నా తండ్రిని పదేపదే వేధిస్తున్నారు
* ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరిక
* ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గరని స్పష్టీకరణ
* సర్కారుపై తమకు నమ్మకం లేదని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని పదేపదే వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు.
ప్రభుత్వం తన తండ్రిని అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఆయనను ఎంతగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే అంతగా ఎదుగుతారని, ఏ మాత్రం వెనక్కి తగ్గరని స్పష్టంచేశారు. ఆమె శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న తన తండ్రికి మధుమేహం, రక్తపోటు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌లోని ‘నిమ్స్’కు తరలించడాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్‌జైలుకు పంపి, వారి నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామనడం సరికాదన్నారు.
ఆ బృందంలో హృద్రోగ నిపుణులు లేరని చెప్పారు. తమను వేధిస్తున్న ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ప్రమేయం ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వెన్నునొప్పి ఉందనే కారణంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఆసుపత్రికి తరలించారని గుర్తుచేశారు. తన తండ్రికి హృద్రోగం, మధుమేహం, రక్తపోటు ఉన్నా ‘నిమ్స్’కు తరలించడానికి అభ్యంతరం ఏమిటని ఆమె సూటిగా ప్రశ్నించారు.
పథకం ప్రకారమే...: ఒక పథకం ప్రకారం తన తండ్రిని ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో ఇరికించారని అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో శుక్రవారం జరిగిన సంఘటన ను ఆమె సవివరంగా తెలిపారు.తన హక్కులకు భంగం కలిగించినందునే పోలీసులను తన తరఫున తండ్రి నిలదీశారన్నారు.
భూమాకు ఏదైనా జరిగితే బాబుదే బాధ్యత: బొత్స
తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఆరోగ్యపరంగా ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న భూమాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సలహాఇస్తే పొరుగు రాష్ట్రానికి పంపడానికి ఎస్కార్టు లేదని నిరాకరించడమేమిటని ఆగ్రహం వెలిబుచ్చారు. ఉమ్మడి రాజధానైన హైదరాబాద్ మరో రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు.