అహ్మద్‌బాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబోటీ మెజారిటీ బీజేపీ గట్టెక్కిన సంగతి తెలిసిందే. బీజేపీ అధినేత అమిత్ షా గుజరాత్‌లో 'మిషన్-150' టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ, బీజేపీ సెంచరీ మార్కు దాటలేకపోయింది. 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో ఆ పార్టీ 99 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది. సహజంగానే సీఎం పదవికి విజయ్ రుపానీ ఫెవరెట్ అని వినిపిస్తున్నా.. అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశముందని వినిపిస్తోంది.
మరో పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీనే కొనసాగిస్తామని గత ఏడాది అమిత్ షా తమకు చెప్పినట్టు బీజేపీ అగ్రనేతలు అంటున్నారు. బీజేపీ తాజా ఎన్నికల్లో అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేకపోయిన నేపథ్యంలో నాయకత్వాన్ని మారిస్తే తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని, ఈ విషయంలో అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముందని కమలం నేతలు అంటున్నారు. ఒకవేళ రుపానీని కాదని సీఎం పదవికి మరొకరిని తెరపైకి తెస్తే.. రాష్ట్ర నాయకత్వంపై ఆయన నమ్మకం కోల్పోయినట్టు అవుతుందని బీజేపీ గుజరాత్ నేతలు అంటున్నారు. అంతేకాకుండా రుపానీ అమిత్ షాకు సన్నిహితుడు. క్లీన్ ఇమేజ్ ఉండి.. కులముద్రలేని నాయకుడు. కాబట్టి ఈసారి కూడా ఆయననే సీఎం పదవి వరించవచ్చునని అంటున్నారు.
అయితే, అమిత్ షా వైఖరి బాగా తెలిసినవాళ్లు మాత్రం రుపానీ ఫెవరేట్ అని ఇప్పుడే అనడం సరికాదని పేర్కొంటున్నారు. అనూహ్యంగా నిర్ణయాలను తీసుకొని ప్రజలను సర్‌ప్రైజ్ చేయడంలో అమిత్ షాకు మంచి పేరుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత యోగిఆదిత్యనాథ్ పేరును, హరియాణాలో మనోహర్‌లాల్ ఖట్టర్ పేరును ఇలా అనూహ్యంగా తెరపైకి తెచ్చి ఆయన ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆనందిబేన్ రాజీనామా తర్వాత విజయ్ రుపానీ పేరును కూడా సర్‌ప్రైజ్ రూపంలోనే షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ సీఎంగా కొత్త పేరు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని, చివరినిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి.. సర్‌ప్రైజ్ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించినా ప్రకటించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గుజరాత్ సీఎం ఎంపిక కోసం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25లోపు గుజరాత్ సీఎంను ఖరారుచేయవచ్చునని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment