bhooma akhila priya
-
నా తండ్రిని పదేపదే వేధిస్తున్నారు
* ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత * ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరిక * ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గరని స్పష్టీకరణ * సర్కారుపై తమకు నమ్మకం లేదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తన తండ్రి, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని పదేపదే వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. ప్రభుత్వం తన తండ్రిని అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఆయనను ఎంతగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే అంతగా ఎదుగుతారని, ఏ మాత్రం వెనక్కి తగ్గరని స్పష్టంచేశారు. ఆమె శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న తన తండ్రికి మధుమేహం, రక్తపోటు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌లోని ‘నిమ్స్’కు తరలించడాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్‌జైలుకు పంపి, వారి నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామనడం సరికాదన్నారు. ఆ బృందంలో హృద్రోగ నిపుణులు లేరని చెప్పారు. తమను వేధిస్తున్న ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ప్రమేయం ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వెన్నునొప్పి ఉందనే కారణంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఆసుపత్రికి తరలించారని గుర్తుచేశారు. తన తండ్రికి హృద్రోగం, మధుమేహం, రక్తపోటు ఉన్నా ‘నిమ్స్’కు తరలించడానికి అభ్యంతరం ఏమిటని ఆమె సూటిగా ప్రశ్నించారు. పథకం ప్రకారమే...: ఒక పథకం ప్రకారం తన తండ్రిని ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో ఇరికించారని అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో శుక్రవారం జరిగిన సంఘటన ను ఆమె సవివరంగా తెలిపారు.తన హక్కులకు భంగం కలిగించినందునే పోలీసులను తన తరఫున తండ్రి నిలదీశారన్నారు. భూమాకు ఏదైనా జరిగితే బాబుదే బాధ్యత: బొత్స తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఆరోగ్యపరంగా ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న భూమాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సలహాఇస్తే పొరుగు రాష్ట్రానికి పంపడానికి ఎస్కార్టు లేదని నిరాకరించడమేమిటని ఆగ్రహం వెలిబుచ్చారు. ఉమ్మడి రాజధానైన హైదరాబాద్ మరో రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు. -
రూల్ బుక్ చూపించమంటే కేసు పెడతారా?
ఒక మహిళా ఎమ్మెల్యేను పోలింగ్ కేంద్రం నుంచి ఎలా వెళ్లగొడతారు, తాను ఆమె వెంట లేనప్పుడు ఎలా మాట్లాడతారని తన తండ్రి భూమా నాగిరెడ్డి అడిగినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమా నాగిరెడ్డి అరెస్టు, దాని పూర్వాపరాలపై ఆమె హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. ఒక మహిళా ఎమ్మెల్యేని ఎలా అవమానిస్తారని నాగిరెడ్డి అడిగారు తప్ప.. అసలు ఆయనపై ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను లేనప్పుడు ఎందుకు అడిగారు, ఎందుకు కూతురితో మాట్లాడారు, ఒక ఎమ్మెల్యేని ఎలా వెళ్లగొడతారని అడిగారు రూల్ బుక్ చూపించాలని గట్టిగా అడిగారు అంతే తప్ప అన్ పార్లమెంటరీ భాష ఎక్కడా వాడలేదు కానీ సంబంధం లేకపోయినా ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సండ్ర వెంకట వీరయ్య మీద కేసు ఉన్నప్పుడు చిన్న నొప్పి ఉందని రాజమండ్రి ఆస్పత్రికి పంపారు. ఇప్పుడు నాన్న గుండె రోగి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. షుగర్ ఉంది, ఈ ఘటనతో ఆయనకు బీపీ వచ్చింది. అయినా నిమ్స్ కు పంపడానికి బోలెడంత సీన్ క్రియేట్ చేశారు గతంలో కూడా ముందు నంద్యాలకు, అక్కడి నుంచి కర్నూలుకు, తర్వాత నిమ్స్‌కు పంపారు ఇప్పుడు కలెక్టర్ ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్ జైలుకు పంపారు. వాళ్లు ఇచ్చే నివేదికను బట్టే నిమ్స్‌కు పంపుతారట ఆ ముగ్గురిలో కార్డియాలజిస్టులు ఎవరూ లేరు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది, సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు భూమా నాగిరెడ్డినే ఇబ్బందిపెడుతున్నాం, మిగిలిన వాళ్లు మాకొక లెక్కా అన్న సందేశాన్ని పంపుదామనుకుంటున్నారు కానీ ఇలా చేస్తే ఆయన ఇంకా రైజ్ అవుతారు తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అది ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది నాన్న జైల్లో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి రేపు ఆయనకేమైనా జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అవుతుంది ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు నన్ను అడ్డుకున్నది కూడా పోలీసులే డీఎస్పీ నాతో ఎలా మాట్లాడారో, మేం ఎలా చెప్పామో అన్నీ తెలుస్తాయి మేం అసెంబ్లీలో హక్కుల తీర్మానం పెడతాం. -
'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'
పోలీసులు తనను అకారణంగా దూషించి, తమను రెచ్చగొట్టి మరీ తన తండ్రిపై కేసు పెట్టారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు బనాయించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. అఖిలప్రియ ఏమన్నారో ఆమె మాటల్లోనే... ఓటు వేయడానికి నేను, నాన్నగారు కలిసి వెళ్లాం. నాన్నగారు చిన్న పనిమీద బయటకు వచ్చారు. క్యూ ఎక్కువగా ఉందని పది నిమిషాలు కూర్చోమని పోలీసులే చెప్పడంతో కూర్చున్నాం. నాన్న బయటకు వెళ్లగానే పోలీసులు ఒకేసారి డీఎస్పీ, ఏఎస్పీ వచ్చి.. వెంటనే నన్ను ఓటు వేసి వెళ్లిపొమ్మన్నారు నాన్న వస్తే ఇద్దరం కలిసి ఓటేసి వెళ్లిపోతాం అని చెప్పాను నేను ఓటర్లతో మాట్లాడిందీ లేదు, కదిలింది కూడా లేదు అయినా ఓటు వేయాల్సిందేనని బలవంతం చేశారు పది నిమిషాల్లో ఓటేసి వెళ్లిపోతానని చెప్పినా, వాళ్లు రూడ్‌గా మాట్లాడారు. టీడీపీ ఏజెంట్లు పోలీసుల దగ్గరకు వెళ్లి, మమ్మల్ని పంపేయాలని చెప్పడంతోనే పోలీసులు వచ్చారు పోలింగ్ కేంద్రం వద్ద నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు డీఎస్పీ నా దగ్గరకు వచ్చి రూడ్‌గా మాట్లాడారు. గౌరు చరిత ఎవరు, ఆమెకేం సంబంధమని కూడా ఆయన అన్నారు దాంతో నాన్న ఒక తండ్రిగానే రియాక్ట్ అయ్యారు, కూతురు ఒక్కరే ఉన్నప్పుడు అలా మాట్లాడతారా .. రూల్స్ చూపించండి అన్నారే తప్ప వాళ్లను తిట్టలేదు వీళ్లు ఏ కేసు పెట్టినా సిల్లీ రీజన్లకే పెడుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా వాళ్లు అత్యుత్సాహం చూపించారు. గతంలో ఎలా చేశారో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు అక్కడ పోలీసులు మాట్లాడినదానిపై మేం ఏమైనా చర్యలు తీసుకోగలమా అని చూస్తున్నాం. -
శోభానాగిరెడ్డికి భూమా అఖిలప్రియ నివాళులు
కర్నూలు: దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి ఘాట్ వద్ద ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదివారం ఉదయం నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి అఖిలప్రియ ఆళ్లగడ్డకు వచ్చారు. ఆళ్లగడ్డలో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అఖిలప్రియకు ఘనస్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
మాకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత
-
మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హెచ్చరిక నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని కర్నూలు టీడీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తున్నారు భూమాను కేసులో ఇరికించేందుకు డీజీపీ, సీఎంలతో చర్చించామని చెబుతున్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి నాతండ్రిపై తప్పుడు కేసులు నమోదు చేశారు మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, ఎంతదూరమైనా పోరాడుతాం సాక్షి, హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డికి, తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక వస్తుందంటూ టీడీపీ నేతలు బాహాటంగా చేస్తున్న ప్రకటనల తర్వాత, ఈ విషయంలో తన భయం తనకున్నందునే తానీమాట చెప్తున్నానన్నారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తన తండ్రి భూమా నాగిరెడ్డిపై కేసులు నమోదు చేశారని తప్పుబట్టారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఎంతదూరమైనా పోరాడుతామన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలో ఉప ఎన్నిక వస్తుందంటూ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. భూమాను కేసులో ఎలా ఇరికించాలనే విషయమై డీజీపీ,సీఎంలతో చర్చించామని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో తన తండ్రికి గాని, తన కుటుంబానికి గాని ఇబ్బంది జరిగితే సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆమె ఇంకా ఏం చెప్పారంటే... నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఏం జరిగిందనే విషయమై కొన్ని టీవీ చానెళ్లు ఏకపక్షంగా చూపిస్తున్నాయి. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నాగిరెడ్డికి ఎమ్మెల్యేగా మాట్లాడే హక్కు ఉన్నా చైర్పర్సన్ సులోచన గౌరవించలేదు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నపుడు ప్రొటోకాల్‌నూ పాటించకుండా ఎజెండా ముగిసిందంటూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘తలుపులు వేయండ్రా...’ అని నా తండ్రి చెప్పిన ఒక్క మాటను పట్టుకుని ఆయనపై మూడు తప్పుడు కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారు. పథకం ప్రకారం హత్యాయత్నం చేయాలనుకుంటే పోలీసులు, మీడియా వాళ్లు అందరూ ఉండగా చేస్తారా? పోలీసులకు కేసు పెట్టేటపుడు ఆ ఆలోచన కూడా రాలేదా? రెండు పార్టీలు కొట్టుకున్నపుడు ఇద్దరిపైనా కేసులు పెట్టాలి కదా? నాగిరెడ్డిపైనే కేసు ఎలా పెట్టారు? అసెంబ్లీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాలు వాగ్వాదాలకు, గొడవ పడుతున్నపుడు కూడా స్పీకర్, సీఎం, ప్రతిపక్ష నేతలపై ఇలాగే కేసులు పెట్టి, రౌడీషీట్లు తెరుస్తారా? టీడీపీ వారిపై మేము ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకోవడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే చేతులు పెకైత్తి ‘పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’ అని సమాధానమిస్తున్నారు. నా తల్లిదండ్రులు ఏనాడూ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదు. రౌడీయిజం, గూండాయిజం చేసి ఉంటే నా తండ్రి నాలుగుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా, నా తల్లి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారే కాదు. నా తల్లి చనిపోయిన షాక్‌నుంచి మేము తేరుకోకముందే నాన్నను మానసికంగా బలహీనుడిని చేయాలనే కేసు మోపారు. జిల్లా ఎస్పీకి బుద్ధి లేదా?: మైసూరారెడ్డి నాగిరెడ్డిపై రౌడీషీటు తెరవడం అనేది దుర్మార్గమైన చర్య. ఐపీఎస్ చదువుకున్న జిల్లా ఎస్పీ అధికారపక్షం ఒత్తిడులకు తలొగ్గి బుద్ధి లేకుండా వ్యవహరించారు. ఒక వ్యక్తిపై రౌడీ షీటుకు అవకాశం కల్పిస్తూ జారీ అయిన 743 స్టాండింగ్ ఆర్డర్‌కు ఎలాంటి రాజ్యాంగ బద్ధత లేదని, వాటికి ఎలాంటి నియమ నిబంధనల స్వభావం లేదని 1999, మార్చి 30వ తేదీన ‘మహ్మద్ ఖదీర్ వర్సెస్ హైదరాబాద్ పోలీసు కమిషనర్’ కేసులో హైకోర్టు తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారికి ఇది తెలియదా? స్థానిక ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీటీసీలు సమావేశానికి వెళ్తుంటే ముస్లిం ఎమ్మెల్యేపైనా, అంబటి రాంబాబుపైనా దాడి చేసిన వారిపై ఇప్పటికీ కేసులు పెట్టలేదు?వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రోజా, సునీల్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారు. ‘సరస్వతీ’ భూముల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌పై అకారణంగా రౌడీషీటు పెట్టారు. -
మాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అఖిలప్రియ
తమ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మండిపడ్డారు. అనుక్షణం ప్రజాసంక్షేమం కోసమే పనిచేసే తమ తండ్రి భూమా నాగిరెడ్డి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, అనవసరంగా రౌడీషీట్ ఓపెన్ చేశారని అన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాల్లో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.. * నంద్యాల అభివృద్ధికి నాన్నగారు సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు. ప్రతి ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు పెట్టించి, దాని పర్యవేక్షణను పోలీసులకు అప్పగించారు. * మున్సిపల్ ఛైర్మన్ సులోచన అసలు ఛైర్మన్లా కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకూడదన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ప్రోటోకాల్‌ను పట్టించుకోలేదు. * వేరే ఫ్లోర్‌లీడర్ ముందు కూర్చున్నారన్న చిన్న విషయానికి ఆమె బెల్లుకొట్టి వెళ్లపోతుంటే, నాన్న లేచి.. తాను మాట్లాడాలని చెప్పారు. అయినా ఆమె పట్టించుకోలేదు. * డోర్లు వేయండిరా అన్న ఒక్క మాటకు ఇన్ని కేసులు పెట్టారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కుంది. సులోచన ఎవరి మద్దతుతో ఇవన్నీ చేస్తున్నారో అందరూ గమనిస్తారు. ప్రజలు తప్పకుండా వాళ్లకు బుద్ధి చెబుతారు * నిజంగా హత్యాయత్నం చేయాలంటే మీడియా ముందు, పోలీసుల ముందు ఎందుకు చేస్తారు? * రెండు పార్టీలు కొట్టుకున్నప్పుడు భూమా నాగిరెడ్డి మీద కేసులు పెట్టినవాళ్లు.. అటు సులోచన మీద మేం కేసులిస్తే ఎందుకు తీసుకోవట్లేదు? * రెండు రోజుల్లోనే మూడు కేసులు పెట్టి, రౌడీషీట్ కూడా తెరిచారు. ఇంతే వేగంతో ఇతర కేసులు కూడా డీల్ చేస్తే, ఈపాటికి కర్నూలు జిల్లాలో సగం కేసులు పరిష్కారం అయిపోయేవి. * కేసులు ఎందుకు పెట్టారంటే.. పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. టీడీపీ వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. పోలీసులను వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వండి. * అసెంబ్లీలో రెండు పార్టీల వాళ్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. చాలాసార్లు ఇలా జరిగాయి. ఇప్పటివరకు ఎక్కడైనా ఎవరిమీదైనా కేసులు పెట్టారా? * రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు హత్యాయత్నం కేసు పెట్టారు. అసలు నేరచరిత్ర లేని కౌన్సిలర్లమీద కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద నిజానిజాలు చూడకుండా, ఇలా వరుసపెట్టి మూడు కేసులు, రౌడీషీట్ తెరవడం తగునా? * మేం టీడీపీ వాళ్లమీద కేసులు పెడితే ఒక్కటీ తీసుకోలేదు. వాళ్ల మీద విచారణ లేదు, అరెస్టులు లేవు. కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్లమీదే కేసులు పెడుతున్నారు * ఫ్యాక్షనిజం ఒకప్పుడు ఉండేదేమోగానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలో లేదు. ఆ పేరుచెప్పి భయపెట్టడానికి ప్రయత్నించకండి. ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటివాటిని మేం ప్రోత్సహించేది లేదు. * నాన్నగారు ఎన్ని త్యాగాలు చేశారో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు తెలుసు. ఆయన నిజంగానే రౌడీయిజం చేసి ఉంటే ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆయన వెంట అంతమంది వచ్చేవారు కారు. * అమ్మను కోల్పోయిన షాక్ లోంచి మా కుటుంబం ఇంకా బయటకు రాలేదు. నాన్న ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకుండా ప్రజల కోసమే తిరుగుతున్నారు. అంత బిజీలో ఉండి.. ఇలా ఎందుకు చేస్తారు? * మీరు భయపెడితే భయపడటానికి మేమేం తప్పులు చేయడంలేదు. దాన్ని గుర్తుంచుకోండి. * ఈ కేసులు ఏవీ లేకముందే.. నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని, భూమా నాగిరెడ్డి మీద కేసులు ఎలా పెట్టాలో మాకు తెలుసని టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జి సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ఆయన ఎవరి అండతో ఇలా చెబుతున్నారో అందరికీ తెలుసు. * మా కుటుంబానికి ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా దానికి బాధ్యత చంద్రబాబుదే. ఆయన మద్దతు లేకుండా ఇలా.. అది కూడా రౌడీషీట్ పెట్టకముందే చెప్పడం సాధ్యం కాదు. * టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చాలామందిని చంపేశారు. తప్పుడు కేసుల్లో బుక్ చేస్తున్నారు. ఒక్క కేసు మీద కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పడుతున్నారు. ప్రజలంతా చూస్తున్నారు.. మీరు జాగ్రత్తగా ఉండాలి. * పోలీసులకు నేను చెప్పదలచుకున్నది ఒకటే. ఒత్తిడి ఉందని ఒకవైపు మాత్రమే పనిచేయడం తగదు. ఇలా అన్యాయం చేయొద్దు. * నాన్నగారి మీద మూడు కేసులు పెడితే.. వాటిలో ఒక కేసు మీదే రిమాండుకు పంపారు. అంటే మిగిలినవి తప్పని వాళ్లకు కూడా తెలుసు. ఈ గొడవ జరిగినప్పుడు నలుగురికి గాయాలయ్యాయి. ఆ నలుగురిలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కేవలం ఛైర్పర్సన్ సులోచన మాత్రమే ఫిర్యాదు చేశారు. * న్యాయవ్యవవస్థ మీద మాకు నమ్మకం ఉంది. క్లీన్ చిట్‌తో నాన్న బయటకు వస్తారన్న విశ్వాసం మాకుంది. ఆయన వచ్చాక ఛైర్మన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత సరైన విచారణ చేయకుండా కేసు పెట్టిన పోలీసుల మీద కూడా న్యాయపోరాటం చేస్తాం.