మార్పు మంత్రం ఫలించేనా? | Sakshi Editorial On Bhupendra Patel Sworn In As Gujarat CM | Sakshi
Sakshi News home page

మార్పు మంత్రం ఫలించేనా?

Published Tue, Sep 14 2021 2:34 AM | Last Updated on Tue, Sep 14 2021 1:17 PM

Sakshi Editorial On Bhupendra Patel Sworn In As Gujarat CM

ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఏకంగా సీఎం పీఠం ఎక్కితే అది విశేషమే. అందులోనూ ఆ వ్యక్తి ఏ సొంత పార్టీకో అధినేత కాకుండా, సామాన్య రాజకీయ నేత అయితే అది మరీ విశేషం. బీజేపీ పాలిత గుజరాత్‌లో ఆ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన 58 ఏళ్ళ భూపేంద్ర ఇప్పుడు అలా వార్తల్లో వ్యక్తి అయ్యారు. కార్పొరేటర్‌గా మొదలై ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా గెలిచిన గాంధీనగర్‌ లోక్‌సభా స్థానంలో ఒక భాగమైన ఘాట్లోడియా నియోజకవర్గపు ఎమ్మెల్యే భూపేంద్ర. ఒకప్పుడు అదే నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ గవర్నరైన గుజరాత్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌కు అనుయాయుడు. నియోజకవర్గ అభివృద్ధిపై తన ప్రాంత ఎమ్మెల్యేలతో అమిత్‌ షా సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు ఆ కీలక నేత దృష్టిలో పడ్డారు. షా సారథ్యంలో పైకి ఎదిగారు. ఇప్పుడు షా, మోడీ ద్వయం ఆశీస్సులతోనే కొత్తవాడైనప్పటికీ కిరీటం దక్కించుకున్నారు. అదే సమయంలో మరో 15 నెలల్లో జరిగే గుజరాత్‌ ఎన్నికలలో పార్టీని గెలిపించే బరువు భూపేంద్ర భుజాలపై పడింది. అలా గుజరాత్‌ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. 

ప్రపంచంలో శాశ్వతమైనది మార్పు ఒక్కటే! ఈ మార్పు మంత్రాన్ని బీజేపీ ఇప్పుడు బాగా నమ్ముతున్నట్టుంది. పరిస్థితులను బట్టి అధికార పీఠంపై కూర్చోబెడుతున్న మనుషులను మారిస్తేనే వివిధ ఎన్నికల్లో విజయతీరాలు చేరవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. జార్ఖండ్‌లో ఓటమితో, మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదు. ఎన్నికల్లో ఓటమి కన్నా సీఎంలను మార్చడమే మేలనుకుంది. అధికార యంత్రాంగంతో సఖ్యత లేకపోగా, కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం లాంటివన్నీ నిన్నటి దాకా గుజరాత్‌ పీఠంపై ఉన్న విజయ్‌ రూపాణీకి ప్రతికూలమయ్యాయి. అమిత్‌ షా లానే కీలకమైన జైన్‌ వర్గానికి చెందినవాడైనప్పటికీ, రూపాణీ సారథ్యంలో ఎన్నికలకు వెళితే ఇబ్బందే అని అధిష్ఠానం గ్రహించింది. ఇప్పుడిలా గుజరాత్‌ గద్దెపైకి కొత్త సీఎంను తెచ్చింది. గత 6 నెలల్లో బీజేపీ ఇలా వేర్వేరు రాష్ట్రాలలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చిందన్నది గమనార్హం. వేర్వేరు కారణాలతో ఉత్తరాఖండ్, అస్సామ్, కర్ణాటక, గుజరాత్‌లు నాలుగూ మార్పులు చూశాయి. 

నిజానికి, రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా నిలిచి, కేంద్రంలో ఆ పార్టీ అధికార విస్తరణకు బాటలు వేసిన రాష్ట్రం గుజరాత్‌. అధికార చక్రం తిప్పుతున్న మోదీ, షాల సొంత రాష్ట్రం. ఇన్నేళ్ళ పాలన తర్వాత సహజంగానే ఓటర్లలో అధికారపక్ష వ్యతిరేకత తలెత్తుతుంది. పైపెచ్చు, పాటీదార్ల (పటేల్‌) రిజర్వేషన్ల ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తగ్గాయి. ఎలాగోలా అప్పట్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి మాత్రం రిస్కు తీసుకోదలుచుకోలేదు. పాటీదార్‌ ఉద్యమకారుడు హార్దిక్‌ పటేల్‌ను కాంగ్రెస్, సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త మహేశ్‌ సవానీని ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ నేతలుగా చూపెడుతున్నాయి. దాంతో, పాటీదార్ల ఓట్లు ఆ పార్టీలకు చీలిపోకుండా చూడాలని బీజేపీ నిర్ణయించుకుంది. గుజరాత్‌లో గణనీయ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే పాటీదార్ల వర్గపు భూపేంద్రను కొత్త సీఎంను చేసింది. అనేక రాష్ట్రాలలో ఓబీసీ రాజకీయాలు చేస్తున్న బీజేపీ గుజరాత్‌లో గణనీయ సంఖ్యలో ఓబీసీలున్నా ఆ పని చేయలేదు. కర్ణాటకలో లింగాయత్‌ వర్గానికి చెందిన ఎస్సార్‌ బొమ్మైని సీఎంను చేసినట్టే, గుజరాత్‌ మధ్యతరగతిలో, వృత్తినిపుణుల్లో ఎక్కువున్న పాటీదార్లకు పట్టం కట్టింది. ఓబీసీ బిల్లు, కమిషన్‌ లాంటి చర్యలతో ఠాకూర్లు, ప్రజాపతులు, బక్షీపంచ్‌ లాంటి ఓబీసీల నమ్మకాన్నీ నిలబెట్టుకుంటానని భావిస్తోంది.  

2014 తర్వాత నుంచి ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా బీజేపీ మారిపోయిందని ఓ విమర్శ. ఆ మాటెలా ఉన్నా కాంగ్రెస్‌ పార్టీనీ, దాని హైకమాండ్‌ సంస్కృతినీ ఒకప్పుడు దుమ్మెత్తిపోసిన బీజేపీ తీరా ఇప్పుడు అదే కాంగ్రెస్‌ బాటలో నడుస్తోంది. ప్రజలో, ప్రజాప్రతినిధులో ఎన్నుకున్న నేతల కన్నా అధిష్ఠానానికి విధేయులనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమనే సీల్డ్‌ కవర్‌ సంప్రదాయానికే బీజేపీ ఓటేస్తోంది. గుజరాత్‌లో పోటీలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళందరినీ పక్కనపెట్టి, భూపేంద్ర లాంటి పేరు లేని పెద్దమనిషి పేరును తెర మీదకు తేవడమే అందుకు నిదర్శనం. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని, ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగిన నితిన్‌ పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సీఆర్‌ పాటిల్‌ సహా ఉద్దండులకు నో చెప్పి, తనదైన ఎంపికకు వారితోనే జై కొట్టించింది. అలా అధిష్ఠానం రాష్ట్ర స్థాయిలోనూ తన భల్లూకపు పట్టును మరోసారి నిరూపించుకుంది.  

సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివి, భవన నిర్మాణాన్ని వృత్తిగా ఎంచుకున్న భూపేంద్ర సైతం సీఎం అవుతాననుకోలేదు. అనుకోకుండా దక్కిన అధికార పీఠం ఆయనకు పెను సవాలు. ఇప్పుడాయన ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, ఎన్నికల బరిలో పార్టీని విపక్ష దుర్భేద్యమైన కోటగా మార్చాల్సి ఉంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్‌లోకెల్లా అత్యధికంగా లక్ష ఓట్ల పైగా మెజారిటీతో గత 2017 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఈసారి ఆయన తనతో పాటు పార్టీకీ రాష్ట్రంలో మెజారిటీ దక్కేలా చూడాల్సి ఉంది. అనుభవం లేకున్నా, వ్యాపార వర్గాలతో ఆయనకున్న సత్సంబంధాలు ఓ సానుకూల అంశం. మరోపక్క కనీసం బీజేపీ ఇబ్బందుల్ని సొమ్ము చేసుకొనే పరిస్థితుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ లేదు. అక్కడ పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణను ఆ పార్టీ చేపట్టనే లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పీఠంపై మనుషులు శాశ్వతం కాదు. వాళ్ళను మార్చడం వల్ల అధికారం శాశ్వతంగా నిలుస్తుందనేది ఇప్పుడు అధికార బీజేపీ నమ్ముతోంది. మరి, సీఎం మార్పు మంత్రం ఫలిస్తుందా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement