న్యూఢిల్లీ, సాక్షి: ఎన్టీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పట్టుబట్టాలనే ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో మిత్రపక్షాలకు కేంద్రంలోని బీజేపీ మొండి చేయి చూపిస్తుందా? అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి చెందిన ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం.
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నరసాపురం ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మీడియాతో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని వ్యాఖ్యానించారాయన. అలాగే.. బీహార్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపైనా స్పందిస్తూ.. జేడీయూ తీర్మానాలు చేసినంత మాత్రాన హోదా వస్తుందా? అని ఎదురు ప్రశ్నించారాయన.
‘‘కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది తీర్మానాలు చేసి ఇచ్చే అంశం కాదు. ప్రత్యేక హోదా లేదనేది బీహార్‌కు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని తెలిపారాయన. అలాగే.. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వస్తారని, ఎంపీలతో సమావేశం అవుతారని, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తామని చెప్పారాయన.
ఇక.. పోలవరం ప్రాజెక్టు అంశంపైనా స్పందిస్తూ.. నిర్మాణ వైఫల్యం వల్లే డయాఫ్రం వాల్, కాపర్ డ్యాంకు పగుళ్లు వచ్చాయన్నారు. జాతీయ ప్రాజెక్టు పొలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదంటే కేంద్రం నిర్మిస్తుందా? అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల పర్వంపైనా స్పందిస్తూ.. ఏపీలో శాంతిభద్రతలు కొలిక్కి రావడానికి రెండు, మూడు నెలల టైం పట్టొచ్చని, గత పరిస్థితుల వల్లే ఈ దాడులు కొనసాగుతున్నాయని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment