Bibi Jaan
-
తెగిన రెక్కలు..బతుకు ముక్కలు
పెళ్లి వయసు కాదు.. మెడలో తాళి పడింది. ఇకపై అన్నీ ఆయనే.. ఈ పెత్తనంతోనేమో ఆదరించాల్సిన చేతులు పదే పదే లేచాయి. కాపు కాయాల్సిన కళ్లు అణువణువూ అనుమానపు పొరలు కప్పుకున్నాయి. ఆయన తాగొచ్చిన ప్రతిసారీ ఆమె శరీరంపై వాతలు తేలాయి. ఇది వరకెప్పుడూ కన్నీళ్లు రాలేదు.. పెళ్లయ్యాక అవే తోడయ్యాయి. రోజూ వేధింపులే.. ఇక భరించలేనంటూ ఇద్దరు బిడ్డలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మనిషి రూపంలో ఉన్న ఆ మృగం అక్కడికీ వచ్చాడు. కిరాతకంగా ఆమె రెండు చేతులు తెగ నరికాడు. బతుకును ముక్కలు చేశాడు. ఆ సమయంలో బతకలేననుకుంది.. ఇద్దరు పిల్లలు..వాళ్లకు రెక్కలు తేవాలి.. ఆ మానవ మృగానికి శిక్ష పడాలి. అందుకే బతకాలి. పోరాడింది.. ఆ మృగాడిని కటకటాల వెనక్కి పంపే వరకూ పోరాడింది. ఇప్పుడు బిడ్డల భవిష్యత్తే శ్వాసగా కాలం వెళ్లదీస్తోంది తెనాలికి చెందిన బీబీజాన్..మళ్లీ అమ్మ ఒడిలో చిన్నపాపగా.. అనుమానం పెనుభూతంలా మారిన కర్కశత్వానికి రెండు చేతులనూ కోల్పోయిన మానవి తెనాలికి చెందిన బీబీజాన్ (28). గృహహింసతో బిడ్డలతో సహా పుట్టింటికి పారిపోయిన ఆమెను భర్త వదల్లేదు. తలుపు పగులగొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించి, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న తనను నరికాడు. తెగిపడిన చేతులను పట్టుకుని రాక్షసంగా ప్రవర్తించాడు. ఆరేళ్లుగా ప్రతి చిన్నపనికీ తల్లిపై ఆధారపడుతూ రోజులు నెట్టుకొస్తోంది. ఆటవిక దాడికి పాల్పడి తనను జీవితాంతం నిస్సహాయురాలిగా చేసిన తాళి కట్టిన మృగాన్ని జైలుకు పంపాలన్న పంతాన్ని నెరవేర్చుకుంది. హాస్టల్లో ఉంటూ చదువుతున్న బిడ్డల భవిష్యత్తే బతుక్కి శ్వాసగా జీవిస్తోంది. 2012 జనవరి 6 నాటి దుర్మార్గం, న్యాయపోరాటం, జీవితేచ్ఛతో సాగిస్తున్న జీవన పోరాటం తన మాటల్లోనే... తెనాలి: ‘వాడు మొగుడు కాదు..రెండు కాళ్ల జంతువు. వాడి పీడ పడలేక ఇద్దరు పిల్లల్ని తీసుకొని, అమ్మ దగ్గరకొచ్చి ఉంటున్నా. 2012 జనవరి 6వ తేదీ శుక్రవారం. మధ్యాహ్నం నమాజు చదువుకుని కూర్చొన్నాను. ముందు తలుపు వేసే ఉంది. వెనుక తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడ్డాను. ఆ మృగమే వచ్చిందనుకున్నా...తలుపు రెక్క విడవటం, అంతలావు కత్తితో ఊగిపోతున్న మనిషిని చూడగానే భయంతో వణికిపోయా. ఒక బిడ్డను చంకనేసుకుని, ఇంకో బిడ్డను చేయి పట్టుకుని బయటకు పరుగెత్తబోయా...సర్ర్మన్న చప్పుడు...కుడిభుజంపై నిప్పుతో కాల్చినంత బాధ...రక్తం చివ్వున ఎగిసిపడటం కనిపించింది...మరో క్షణంలోనే రెండో భుజం...రెండు చేతులూ తెగి కిందపడ్డాయి. గుండె జారిపోయింది. నేలక్కరుచుకోవటమే గుర్తుంది...’ అని నాటి ఆటవిక దాడిని తలచుకున్నపుడు బీబీజాన్ ఉద్వేగానికి గురైంది. రెండు చేతులూ నరికేశాడు... నా పేరు బీబీజాన్. మాది తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ. నాకు 15 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. 22 ఏళ్ల వయసుకే ఐదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు. భర్త చిన ఖాశింది బట్టల వ్యాపారం. తాగటం, తన్నటం, గొడవలు పడటం మామూలే. కొద్ది రోజులకు సర్దుకుపోతుంటాం. నాపై అనుమానం రోజురోజుకీ పెరగసాగింది. హింస భరించటానికి కష్టమైంది. మెగుడూ మొద్దులూ వద్దనుకొని బిడ్డల్ని తీసుకొని అమ్మ వాళ్లింటికెళ్లి తలదాచుకున్నా. అక్కడ కూడా వదల్లేదా దుర్మార్గుడు. ఆ రోజు బలవంతంగా ఇంట్లోకి వచ్చి నా చేతులు నరికేశాడు. వీపుపైనా, తొడల మీదా చేసిన దాడికి ఒళ్లు పచ్చిపుండైంది. చచ్చిపోయాననే అనుకున్నా. బతకలేదన్నారు... మెలకువ వచ్చేసరికి ఎక్కడున్నానో తెలీదు...‘పోయిందిగా...పోస్టుమార్టంకు పంపుదామా’ అన్న మాటలు వినిపించాయి. ఎవరో చేతిని పట్టుకుని, ‘లేదు..లేదు బతికే ఉంది’ అన్నారు. మెల్లగా కళ్లు తెరిచి చూశాను. పెద్దాసుపత్రిలో ఉన్నట్టు అర్థమైంది. డాక్టరు, నర్సులు, పక్కన పోలీసులు...చేతులకేసి చూసుకుంటే భుజాల దిగువన కట్లు...దుఃఖం తన్నుకొచ్చింది. నాకు తెలియకుండానే కన్నీటి పొర కట్టలు తెంచుకుంది. మంచం పక్కనే బిడ్డలు బిక్కమొఖంతో నా రెండు చేతులవైపు అమాయకంగా చూస్తున్నారు. వారిని దగ్గరకు తీసుకుందామని రెండు చేతులు చాచపోయాను. సూదులు పొడిచినట్లు నొప్పులు..బిడ్డలను పట్టుకోలేకపోయాననే గుండెలను పిండే బాధ.. రెండూ ఒకేసారి కలిపి నా దుస్థితిని వెక్కిరించినట్టే అనిపించాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిన కళ్లలో పిల్లలే మెదిలాడారు. అభం శుభం తెలీని వాళ్ల కోసం ఎలాగైనా బతకాలనుకున్నాను. ఇదే సమయంలో నాపై ఘోరానికి తలపడిన కిరాతకుడికి శిక్ష పడేలా చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. ఆ సంకల్పంతోనే మూడు నెలలకుపైగా మృత్యువుతో పోరాడి బతికా. మధ్యాహ్నం నమాజు చదువుకుని కూర్చొన్నాను. ముందు తలుపు వేసే ఉంది. వెనుక తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడ్డాను. ఆ మృగమే వచ్చిందనుకున్నా...తలుపు రెక్క విడవటం, అంతలావు కత్తితో ఊగిపోతున్న మనిషిని చూడగానే భయంతో వణికిపోయా. ఒక బిడ్డను చంకనేసుకుని, ఇంకో బిడ్డను చేయి పట్టుకుని బయటకు పరుగెత్తబోయా...సర్ర్మన్న చప్పుడు...కుడిభుజంపై నిప్పుతో కాల్చినంత బాధ...రక్తం చివ్వున ఎగిసిపడటం కనిపించింది...మరో క్షణంలోనే రెండో భుజం...రెండు చేతులూ తెగి కిందపడ్డాయి. న్యాయపోరాటంలో గెలిచా... సిరి మహిళా సాధికారిత సంఘం అనే సంస్థ అండగా న్యాయ పోరాటానికి దిగా. కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయ్. ‘సిరి’ ప్రతినిధులు తోడునీడుగా వీటిని ఎదుర్కొన్నాను. రాయబారాలు నడిపిన ప్రబుద్ధుడు నేరుగా కాళ్ల బేరానికొచ్చాడు. రూ.3 లక్షలు ఇస్తానని ప్రలోభపెట్టినా లొంగ లేదు. న్యాయ పోరాటంలో గెలిచాను. ఘాతుకానికి తగిన శిక్ష పడింది. ప్రభుత్వానికి నా బాధను విన్నవించాను. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ నా బిడ్డలు సద్దాం హుస్సేన్ (11) ఆరో తరగతి, ఆసియాబేగం (10) ఐదో తరగతి చదువుతున్నారు. నా తల్లికి రోజూ కన్నీటితో అభిషేకిస్తున్నా.. తల్లి షేక్ హబీబూన్ (55) సంరక్షణలో ఉంటూ నేను జీవనపోరాటం చేస్తున్నా. పసితనంలో సాకినట్టే, ఈ వయసులోనూ నా ఆలనాపాలన చూస్తోంది. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ ‘పెద్దయ్యాక నాకు ఇంత ముద్ద పెడతావా బేటీ’ అనేది. కానీ ఈ వయసులో కూడా అమ్మే నాకు తినిపించాల్సి వస్తోంది. అమ్మ మాటలు తలుచుకుంటే గుండె చెరువవుతుండేది. ఏం చేయను. తల్లి రుణం ఎలా తీర్చుకోగలను. అమ్మకు రెండు చేతులతో మొక్కలేని అశక్తురాలిని. అందుకే రోజూ మనసులోనే కన్నీటితో అభిషేకం చేస్తున్నా. పింఛను డబ్బులు, రేషను బియ్యమే మా జీవనాధారం. ఇంత పేదరికం అనుభవిస్తున్నా..కష్టాలతో కాలం వెళ్లదీస్తున్నా నాకున్న ఆశ ఒక్కటే. బిడ్డల్ని చదివించి ప్రయోజకుల్ని చేయాలి. వాళ్ల జీవితాలను విద్యా దీపంతో వెలిగించాలి. పదో తరగతి తర్వాత ఎలాగనేది అర్థం కావటం లేదు. సమాజంలో ఏదో మూల మానవత్వం బతికే ఉందనుకుంటున్నా.. అదే నా బిడ్డలకు చేయూతనిస్తుందనే నమ్మకంతో బతుకుతున్నా. -
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
-
పరువు హత్య కేసులో ప్రియుడు, తల్లి అరెస్ట్
మృతురాలి ప్రియుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు సాక్షి, విజయవాడ : విజయవాడలో జరిగిన పరు వు హత్య కేసులో మృతురాలు నజ్మా ప్రియుడు దీపక్‌ను, హత్య చేసిన తల్లి బీబీజానీని పోలీసు లు శుక్రవారం అరెస్టు చేశారు. తన కుమార్తెను లైంగికంగా ఇబ్బందిపెట్టాడని, ఇద్దరూ తీయిం చుకున్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికాకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడని నజ్మా తండ్రి మైసూర్ జాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దీపక్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. దీపక్ కాల్‌డేటాను పరిశీలించి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన నజ్మా తల్లి బీబీజానీని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో సీఐ సహేరా బేగం నిర్వహించిన విచారణలో పలు వాస్తవాలు వెలుగుచూశాయి. నజ్మా కుటుంబం మూడునెలలుగా వాంబే కాలనీలో ఉంటోంది. ఎంబీయే చదివి భార్య నుంచి విడాకులు తీసుకున్న దీపక్ అదే కాలనీలో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దీపక్ రెండు నెలలుగా నజ్మాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ వ్యవహారంపై మందలించినా నజ్మా వినకపోవడంతో తల్లి బీబీజాని ఆమెను చంపేసింది. మైనర్ కావటంతోనే పోక్సో చట్టం 17ఏళ్ల బాలిక నజ్మాను ప్రేమపేరుతో వేధించాడని, పరోక్షంగా ఆమె మరణానికి కారకుడయ్యాడనే ఆరోపణలతో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్ట్ -2012 (పోక్సో చట్టం), కిడ్నాప్ తదితర కేసులను పోలీసులు దీపక్‌పై నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం ప్రకారం.. బాలిక ఇష్టపూర్వకంగా ప్రియుడితో బయటకు వెళ్లినా అతడిదే నేరం అవుతుంది. బాలికల్ని ప్రేమించటం నేరం. -
పరువు కోసం పేగుబంధాన్ని తెంచుకుంది!
ప్రేమలో పడిందని కూతుర్ని కడతేర్చిన తల్లి * విజయవాడలో దారుణం వీరులపాడు: పేగుబంధం విలువ.. నవమాసాలు మోసిన తల్లికి మాత్రమే తెలుస్తుందంటారు. కానీ ఓ కన్నతల్లి పరువు కోసం కూతురి ఉసురు తీసింది. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న వ్యక్తి ప్రేమలో పడిందంటూ కుమార్తెను కడతేర్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన మైసూర్ జానీకి 20 ఏళ్ల కిందట బీబీజానీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. విజయవాడ వాంబే కాలనీలో నివాసముంటున్నారు. చిన్న కుమార్తె నజ్మా(16) నగరంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమె వారు నివాసముంటున్న అపార్ట్మెంట్ పైఅంతస్తులో ఉండే దీపక్ అనే వివాహితుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో నజ్మాను మందలించింది. అయినా వినకపోవడంతో బుధవారం నిద్రపోతున్న కుమార్తెను హతమార్చింది. కాగా, నజ్మా మృతిపై దీపక్ ఫిర్యాదు చేయడంతో విజయవాడ నున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జుజ్జూరులో కూతురి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న తల్లిదండ్రులను విచారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అదేరోజు రాత్రి కుటుంబసభ్యులకు అందజేయడంతో వారు కూతురి అంత్యక్రియలు నిర్వహించారు. చెప్పినా వినలేదని.. బీబీజానీ గురువారం జుజ్జూరులో విలేకరులతో మాట్లాడింది. వివాహితుడైన దీపక్‌తో నజ్మా ప్రేమలో పడిందని తెలిసి మందలించానని చెప్పింది. తన కూతురి జీవితం నాశనం చేయొద్దని దీపక్‌ను వేడుకున్నానంది. కానీ అతను వినకపోగా నజ్మాతో తన పెళ్లి జరిపించాలని, లేకుంటే తామిద్దరం దిగిన ఫొటోలను నెట్లో పెడతానని బెదిరించాడని తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నం దీపక్‌తో కలసి ద్విచక్రవాహనంపై వచ్చిన నజ్మాను మరోసారి మందలించగా తనను ఇష్టమొచ్చినట్లు తిట్టిందని చెప్పింది. కుటుంబ పరువు పోతుందన్నా వినలేదనే ఆక్రోశంతో నిద్రపోతున్న కూతురి మొహంపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు చెబుతూ కన్నీటిపర్యంతమైంది. కన్న కూతురిని కడతేర్చినట్లు బీబీ జానీ స్వయంగా ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
కన్నకూతురిని హతమార్చిన తల్లి
విజయవాడ: బెజవాడ వాంబే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లే రక్తం పంచుకు పుట్టిన కూతురిని హతమార్చింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే పేగు బంధాన్ని మర్చిపోయింది. తన కుటుంబం పరువు పోతుందని భావించి... కన్న కూతుర్నే కడతేర్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించిన తల్లి పరువు పోతుందని కూతురి మొహంపై దిండుతో అదిమి హత్య చేసింది. అనంతరం అనారోగ్యంతో చనిపోయినట్లు చుట్టుపక్కలవారిని నమ్మించింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ కూడా కూతురు మాట వినకపోవడంతో బీబీజాన్‌కు కోపం వచ్చింది. దీంతో కూతుర్ని హతమార్చాలని పథకం వేసింది. భర్తను బయటకు పంపి నజ్మా మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం కూతురు కడుపు నొప్పితోనే చనిపోయిందంటూ భర్తకు కట్టుకథ చెప్పింది. స్వస్థలం కంచికచర్లలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే చలాకీగా కనిపించిన యువతి ఆకస్మాత్తుగా చనిపోవడంపై ప్రియుడికి అనుమానం వచ్చింది. అతడు సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. నజ్మా మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపగా, నివేదికలో హత్యగా తేలింది. దీంతో బీబీజాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ మృతి
-
మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ మృతి
హైదరాబాద్: మక్కాలో గురువారం చోటుచేసుకున్న హజ్ యాత్రికుల తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ బీబీ జాన్ ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బీబీ జాన్ రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌కు చెందిన మహిళ. ఆమె మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా మక్కాకు బయలుదేరి వెళ్లి దురదృష్టవశాత్తు మృత్యువాత పడింది. రంగారెడ్డిజిల్లాకు చెందిన బీబీ జాన్ ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఉంటోంది. మరోపక్క, తెలంగాణ ప్రాంతం నుంచి మక్కాకు వెళ్లిన తమ వారి వివరాలు తెలుసుకునేందుకు హజ్ కమిటీ ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. వివరాలు పొందగోరువారు 040-23214125కు ఫోన్ చేయవచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ అలీ హజ్ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.