు ఖమ్మం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాలేదంటున్నారని, నిజానికి వాళ్లకూ తానే కలెక్టర్‌నని భాస్కర్ అన్నారు. ఆ విషయం నెలాఖరున జీతాలు ఇచ్చేప్పుడు ఆ అధికారులకు స్పష్టమవుతుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి స్థల సేకరణ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలం చూడాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో 280 ఎకరాల విమానాశ్రయ భూము లు అందుబాటులో ఉన్నాయని, వెంకట్రామన్నగూడెం, చింతలపూడిలో అటవీ భూమిని కూడా గుర్తించామన్నారు. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. -
పర్యాటక అభివృద్ధికి రూ.10 కోట్లు
ఏలూరు రూరల్ :జిల్లాలో రూ.10 కోట్లతో చేపట్టే పర్యాటక అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గోదావరి పర్యాటక సర్య్కూట్, కొల్లేరు పర్యాటక సర్య్కూట్, దేవాలయాల పర్యాటక సర్య్కూట్లుగా వేర్వేరు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొల్లేరు అందాలను పర్యాటకులు తిలకించేందుకు వీలుగా ఏలూరు నుంచి కృష్ణా జిల్లాలోని ఆటపాక వరకూ టూరిస్ట్ బస్సు నడపాలన్నారు. కొల్లేరులో బోట్లు, కొత్తదనంతో కూడిన రిసార్ట్లు నిర్మించాలన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, రిసార్టులు, బోటు షికారు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలను భక్తులే కాకుండా పర్యాటకులు కూడా దర్శించేలా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. వీటితోపాటు ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రవిసుభాష్, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, సెట్వెల్ సీఈవో సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైందని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో ఆయన ఆదివారం కలెక్టరేట్లో సమీక్షించారు. షెడ్యూల్ ఇది.. ఈ నెల 16 బుధవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి ద్వారకాతిరుమల చేరుకుంటారు. అనంతరం తాడిచర్ల గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తరువాత కామవరపుకోటలో నిర్వహించే రైతు సదస్సులో పాల్గొంటా రు. ఉప్పలపాడు, దేవులపల్లి మీదుగా గురవాయగూడెం చేరుకుని మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని సాయంత్రం 6 గంటలకు జంగారెడ్డిగూడెం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ జంగారెడ్డిగూడెంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావే శంలో పాల్గొని కొయ్యలగూడెం చేరుకుని రాత్రి బస చేస్తారు. 17 గురువారం ఉదయం కొ య్యలగూడెంలోని పొగాకు వేలం కేం ద్రాన్ని సందర్శించి గంగవరం, పొంగుటూరు, పోతవరం, కవులూరు, చీపురుగూడెం మీదుగా నల్లజర్ల చేరుకుంటారు. అనంతపల్లి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించే స్వయం సహాయక సంఘాల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం నల్లజర్ల నుంచి బయల్దేరి హైదరాబాద్ వెళతారు. లోటుపాట్లకు తావివ్వొద్దు ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా లోటు పాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రోటోకాల్ విషయంలో ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆయా అధికారులకు నిర్దేశించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలన్నా రు. హెలిప్యాడ్ నిర్మాణం, బారికేడ్ల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీమన్నారాయణను ఆదేశించారు. కామవరపుకోటలో నిర్వహించే రైతు సదస్సులో వ్యవసాయ అనుబంధ స్టాల్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఉపకరణాల పంపిణీకి జాబితాను ముందుగానే సమర్పించాలన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయండి వివిధ శాఖల అధికారులు పరస్పర సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. పెద్ద,చిన్న అనే తారతమ్యం లేకుండా అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో అధిగమించి ప్రజలకు సుపారిపాలన అందించాలన్నారు. పలు శాఖల పని తీరును కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశీలించారు. జేసీ బాబూరావునాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ పి.రవిసుభాష్, ఏజేసీ సీహెచ్ నరసింగరావు పాల్గొన్నారు. ఎందుకీ పర్యటన ! ఏలూరు : సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేవు. ఎన్నికల హామీలైన డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీలపై ఇప్పటి వరకు కచ్చితమైన ప్రకటన చేయకపోవటంతో వారిని శాంతపర్చేందుకే ఈ పర్యటన అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటనలో మీ కోసం యాత్రలా బస్సులో రోడ్‌షో నిర్వహించటం, 16న రైతులతో కామవరపుకోటలోను, 17న డ్వాక్రా మహిళలతో నల్లజర్లలోను సదస్సుల్లో చంద్రబాబు పాల్గొంటారు.