bhupendra
-
సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
మార్పు మంత్రం ఫలించేనా?
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఏకంగా సీఎం పీఠం ఎక్కితే అది విశేషమే. అందులోనూ ఆ వ్యక్తి ఏ సొంత పార్టీకో అధినేత కాకుండా, సామాన్య రాజకీయ నేత అయితే అది మరీ విశేషం. బీజేపీ పాలిత గుజరాత్లో ఆ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన 58 ఏళ్ళ భూపేంద్ర ఇప్పుడు అలా వార్తల్లో వ్యక్తి అయ్యారు. కార్పొరేటర్‌గా మొదలై ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గెలిచిన గాంధీనగర్ లోక్‌సభా స్థానంలో ఒక భాగమైన ఘాట్లోడియా నియోజకవర్గపు ఎమ్మెల్యే భూపేంద్ర. ఒకప్పుడు అదే నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నరైన గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అనుయాయుడు. నియోజకవర్గ అభివృద్ధిపై తన ప్రాంత ఎమ్మెల్యేలతో అమిత్ షా సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు ఆ కీలక నేత దృష్టిలో పడ్డారు. షా సారథ్యంలో పైకి ఎదిగారు. ఇప్పుడు షా, మోడీ ద్వయం ఆశీస్సులతోనే కొత్తవాడైనప్పటికీ కిరీటం దక్కించుకున్నారు. అదే సమయంలో మరో 15 నెలల్లో జరిగే గుజరాత్ ఎన్నికలలో పార్టీని గెలిపించే బరువు భూపేంద్ర భుజాలపై పడింది. అలా గుజరాత్ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచంలో శాశ్వతమైనది మార్పు ఒక్కటే! ఈ మార్పు మంత్రాన్ని బీజేపీ ఇప్పుడు బాగా నమ్ముతున్నట్టుంది. పరిస్థితులను బట్టి అధికార పీఠంపై కూర్చోబెడుతున్న మనుషులను మారిస్తేనే వివిధ ఎన్నికల్లో విజయతీరాలు చేరవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. జార్ఖండ్‌లో ఓటమితో, మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదు. ఎన్నికల్లో ఓటమి కన్నా సీఎంలను మార్చడమే మేలనుకుంది. అధికార యంత్రాంగంతో సఖ్యత లేకపోగా, కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం లాంటివన్నీ నిన్నటి దాకా గుజరాత్ పీఠంపై ఉన్న విజయ్ రూపాణీకి ప్రతికూలమయ్యాయి. అమిత్ షా లానే కీలకమైన జైన్ వర్గానికి చెందినవాడైనప్పటికీ, రూపాణీ సారథ్యంలో ఎన్నికలకు వెళితే ఇబ్బందే అని అధిష్ఠానం గ్రహించింది. ఇప్పుడిలా గుజరాత్ గద్దెపైకి కొత్త సీఎంను తెచ్చింది. గత 6 నెలల్లో బీజేపీ ఇలా వేర్వేరు రాష్ట్రాలలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చిందన్నది గమనార్హం. వేర్వేరు కారణాలతో ఉత్తరాఖండ్, అస్సామ్, కర్ణాటక, గుజరాత్‌లు నాలుగూ మార్పులు చూశాయి. నిజానికి, రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా నిలిచి, కేంద్రంలో ఆ పార్టీ అధికార విస్తరణకు బాటలు వేసిన రాష్ట్రం గుజరాత్. అధికార చక్రం తిప్పుతున్న మోదీ, షాల సొంత రాష్ట్రం. ఇన్నేళ్ళ పాలన తర్వాత సహజంగానే ఓటర్లలో అధికారపక్ష వ్యతిరేకత తలెత్తుతుంది. పైపెచ్చు, పాటీదార్ల (పటేల్) రిజర్వేషన్ల ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తగ్గాయి. ఎలాగోలా అప్పట్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి మాత్రం రిస్కు తీసుకోదలుచుకోలేదు. పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌ను కాంగ్రెస్, సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త మహేశ్ సవానీని ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలుగా చూపెడుతున్నాయి. దాంతో, పాటీదార్ల ఓట్లు ఆ పార్టీలకు చీలిపోకుండా చూడాలని బీజేపీ నిర్ణయించుకుంది. గుజరాత్లో గణనీయ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే పాటీదార్ల వర్గపు భూపేంద్రను కొత్త సీఎంను చేసింది. అనేక రాష్ట్రాలలో ఓబీసీ రాజకీయాలు చేస్తున్న బీజేపీ గుజరాత్లో గణనీయ సంఖ్యలో ఓబీసీలున్నా ఆ పని చేయలేదు. కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన ఎస్సార్ బొమ్మైని సీఎంను చేసినట్టే, గుజరాత్ మధ్యతరగతిలో, వృత్తినిపుణుల్లో ఎక్కువున్న పాటీదార్లకు పట్టం కట్టింది. ఓబీసీ బిల్లు, కమిషన్ లాంటి చర్యలతో ఠాకూర్లు, ప్రజాపతులు, బక్షీపంచ్ లాంటి ఓబీసీల నమ్మకాన్నీ నిలబెట్టుకుంటానని భావిస్తోంది. 2014 తర్వాత నుంచి ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా బీజేపీ మారిపోయిందని ఓ విమర్శ. ఆ మాటెలా ఉన్నా కాంగ్రెస్ పార్టీనీ, దాని హైకమాండ్ సంస్కృతినీ ఒకప్పుడు దుమ్మెత్తిపోసిన బీజేపీ తీరా ఇప్పుడు అదే కాంగ్రెస్ బాటలో నడుస్తోంది. ప్రజలో, ప్రజాప్రతినిధులో ఎన్నుకున్న నేతల కన్నా అధిష్ఠానానికి విధేయులనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమనే సీల్డ్ కవర్ సంప్రదాయానికే బీజేపీ ఓటేస్తోంది. గుజరాత్లో పోటీలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళందరినీ పక్కనపెట్టి, భూపేంద్ర లాంటి పేరు లేని పెద్దమనిషి పేరును తెర మీదకు తేవడమే అందుకు నిదర్శనం. