గుజరాత్ మంత్రివర్గ ప్రమాణస్వీకారం (ఫైల్ ఫొటో)
గాంధీనగర్ : కొత్తగా ఏర్పాటయిన గుజరాత్ కేబినెట్‌లో శాఖల కిరికిరి మొదలైంది. మొన్నటిదాకా మంత్రివర్గంలో నంబర్-2గా కొనసాగిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు.. ఈ దఫా కీలకమైన ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కలేదు. శాఖల కోతను అవమానంగా భావిస్తోన్న నితిన్.. విధుల్లో చేరేందుకు విముఖంగా ఉన్నారు. శుక్రవారం నాటికి దాదాపు మంత్రులంతా బాధ్యతలు స్వీకరించినా.. ఆయన మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇది తమ నాయకుడి ఆత్మగౌరవ సమస్య అని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని నితిన్ సన్నిహిత వర్గీయులు వ్యాఖ్యానించారు.
చేజారిన టాప్ పోస్ట్! : 2016 ఆగస్టులో ఆనందిబెన్ పటేల్ రాజీనామా అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒకదశలో ఆయన పేరునే ఖరారుచేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో విజయ్ రూపానీకి సీఎం పీఠం దక్కింది. కాగా, డిప్యూటీ హోదాతోపాటు ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలు దక్కడంతో నితిన్ మిన్నకుండిపోయారు. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నితిన్‌కు మరోసారి డిప్యూటీ పోస్టు లభించింది కానీ శాఖల్లో కోత పడింది. ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్‌కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్ పటేల్‌కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు.
తాడోపేడో తేల్చుకుంటాం : శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమానభరంతో రగిలిపోతున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. పాత శాఖలను తిరిగి కేటాయిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని నితిన్ బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లుతెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్(ఫైల్ ఫొటో)
Comments
Please login to add a commentAdd a comment