రుణాలను సద్వినియోగం చేసుకోండి
దేవరపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ సూచించారు. దేవరపల్లి స్టేట్ బ్యాంకు ద్వారా డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాల మంజూరు పత్రాలను బుధవారం ఆయన మహిళలకు అందజేశారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బ్రాంచి చీఫ్ మేనేజర్ బి.శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 2019 నాటికి జిల్లాలోని ప్రతి డ్వాక్రా సంఘం కనీసం రూ.10 లక్షలు రుణం తీసుకోవాలని, దీనిద్వారా ప్రతి సంఘం రూ.లక్ష ఆదాయం పొందాలన్నారు.
జిల్లాలోని ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇవ్వనున్నట్టు కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక ఎస్‌బీఐ బ్రాంచిని జిల్లాలోని ఇతర బ్యాంకులు నాందిగా తీసుకుని రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. డీఆర్‌డీఏ పీడీ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.1,100 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
డ్వాక్రా సంఘాలకు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రతి సంఘానికి రూ.లక్ష పొదుపు ఖాతాలో జమచేస్తుందన్నారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కె.సుధారాణి. సర్పంచ్ సుంకర యామినినిసన్మానించారు. ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ హేనా నళిని, చీఫ్ మేనేజర్ బి.వంకరరావు, ఎంపీపీ ఎస్‌వీ నరసింహరావు, తహసిల్దార్ ఎండీ అక్బర్ హుస్సేన్ పాల్గొన్నారు.