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని, ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగిన నితిన్ పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సీఆర్ పాటిల్ సహా ఉద్దండులకు నో చెప్పి, తనదైన ఎంపికకు వారితోనే జై కొట్టించింది. అలా అధిష్ఠానం రాష్ట్ర స్థాయిలోనూ తన భల్లూకపు పట్టును మరోసారి నిరూపించుకుంది. సివిల్ ఇంజనీరింగ్ చదివి, భవన నిర్మాణాన్ని వృత్తిగా ఎంచుకున్న భూపేంద్ర సైతం సీఎం అవుతాననుకోలేదు. అనుకోకుండా దక్కిన అధికార పీఠం ఆయనకు పెను సవాలు. ఇప్పుడాయన ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, ఎన్నికల బరిలో పార్టీని విపక్ష దుర్భేద్యమైన కోటగా మార్చాల్సి ఉంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్‌లోకెల్లా అత్యధికంగా లక్ష ఓట్ల పైగా మెజారిటీతో గత 2017 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఈసారి ఆయన తనతో పాటు పార్టీకీ రాష్ట్రంలో మెజారిటీ దక్కేలా చూడాల్సి ఉంది. అనుభవం లేకున్నా, వ్యాపార వర్గాలతో ఆయనకున్న సత్సంబంధాలు ఓ సానుకూల అంశం. మరోపక్క కనీసం బీజేపీ ఇబ్బందుల్ని సొమ్ము చేసుకొనే పరిస్థితుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ లేదు. అక్కడ పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణను ఆ పార్టీ చేపట్టనే లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పీఠంపై మనుషులు శాశ్వతం కాదు. వాళ్ళను మార్చడం వల్ల అధికారం శాశ్వతంగా నిలుస్తుందనేది ఇప్పుడు అధికార బీజేపీ నమ్ముతోంది. మరి, సీఎం మార్పు మంత్రం ఫలిస్తుందా? -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
-
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్: ఆయనే ఎందుకు
గాంధీనగర్: గుజరాత్లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్(59)ను అదృష్టం వరించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, సీనియర్ నేత తరుణ్ చుగ్ హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికతో రూపానీ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు తెరపడింది. భూపేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపేంద్ర వెంట నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, విజయ్ రూపానీ, సి.ఆర్.పాటిల్ తదితరులు ఉన్నారు. నేడు భూపేంద్ర ఒక్కరే ప్రమాణం భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాణ స్వీకా రం చేస్తారని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. కేవలం ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి, 2, 3 రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీ శాసనసభా పక్ష భేటీలో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. మోదీ, షా, నడ్డాలకు కృతజ్ఞతలు తనపై నమ్మకం ఉంచి, ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు భూపేంద్ర పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విజయ్ రూపానీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. భూపేంద్ర పటేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, భూపేంద్ర నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధికి కొత్త ఉత్సాహం, ఊతం లభిస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం దక్కించుకోవాలనే.. గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది. నిజానికి తొలుత కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డయ్యూ, డామన్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు వినిపించాయి. కొత్త ముఖ్యమంత్రిగా వారిద్దలో ఒకరిని ఎంపిక చేస్తారన్న ప్రచారం సాగింది. ఆశావహుల జాబితాలో భూపేంద్ర పటేల్ పేరు లేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనను ఏకంగా సీఎం పదవి వరించడం గమనార్హం. భూపేంద్ర పటేల్ గుజరాత్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన పాటిదార్ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే పాటిదార్ వర్గాన్ని మచ్చిక చేసుకోక తప్పదన్న అంచనాతోనే బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్ రూపానీ మొదటిసారిగా 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 7న సీఎంగా మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. వార్డు కౌన్సిలర్ నుంచి సీఎం దాకా.. అహ్మదాబాద్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌ను రికార్డు స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. గుజరాత్ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ 2012 నుంచి 2017 దాకా ఘాట్లోడియా స్థానం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. భూపేంద్ర పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. అభిమానులు, అనుచరులు దాదా అని పిలుచుకుంటారు. అనందిబెన్ పటేల్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన 1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. అహ్మద్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిపొ్లమా పూర్తిచేసిన భూపేంద్ర పటేల్ పాటిదార్ సామాజికవర్గంలోని కాడ్వా అనే ఉప కులానికి చెందినవారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పాటిదార్ వర్గం నేతలు లియువా అనే ఉప కులానికి చెందినవారు. భూపేంద్ర పాటిదార్ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పని చేయకుండానే ఆయన సీఎం అవుతుండడం విశేషం. ఆయనే ఎందుకు? వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను అధిష్టానం భూపేంద్ర పటేల్‌పై మోపింది. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. బలమైన పాటిదార్(పటేల్) సామాజికవర్గంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు చూరగొన్న వ్యక్తి కావడమే ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో భూపేంద్ర అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. నగర అభివృద్ధి విషయంలో మోదీ ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. అప్పుడే మోదీ దృష్టిలో సమర్థవంతుడైన నాయకుడిగా ముద్రపడ్డారు. ఇటీవల కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు బాధితుల కోసం భూపేంద్ర ఆక్సిజన్ సిలిండర్లు విరివిగా సమకూర్చారు. ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేయించారు. పదవిలో ఉన్నప్పటికీ ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండడం, తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోవడం భూపేంద్ర ప్రత్యేకత. ఇవన్నీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆనందిబెన్ పటేల్ సిఫారసు కూడా బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపేలా చేసింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తమ పార్టీ అధిష్టానం ఆనందిబెన్ అభిప్రాయానికి విలువనిచి్చందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. లేకపోతే నితిన్ పటేల్ గానీ, మరొకరు గానీ ముఖ్యమంత్రి అయ్యేవారని వెల్ల డించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మన్సుఖ్ మాండవియా(ప్రస్తుతం కేంద్ర మంత్రి) గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పాటిదార్ వర్గం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల వెనుక చేరకుండా చూడాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని మరో నేత చెప్పాడు. గుజరాత్ జనాభాలో పాటిదార్ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్ కావడం గమనార్హం. 1995 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న పాటిదార్లు 2015లో రిజర్వేషన్ల ఆందోళనతో కొంత దూరమయ్యారు. -
గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
-
గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్: కౌన్సిలర్ స్థాయి నుంచి
గాంధీనగర్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా పటేల్‌ను ఎన్నుకుంది. భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం సమావేశమైన శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకుంది. సోమవారం భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం పటేల్ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పేరును ఖరారు చేశారు. విజయ్ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మేరకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రంలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. పాటిదార్ సామాజిక వర్గానికే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కొనసాగనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు జరిగే భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. భూపేంద్ర చరిత్ర పూర్తి పేరు: భూపేంద్రభాయి రజనీకాంత్ భాయి పటేల్ ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2017 ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ విజయం. తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి చెందిన శశికాంత్ పటేల్ పై లక్షా 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డ్ నెలకొల్పారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్‌గా బాధ్యతలు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (AUDA) చైర్మన్‌గా విధులు మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు సన్నిహితుడుగా పేరు పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్, పటీదార్ సంస్థలు సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ల ట్రస్టీగా ఉన్నారు. 1999-2000లో మేమ్‌నగర్ నగర్పాలిక అధ్యక్షుడు 2008-10లో AMC స్కూల్ బోర్డ్ వైస్ ఛైర్మన్ 2010-15లో తల్తేజ్ వార్డ్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నిక చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం -
ఢిల్లీలో కాల్పుల కలకలం
ఢిల్లీ: దేశరాజధానిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ గ్యాంగ్‌స్టర్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మియన్వాలి ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న భూపేంద్ర అనే గ్యాంగ్‌స్టర్.. మిత్రుడు అరుణ్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ విజయ్‌తో కలిసి కారులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుల్దీప్ అనే మరో కానిస్టేబుల్ సైతం ఈ ఘటనలో గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.