ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టు.. ఉద్రిక్తత
* ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు
* అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే కేసు బనాయింపు
నంద్యాల టౌన్: పీఏసీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, తాకవద్దని తనను అవమానించారంటూ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్సీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమాపై సెక్షన్ 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను ఇంటివద్ద అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అసలేం జరిగింది... :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రమైన ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి వెయిటింగ్ స్టాల్‌లో కూర్చున్నారు. కొద్దిసేపు తర్వాత భూమా బయటకు వెళ్లడంతో అఖిలప్రియ పరిచయస్తులను పలకరిస్తూ ఉన్నారు. ఇంతలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ హరినాథరెడ్డి, ఎన్నికల జోనల్ అధికారి వెంకటేశం అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయమని కోరగా, నాన్న వచ్చాక వెళ్తానని అఖిలప్రియ సమాధానం ఇచ్చారు. డీఎస్పీ కోపోద్రిక్తుడై వెయింటింగ్ స్టాల్‌లో కూర్చుంటే ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని అనడంతో.. వీరిద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్లారు.
భూమాపై కేసు నమోదుకు వ్యూహం..
అఖిలప్రియకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న భూమా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానంలను నిలదీశారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి మరి కొందరు పోలీస్ అధికారులు, రిటర్నింగ్ అధికారి సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. మరోవైపు ఎన్నికల, పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి భూమాపై కేసు నమోదు చేయడానికి వ్యూహం పన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా పోలీస్ అధికారులపై ఒత్తిడి తేవడంతో కేసు నమోదు అయ్యింది. అరెస్టు సం దర్భంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సా ర్‌సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు.
భూమా వ్యాఖ్యలకు కులం రంగు..: ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు మేరకు త్రీటౌన్ ఎస్‌ఐ సూర్యమౌళి భూ మాపై అట్రాసిటీ, నాన్‌బెయిలబుల్ కేసులను(ఎఫ్‌ఐఆర్ నెం.132/2015) నమోదు చేశారు. ‘డోంట్‌టచ్ మీ, నేను ప్రజాప్రతినిధిని’ అని మీడియా సాక్షిగా భూమా చేసిన వ్యాఖ్యలకు కులం రంగు పూశారు.