మా అబ్బాయికి బై పోలార్ డిజార్డర్... పెళ్లి చేస్తే దారిలోకొస్తాడా?
మా బాబుకు చిన్నప్పటినుంచి మానసిక రుగ్మత. దానికి మందులు ఇప్పిస్తూ వచ్చాము. ఇప్పుడు వాడికి 29 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ ఇంజినీర్. వయసుతోపాటే వాడి స్నేహాలు కూడా పెరిగిపోయాయి. వాడికి పెళ్లీడు వచ్చింది కాబట్టి, పెళ్లి చేసేస్తే అన్నీ అదుపులోకి వస్తాయని బంధుమిత్రులు అంటున్నారు. కానీ, చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయడం ఇష్టం లేదు. ఏం చేయమంటారు? తగిన సలహా ఇవ్వగలరు.
-భూపతి వర్మ, హైదరాబాద్
మీ వాడికి ఉన్న సమస్య దీర్ఘకాలిక మానసిక సమస్య. దీనిని బై పోలార్ డిజార్డర్ అంటారు. దీనికి పెళ్లికి ముందు, తర్వాత కూడా చికిత్స చేయాలి. అయితే మీ బంధుమిత్రులు చెబుతున్నట్లుగా అసలు విషయాన్ని దాచి పెళ్లి చేస్తే అంతా సవ్యంగా అవుతుందనడం మాత్రం చాలా పొరపాటు అభిప్రాయం. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదే. పెళ్లికి ముందు తమ పిల్లలకు ఉన్న రకరకాల మానసిక, శారీరక రుగ్మతల సంగతి దాచి, పెళ్లి చేసేస్తుంటారు.
ఆ తర్వాత ఆయా వ్యాధి లక్షణాలు ఏదో బయట పడటం, ఒకరినొకరు నిందించుకోవటం...ఫలితంగా వారి జీవితాలు దుర్భరంగా మారటం... మీరు మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు. అయితే పెళ్లికి ముందే అతనికి ప్రీ మేరిటల్ కౌన్సెలింగ్ ఇప్పించాలి. మానసిక రుగ్మతలకు వాడే మందులను ఆపి వెయ్యడం మంచిది కాదు. లైంగిక జీవితంపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుంది? మందుల డోసేజీ తగ్గించవచ్చా లేదా? వంటి విషయాలపై డాక్టర్ సలహా తీసుకోవాలి. పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు.
అంతమాత్రాన పూర్తిగా తగ్గినట్లు కాదు. అమ్మాయి తల్లిదండ్రులకు, అమ్మాయికి కూడా అంతా వివరించి, అందుకు వారు పూర్తిగా సమ్మతించిన తర్వాతనే ముందుకు వెళ్లడం అవసరం. అతను ఏయే సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తుంటాడు? అందుకు ఏం చేయాలి? ఏ మందులు వాడాలి వంటి విషయాలన్నింటినీ వారికి వివరంగా చెప్పడం అవసరం. పెళ్లి తర్వాత కూడా మానసిక వైద్యులు, మ్యారేజ్ కౌన్సెలింగ్ నిపుణుల సలహాలు పాటిస్తూ, వారు చెప్పిన విధంగా చేయడం నడుచుకోవటం మంచిది. విష్ యు గుడ్ లక్.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్,
మెడిసిటీ హాస్పిటల్స్,
సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్